సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకునేందుకు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతలు సొంత సర్వేల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో తమ తమ నియోజక వర్గాల్లో పరిస్థితిని, ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు.
పనితీరు మెరుగ్గా ఉండి గెలుపు అవకాశాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ దక్కుతుందని పార్టీ అధి నేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలు ‘థర్డ్ పార్టీ’ సర్వేలు చేయించుకుంటున్నారు. తమ పనితీరు, అదే సమయంలో ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈసారి గట్టిగా టికెట్ ఆశిస్తు న్న బీఆర్‌ఎస్ నేతలు కూడా సర్వేలపై ఆసక్తి చూపిస్తున్నారు.
పథకాలు, పనితీరు ప్రభావంపై అంచనా
ప్రభుత్వ పథకాలతో పాటు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఇతర పనులు ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందో ఓ అంచనాకు వచ్చేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, కింది స్థాయిలో కేడర్ పనితీరు తమ గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.
పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకుల పనితీరు పైనా, తమతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారేమైనా దుర్వినియోగం చేశారా అనే కోణంలోనూ సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలతో పాటు వివిధ మార్గాల్లో ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. కేవలం పైపైన సమాచారంతో సరిపుచ్చుకోకుండా లోతుగా విశ్లేషించాలని కన్సల్టెన్సీలను కోరుతున్నారు.
ఒక్కో మండలాన్ని మూడు నాలుగు క్లస్టర్లుగా విభజించి ఇన్‌ఫ్లూయెన్సర్స్ (ప్రభావశీలురు) నుంచి వివరాలు సేకరించేలా చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్స్ కేటగిరీలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, ఉద్యోగులు, ఆర్‌ఎంపీలు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు తదితరులను చేర్చి కన్సల్టెన్సీలు శాంపిళ్లు సేకరిస్తున్నాయి.
ఎన్నికల మేనేజ్‌మెంట్ సంస్థలకు ఫుల్ గిరాకీ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే సంస్థలకున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని పలు కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి. సర్వేలతో పాటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ప్రచారం, ఇతర కార్యకలాపాల కోసం ఎమ్మెల్యేలు సొంతంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నారు.
సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఎన్నికల మేనేజ్‌మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్, ప్రచార వ్యూహాల రూపకల్పన, పర్సెప్షన్ మేనేజ్‌మెంట్ (ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు) తదితర సరికొత్త అంశాలతో ఈ కన్సల్టెన్సీలు రాజకీయ నేతలను ఆకర్షిస్తున్నాయి.
ఈ కన్సల్టెన్సీల ద్వారా నియోజకవర్గాల్లో జరిగే కార్యకలాపాలను నేతల కుటుంబ సభ్యులు, సన్నిహితులు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి అందే సమాచారం కంటే ఈ థర్డ్ పార్టీ సంస్థల నుంచి అందే నివేదికలు శాస్త్రీయంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు.
పార్టీ సర్వే నివేదికలపై ఎమ్మెల్యేల ఆసక్తి
గతంలో బీఆర్‌ఎస్‌కు రాజకీయ వ్యూహాలు, సర్వే సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ దూరమైన తర్వాత ఇతర సంస్థలు తెరమీదకు వచ్చాయి. డిజిటల్ మీడియా వింగ్‌కు చెందిన ఓ నిపుణుడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ సర్వే సంస్థ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు ఎన్నికల కోణంలో విస్తృత సేవలు అందిస్తోంది.
‘కె2 కన్సల్టెన్సీ’గా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న ఈ సంస్థ విపక్ష పార్టీల కన్సల్టెన్సీల కంటే చాలా ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే నేతృత్వంలోని సంస్థ కూడా సర్వేలు చేసి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కన్సల్టెన్సీల నివేదికలతో పాటు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి తమపై వెళ్తున్న నివేదికల వివరాలు తెలుసుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment