అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న బీఆర్‌ఎస్ కోరిక నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పార్టీని విస్తరించే లక్ష్యంతో గత ఏడాది భారతరాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు, శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా ఈ ఏడాది ఆరంభం నుంచే సన్నద్ధమైంది.
జాతీయస్థాయిలో విస్తరణే లక్ష్యంగా...
బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్నాక పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జనవరి 18న ఖమ్మంలో తొలి బహిరంగసభ జరిగింది. ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్‌మాన్ (పంజాబ్), పినరయి విజయ్ (కేరళ)తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఏపీ బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడిగా పార్టీలో కొత్తగా చేరిన తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు.
ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మహారాష్ట్రలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా తొలిసారిగా ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగిన తొలి బహిరంగసభకు కేసీఆర్ హాజరయ్యారు. మార్చి 26న కాందార్ లోహ, ఏప్రిల్ 24న ఔరంగాబాద్ సభల్లోనూ కేసీఆర్ పాల్గొన్నారు.
మే 19న నాందేడ్‌లో రెండు రోజుల కార్యకర్తల శిబిరాన్ని ప్రారంభించిన కేసీఆర్ జూన్ 15న నాగపూర్‌లో పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించారు. జూన్ 23న మహారాష్ట్ర పర్యటనకు రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్‌తో వెళ్లి పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో పూజలు చేశారు. ఆగస్టు ఒకటిన కొల్హాపూర్‌లో అన్నాభావ్ సాఠే వర్ధంతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 8న నోటీసులు జారీ చేసింది. మార్చి 11న కవిత ఈడీ విచారణకు హాజరైంది. కవితపై ఈడీ విచారణకు పలు మార్లు నోటీసుల జారీ అంశం బీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు తీహార్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ అటు కేటీఆర్, ఇటు కవితను ఉద్దేశిస్తూ లేఖలు విడుదల చేయడంతో విపక్షాల విమర్శలకు దారితీసింది. టీఎస్‌పీఎస్సీ, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు కూడా బీఆర్‌ఎస్‌కు తలనొప్పులు సృష్టించాయి.
గవర్నర్‌తో ఘర్షణ
రాష్ట్ర గవర్నర్‌తోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను కారణంగా చూపడంతో గణతంత్ర వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరి గాయి. ఫిబ్రవరి మొదటివారంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం అంశంపై రాజ్‌భవన్, ప్రగతిభవన్ నడుమ కోల్డ్‌వార్ జరిగింది. చివరకు గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం ఓకే చెప్పగా, బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
అసెంబ్లీ పంపిన బిల్లులు గవర్నర్ ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ కోటాలో శాసనమండలికి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించగా, రాజకీయాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని బీఆర్‌ఎస్ ఆరోపించింది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపైనా గవర్నర్, ప్రభుత్వం నడుమ మాటల యుద్ధం జరిగింది. మరోవైపు కేంద్రంతోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘర్షణ ఏడాది పొడవునా కొనసాగింది. కేటీఆర్ పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై లేఖలు రాశారు.
ఫిబ్రవరి నుంచే...
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే బీఆర్‌ఎస్ వివిధ రూపాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమైంది. సీపీఐ, సీపీఎంతో ఎన్నికల అవగాహన ఉంటుందని మొదట్లో భావించినా, అది కుదరలేదు. శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్‌కు మద్దతు ప్రకటించింది. మార్చి 12 నుంచి నియోజకవర్గస్థాయిలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించి మే నెలాఖరు వరకు కొనసాగించింది.
జూన్‌లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరిట 20 రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. సచివాలయం, భారీ అంబేడ్కర్ విగ్రహం, అమరుల జ్యోతి ప్రారంభం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ భారీ సభలు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 27న తెలంగాణ భవన్‌లో పార్టీ ప్లీనరీ జరగ్గా, రెండు రోజుల ముందే జిల్లాల్లోనూ మినీ ప్లీనరీలు నిర్వహించారు.
ఒకేసారి 115 మంది జాబితా..
షెడ్యూల్ రాకముందే ఆగస్టు 21న ఒకేసారి 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కేసీఆర్ ప్రకటించారు. జాబితాలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడగా, అలంపూర్ అభ్యర్థి అబ్రహంకు చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారు. ఏడుగురు సిట్టింగులకు టికెట్లు నిరాకరించారు. టికెట్లు ఆశించిన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకమునుపే అక్టోబర్ 15న పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 28 వరకు మూడు విడతల్లో పార్టీ అధినేత కేసీఆర్ 97 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగ్గా, డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో 39 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
కేసీఆర్‌కు శస్త్ర చికిత్స
సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. డిసెంబర్ 8న బాత్‌రూంలో కాలు జారడంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ శస్త్ర చికిత్స అనంతరం డిసెంబర్ 15న డిశ్చార్జి అయ్యారు. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడంపై బీఆర్‌ఎస్ మండిపడింది. శ్వేతపత్రం తప్పులతడక అంటూ డిసెంబర్ 24న తెలంగాణభవన్‌లో కేటీఆర్ ‘స్వేదపత్రం’విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment