‘సూపర్’కే మొగ్గు
♦ 17న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ
♦ ‘సబ్ క్రిటికల్’పై వ్యతిరేకత
♦ టెక్నాలజీ మార్చాల్సిందే అంటున్నప్రజలు
మణుగూరు : భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) విషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న ప్లాంట్‌కు సంబంధించి ఈనెల 17న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్లాంట్ నిర్మాణంలో వాడే సబ్ క్రిటికల్ టెక్నాలజీపైనే రగడ మొదలైంది. కాలుష్యం వెదజల్లే ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీ’ని దేశంలో ఎక్కడా వాడకూడదని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులు, కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించాయి. దీనికి బదులు కాలుష్యం తక్కువ వెదజల్లే ‘సూపర్ క్రిటికల్ టెక్నాలజీ’ వాడాలని నిర్ణయించారు. అయితే దీనికి విరుద్ధంగా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ జెన్‌కో ఉపయోగిస్తోంది. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్ర పర్యావరణ శాఖ ఆగ్రహంతో పనులు నిలిపేశాయి.
సూపర్ క్రిటికల్ ఎందుకంటే...
లక్షల టన్నుల బొగ్గును మండించినప్పుడు భారీగా కాలుష్యం వస్తుంది. అయితే ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీ’లో డ్రమ్‌తో కూడిన స్టీమ్ జనరేటర్ ద్వారా నీరు లేదా ఆవిరి వివిధ దశల్లో ప్రాసెస్ అవుతోంది. ఎక్కువ దశల వల్ల కాలుష్యం ఎక్కువ విడుదల అవుతుంది. ఇక ‘సూపర్ క్రిటికల్’ పద్ధతిలో డ్రమ్ లేకుండా జనరేటర్ కలిగిన బా యిలర్ ఉంటుంది. ఇది అవసరానికి తగినట్లు ఆటోమేటిగ్గా ఆపరేట్ అవుతుంది. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది. దీనినే వాడాలని కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించింది.
‘సూపర్’ టెక్నాలజీ వాడాలి
కాలుష్యం తక్కువగా విడుదల చేసే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించి పవ ర్ ప్లాంట్ నిర్మించాలి. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వదిలేయాలి. జెన్‌కో అధికారులు టెక్నాలజీ మార్పునకు సంబంధించి చర్యలు తీసుకోవాలి.
- పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే
చర్చ స్పష్టంగా ఉండాలి
గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్రం ఆగ్రహించడంతో పనులు నిలిపేసిన జెన్‌కో తీరి గ్గా ప్రజాభిప్రాయ సేకరణకు దరఖాస్తు చేసుకుంది. దీనిని తూతూమంత్రంగా ముగించాలని చూస్తే సహిం చేది లేదు. అన్నింటిపై స్పష్టంగా చర్చ జరపాలి. - వట్టం నారాయణ, ఆదివాసీ నాయకుడు