అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. 2023 జనవరి నాటికి అప్పటి రాష్ట్రపార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పలు విడతలుగా చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’తో నూతనోత్సాహం వెల్లివిరిసింది. అధికార బీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్న స్థాయిలో పెద్ద ఎత్తున హైప్ వచ్చింది.
కానీ బండి సంజయ్ మార్పుతో పరిస్థితి క్రమక్రమంగా తారుమారు అయ్యింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిషన్‌రెడ్డి అంతగా సుముఖంగా లేకపోయినా అధిష్టానం ఒత్తిడితో అయిష్టంగానే నాయకత్వ భారాన్ని మోసేందుకు సిద్ధమయ్యారు.
ఊపందుకున్న అసంతృప్త నేతల సమావేశాలు
బండి సంజయ్ మార్పుపై ఢిల్లీస్థాయిలో కసరత్తు ప్రారంభమైందనే వార్తలు వెలువడిన నాటి నుంచే రాష్ట్ర పార్టీలో మునుపెన్నడూ చూడనంతస్థాయిలో అసంతృప్త నేతల రాజకీయాలు, అసమ్మతి అంతస్థాయిలో లేకపోయినా విడిగా భేటీలు ఊపందుకున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని జాతీయనేతలు విమర్శలు గుప్పించి, ఆరోపణలపై విచారణ జరిపినా, అరెస్ట్ చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అది బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందంటూ అమిత్ షా, నడ్డా విమర్శించినా ఈడీ, సీబీఐ వంటి వాటిద్వారా చర్యలెందుకు తీసుకోలేదనే ప్రశ్నలు గుప్పించారు.
జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా అటు అసంతృప్త నేతలకు నచ్చజెప్పడమో, చర్యలపై స్పష్టత ఇవ్వడమో చేయకపోవడంతో జన సామాన్యంలోనూ బీఆర్‌ఎస్‌తో బీజేపీకి అంతర్గత దోస్తీ ఉందనే అనుమానాలు ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను బీజేపీ సాధించలేకపోయిందనే చర్చ కూడా పార్టీలో జరిగింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి వంటి నాయకులు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2018లో 1 సీటు...7 శాతం ఓటింగ్‌తో మొదలై...
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే గెలిచింది.105 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. కేవలం ఏడుశాతం ఓట్లు రాగా, ఆరునెలలలోపే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుపొంది 19 శాతం ఓటింగ్‌ను సాధించి బీజేపీ సత్తా చాటింది. అప్పటి నుంచి మూడేళ్ల వ్యవధిలో వరుసగా జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 2 సీట్ల నుంచి ఏకంగా 48 స్థానాల్లో గెలుపు, మొదటిసారిగా పార్టీ బీ ఫామ్‌పై టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏవీఎన్‌రెడ్డి సంచలన విజయం సాధించి, రాజకీయంగా ప్రజల మద్దతు సాధించి ముందుకుసాగింది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తీసికట్టుగా ఓట్లు రావడం, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి 12 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూసినా ఫలితం వెలువడే దాకా నువ్వానేనా అంటూ బీఆర్‌ఎస్‌కు బీజేపీ చెమటలు పట్టించింది, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం అన్నిరకాలుగా అండదండలు అందించి మద్దతుగా నిలిచింది. రెండు,మూడునెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ పది సార్లకు పైగా తెలంగాణలో పర్యటించారు.
అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని, ఎస్సీ రిజర్వేషన్ట వర్గీకరణకు జాతీయపార్టీ మద్దతు ప్రకటన, కేంద్రప్రభుత్వ సానుకూల నిర్ణయం వంటివన్నీ కూడా రాష్ట్రంలో బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలిచేందుకు దోహదపడలేదనే అభిప్రాయంలో పార్టీనాయకుల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రపార్టీ అధ్యక్షుడి మార్పు, ఆలస్యంగా అభ్యర్థుల ఖరారు, తెలంగాణలో ఏమాత్రం బలం, ఉనికి లేని జనసేనతో పొత్తు కుదుర్చుకొని 8 సీట్లు కేటాయించడం వంటి అంశాలు బీజేపీ ఎన్నికల ఫలితాల సాధనలో ప్రభావం చూపాయి.
ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల పరాజయం..
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీచేసి 8 సీట్లలో గెలిచి, 19 చోట్ల రెండోస్థానంలో, 46 చోట్ల డిపాజిట్లు దక్కించుకుంది. మొత్తంగా 14 శాతం ఓటింగ్‌ను సాధించింది. సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్ రెండుచోట్ల), ఎం.రఘునందన్‌రావు ఓటమి చవిచూడడం పార్టీకి షాక్ కలిగించింది.
కచ్చితంగా గెలుస్తారనుకున్న వీరిని ప్రజలు ఓడించడంతో ఆ పార్టీ నాయకులు అవాక్కయ్యారు. గ్రేటర్‌లో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి 7 అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని పరువు నిలబెట్టుకుంది. అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, బండి సంజయ్ ఎంపీగా ఉన్న కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్‌లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా దక్కించు కోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment