Rewind 2023
-
2023 భారీ డిజాస్టర్ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్‌కు లక్ష మాత్రమే వచ్చింది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు. 2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్‌గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు. సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్‌తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. -
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్‌గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్‌లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్‌గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్‌కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్‌బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్‌తో జోష్‌గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్‌గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్‌లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్‌రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్‌లో కొత్త చాప్టర్‌ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
స్టాక్మార్కెట్లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి. ర్యాలీకి కారణాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. జూన్‌లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్‌టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్‌లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి. 2024లో ఎలా ఉండబోతుందంటే.. వచ్చే ఏడాది స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు. ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..? ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. -
రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు..
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి ఏడు ప్రభుత్వ కాలేజీల ప్రారం¿ోత్సవం, వచ్చే సంవవత్సరానికి మరో ఏడు జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ఇది సాకారం అయితే దేశంలోనే ప్రతిజిల్లాలోనూ మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కుతుంది. సాగునీటిరంగంలో కాళేశ్వం ప్రాజెక్టు లోపాలు పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. పింఛన్లు పెంపు ఆసరా లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కారణంగా ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది. వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది సాధించిన ప్రధాన విజయాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడంగా చెప్పవచ్చు. 2023–24 సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే మెడికల్ విద్యార్థులు వాటిల్లో చేరారు. ఇక 2024–25 సంవత్సరంలోనూ జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుంది. అంటే 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకాగా, తాజాగా అనుమతించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. ఇవి పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య మొత్తం 34కు చేరుతుంది. తాజా నిర్ణయంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. అంటే మొత్తంగా రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. పీఆర్ అండ్ ఆర్డీ పింఛన్ రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికొస్తే..ప్రధానంగా ఆసరాలో భాగంగా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 నుంచి రూ. 4,016కు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. పెంపునకు అనుగుణంగా 5,11,656 మందికి నెలకు రూ.205.48 కోట్లు అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ♦ జీపీలు, సర్పంచ్‌లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదలలో జాప్యం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పలు జీపీల్లో సర్పంచ్‌లు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వివిధ పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనూ నిధుల సమస్య ఉపాధి హామీ అమల్లో భాగంగా... తెలంగాణలో నియమ,నిబంధనలు, మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపేసింది. అయితే కేంద్రం పక్షపాతం ప్రదర్శిస్తూ సకాలంలో నిధులు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ సర్కార్ విమర్శలు సంధించింది. ఇదిలా ఉంటే...ఈ పథకంలో భాగంగా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్, ఔట్సోర్సింగ్–కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత రెండు, మూడు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మా‘స్టార్’ ఏదీ? ♦ సాగని పదోన్నతులు... ఆగిన బదిలీలు ఆఖరులో తప్పని ♦ టెట్ చిక్కులు.. టీచర్ పోస్టులకూ బ్రేకులు ♦ ఉన్నత విద్యామండలిలో మహా నిశ్శబ్దం దీర్ఘకాలిక డిమాండ్ అయిన బదిలీలు, పదోన్నతులుపై ఆశలు రేకెత్తిందీ ఈ ఏడాదే. 10 వేలమంది టీచర్లు ప్రమోషన్లపై కలలుగన్నారు. దాదాపు 50 వేలమంది స్థానచలనం ఉంటుందని ఆశించారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ఊరట ఎంతోకాలం నిలవలేదు. అడ్డుపడ్డ కోర్టు వ్యాజ్యాలు టీచర్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ప్రమోషన్లకూ బ్రేకులు పడటం 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకమే. ఉపాధ్యాయ కొలువుల భర్తీపై నిరుద్యోగుల గంపెడాశలకు 2023 నీళ్లు చల్లింది. విద్యాశాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా, 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ రావడం, అదీ అర్ధంతరంగా ఆగిపోవడం నిరుద్యోగులకు 2023 అందించిన ఓ పీడకల. జాతీయ ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయాల వెనుకబాటు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం జరిగిన ఉద్యమాలు దూరమయ్యే కాలంలో కని్పంచిన దృశ్యాలు. బాసర ట్రిపుల్ ఐటీలో వెంటవెంట జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థిలోకాన్ని కలవరపెట్టాయి. టెన్త్ పరీక్షల సరళీకరణ, ఇంటర్ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం 2023లో కనిపించిన కొత్తదనం. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలిలో కుదుపులకు గతించే కాలమే సాక్షీభూతమైంది. మండలి చైర్మన్, వైస్‌చైర్మన్ తొలగింపుతో కార్యకలాపాలే మందగించిపోవడం ఈ ఏడాదిలో ఊహించని పరిణామమే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యార్థులు పోటెత్తడం ఈ సంవత్సరంలో కనిపించిన విశేషం. కరోనా కాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జేఈఈ మెయిన్ కాస్తా గాడిలో పడింది. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ♦ 2022–23 సీజన్లో వరి ఉత్పత్తి ♦ 2.58 కోట్ల టన్నులు రికార్డులు బద్దలు కొట్టిన తెలంగాణ వ్యవసాయరంగం రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ధాన్యం 2.58 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. వానాకాలం సీజన్లో 1.38 కోట్ల టన్నులు, యాసంగిలో 1.20 కోట్ల టన్నులు ఉంది. ఈ మేరకు తుది నివేదికను ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉత్పాదకత ఎకరానికి 2,124 కిలోలు వచ్చింది. కాగా, ఈ యాసంగిలో 57.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పాదకత ఎకరానికి 2,091 కిలోలు వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో 1.22 కోట్ల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎకరానికి 2,108 కిలోల ఉత్పాదకత వచ్చింది. ఆ మేరకు 2.58 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 15వ తేదీన విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది వరకు 11 విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం రూ. 72,815 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం 12వ విడత సొమ్మును కొత్త ప్రభుత్వం అందజేసే ప్రక్రియ చేపట్టింది. అందులో ఒక ఎకరాలోపు రైతులకు రైతుబంధు సొమ్ము అందజేస్తున్నారు. కాళేశ్వరం ‘కుదుపు’ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మసకబారిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను కుంగదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బయటపడిన లోపాలు.. 2023 చివరి త్రైమాసికంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపివేశాయి. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పియర్లు గత అక్టోబర్ 21వ తేదీన కుంగిపోగా, కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని పియర్లు కుంగినట్టు ..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. 7వ బ్లాక్‌ను పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సిఫారసు చేసింది. ఇతర బ్లాకులూ విఫలమైతే బ్యారేజీని పూర్తిగా పునర్నిర్మించక తప్పదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించడంతో భవిష్యత్‌లో వాటికి సైతం ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. అన్నారం బ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీకి బుంగలు ఏర్పడినట్టు ఎన్డీఎస్ఏ బృందం మరో నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను సొంత ఖర్చులతో చేస్తామని గతంలో హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయం ఎవరు చేపట్టాలని అన్న అంశంపై ఎల్అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదు. మిల్లుల్లోనే రూ. 22 వేల కోట్ల విలువైన బియ్యం పేదలకు ఉచిత బియ్యం పంపిణీతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించే బృహత్తర బాధ్యత నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ 2023లో కొన్ని తప్పటడుగులు వేసింది. తద్వారా కార్పొరేషన్‌కు అప్పులు గుదిబండగా మారాయి. 2022 రబీ(యాసంగి)లో రైతుల నుంచి సేకరించిన సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడంతో ఆ భారం సంస్థపై పడింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల బియ్యం విరిగి తమకు నష్టం వస్తుందని, అందుకే మిల్లింగ్ చేయలేమని రైస్‌మిల్లర్ల వాదనను అంగీకరించింది. మిల్లర్ల పట్ల ఉదారత చూపి, ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో మిల్లుల్లోనే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటితో పాటు అంతకు ముందు లెక్క తేలని ధాన్యం కలిపి సుమారు రూ. 22వేల కోట్ల విలువైన 83 ఎల్ఎంటీ ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు మిల్లర్లు చూపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఈ లెక్కలు తీసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఏకంగా రూ.56వేల కోట్ల అప్పులు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా రూ. 11వేల కోట్లు సంస్థ నష్టపోయినట్లు తేల్చారు. మిల్లర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 2023లో ఆ సంస్థ ప్రజల్లో పలుచనైపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. -
ఈ కార్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్స్ - పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' ఈ ఏడాది బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి వున్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెనాల్ట్ కైగర్ కంపెనీ తన రెనాల్ట్ కైగర్ కొనుగోలుపైన రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన కంపెనీ రూ.50000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాల కింద తగ్గింపు ఉన్నాయి. రూ.6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ.50,000 వరకు సేవ్ అవుతుంది. ఇదీ చదవండి: 2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్ రెనాల్ట్ క్విడ్ ప్రారంభం నుంచి అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. రూ.4.5 లక్షల ప్రారంభ ధరలో లభించే ఈ కారుని ఇప్పుడు రూ.50,000 తగ్గింపుతో ఈ నెలలో కొనుగోలు చేయవచ్చు. Note: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే తగ్గింపులు కేవలం మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవాలి. -
మత్తు వదిలించేలా..
సాక్షి, హైదరాబాద్ : మత్తు మహమ్మారిని తుద ముట్టించేందుకు ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర యువతపై పంజా విసురుతున్న గంజాయి, డ్రగ్స్ పీడ వదిలించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మత్తుపదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో ఈ ఏడాది నుంచే మత్తు కట్టడిపై ప్రభుత్వం యుద్ధభేరి మోగించినట్టు అయ్యింది. టీఎస్ న్యాబ్ (తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో) డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే మూడు దశాబ్దాలుగా ఆల్ఫాజోలం మత్తుదందా చేస్తున్న నిందితులను వెలుగులోకి తేవడమే కాదు రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫాజోలం స్వాదీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌శాఖ పక్కా ప్రణాళికలు ఫలించాయి. నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన టీఎస్పీఎస్సీ వరుస పేపర్ లీకేజీలపై కేసుల నమోదు సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరగడంతో దాదాపు సగం సమయం ఎన్నికల కసరత్తు, ఎన్నికల విధుల్లోనే పోలీసులు గడిపారు. ఈ ఏడాదిలో నమోదైన కొన్ని ప్రధాన నేర ఘటనలు ♦ ఫిబ్రవరి 23న వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ ఫస్టియర్ విద్యార్థిని ధరావత్ ప్రీతి సీనియర్ సైఫ్ వేధింపులతో ఆత్మహత్యకు యతి్నంచగా, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27న చనిపోయింది. ♦ ఫిబ్రవరి 17న అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి నవీన్‌ను తోటి విద్యార్థి హరిహరకృష్ణ హత్య చేసి తల, గుండె, చేతివేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేసి, వాటిని తగులబెట్టాడు. ♦ఈ ఏడాదిలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అత్యంత కీలకమైంది. తొలుత టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షపత్రం లీకేజీపై మార్చి 10న టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ ఫిర్యాదుతో తొలుత కేసు నమోదైంది. ఆ తర్వాత వరుసగా అనేక పరీక్షల లీకేజీ బయటపడడంతో ప్రభుత్వం మార్చి 14న హైదరాబాద్ సిటీ అడిషనల్ సీపీ క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సిట్ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ♦ మార్చి 16 సాయంత్రం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 14 మందిని అగి్నమాపకశాఖ సిబ్బంది కాపాడింది. ♦ మార్చి 11న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు తొలిసారిగా నోటీసులు జారీ చేశారు. ♦ దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న 12 మంది సభ్యుల ముఠాను ఈ ఏడాది మార్చి 23న సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ♦ ఒక నైజీరియాతో సహా నలుగురు సభ్యుల ముఠాను మే 7న అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు వారి నుంచి రూ.1.30 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ♦ మే నెలలో కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదేళ్ల కుమారుడు సహా దంపతులు సజీవ దహనం అయ్యారు. ♦ అప్పు తిరిగి చెల్లించే విషయంలో వచి్చన వివాదంతో మలక్‌పేటలో మాజీ హెడ్నర్స్ అనురాధారెడ్డిని చంద్రమోహన్ మే 15వ తేదీ రాత్రి హత్య చేసి, శరీరభాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో 13 రోజులు దాచి, ఆ తర్వాత వాటిని మూసీనదిలో వేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ♦ దేశవ్యాప్తంగా వందలమందిని ముంచిన ఈ–స్టోర్ ఇండియా సంస్థ రూ.1,000 కోట్ల మోసాన్ని మే 30న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ♦ మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మే 31న దండకారణ్యం గెరిల్లా జోన్లో గుండెపోటుతో మరణించారు. ♦ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్పరను పూజారి సాయికృష్ణ రాయితో మోది దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీస్ వెనుక ఉన్న పాత సెఫ్టిక్ ట్యాంక్‌లో వేసి ఉప్పు, ఎర్రమట్టి నింపిన ఘటన సంచలనం సృష్టించింది. ♦ ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో మహబూబ్‌నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికర్ అహ్మద్‌పై ఆ కానిస్టేబుల్ దంపతులు జగదీశ్, శకుంతల, మరో వ్యక్తి కృష్ణలు దాడి చేసి అతడి మర్మాంగాలు కోశారు. తీవ్రంగా గాయపడిన సీఐ చికిత్స పొందుతూ మరణించాడు. ♦ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) డిసెంబర్ 6న మచ్చ బొల్లారంలో జరిపిన సోదాల్లో రూ 4.3 కోట్ల విలువైన యాంటీ కేన్సర్ నకిలీ మందులను గుర్తించారు. ♦ డిసెంబర్ 8న సంగారెడ్డి జిల్లాలో టీఎస్ న్యాబ్ సోదాల్లో డ్రగ్ తయారీ కేంద్రాన్ని గుర్తించడంతోపాటు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ♦ఏడాది డిసెంబర్ 14న ఖమ్మం పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.1.22 కోట్ల విలువైన 484 కిలోల గంజాయిని టీఎస్ న్యాబ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ♦ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పుల ఊబిలో చిక్కిన సిద్దిపేట కలెక్టర్ గన్‌మన్ నరేశ్ డిసెంబర్ 15న చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో తన సర్వీస్ రివాల్వర్‌తో కుమారుడు రేవంత్, కుమార్తె రిషిత, భార్య చైతన్యలను కాల్చి, తను ఆత్మహత్య చేసుకున్నాడు. నేర నియంత్రణలో కీలక అడుగులు ♦ఓవైపు పెరుగుతున్న సైబర్ నేరాలు, మరోవైపు రాష్ట్ర యువత భవిష్యత్‌కు ముప్పుగా మారిన మత్తు మహమ్మారి కట్టడికి ఈ ఏడాదిలోనే కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ), తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు మే 31న ప్రారంభమయ్యాయి. ♦ బస్‌లో భరోసా పేరిట రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆర్టీసీ బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఈ ఏడాది ఆగస్టు 15న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోణంలో ఇదో నూతన ఆవిష్కరణ. ♦ మొబైల్ ఫోన్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా..తిరిగి గుర్తించేందుకు తెలంగాణ పోలీసుల టెలికమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ (సీఈఐఆర్) యాప్ వాడడం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఈనెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,024 మొబైల్ఫోన్లు గుర్తించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచారు. ♦ పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఈ ఏడాది మే 20న ‘సాహస్’వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ కొరడా.. అనూహ్య బదిలీలు ♦ఎన్నికల విధుల్లో ఉండే పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కొంచెం గట్టిగానే కొరడా ఝుళిపించింది. అక్టోబర్ 9న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన మూడు రోజుల తర్వాత ఏకంగా 20 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఆరోపణలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ♦ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన అప్పటి డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం అనూహ్యంగా సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం..పోలీస్‌శాఖలోని కీలక బదిలీలు వరుసగా జరిగాయి. -
కాంగ్రెస్‌కు కలిసొచ్చింది
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడాది కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఇదే సంవత్సరంలో ఆ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడింది. 2023 మొదట్లో దారీతెన్నూ లేని దిశలో సాగిన టీపీసీసీ ప్రయాణం ఏడాది ముగిసేసరికి విజయతీరాలను చేరింది. సంక్షోభం నుంచి సక్సెస్ వరకు, పోటీ ఇస్తామా అనే స్థాయి నుంచి పవర్ దక్కించుకునేంత వరకు ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి బలాన్నిచ్చింది. ఏడాది చివర్లో ప్రభుత్వ ఏర్పాటు కలను కూడా నెరవేర్చుకుంది. – సాక్షి, హైదరాబాద్ డిగ్గీరాజా వచ్చి... ఠాగూర్‌ను తప్పించి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కాంగ్రెస్ పార్టీలో కలహాలతోనే ప్రారంభమైంది. ఆ పార్టీ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో మాటల యుద్ధానికి దిగారు. ఒకదశలో ఇది తీవ్ర రూపం దాల్చడంతో అధిష్టానం జోక్యం చేసుకుంది. సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్ అలియాస్ డిగ్గీరాజాను రంగంలోకి దించింది. ఆయన స్థానిక నాయకత్వంతో చర్చించి అధిష్టానానికి కీలక నివేదిక అందజేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మార్పులు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ మాణిక్యంఠాగూర్ అనూహ్యంగా తప్పించి ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావ్ ఠాక్రేను అధిష్టానం తెలంగాణకు పంపింది. ఠాక్రే రాక తర్వాత క్రమంగా కాంగ్రెస్ అంతర్గత పరిస్థితులు ఒకొక్కటిగా చక్కబడ్డాయి. రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో చాలా మేరకు ఆయన విజయవంతమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్యరాగాన్ని అందుకున్నారు. పైకి కనిపించిన ఆ ఐక్యరాగమే తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ రకంగా విజయతీరాలకు చేర్చిందని చెప్పవచ్చు. 5 నుంచి 65కు పెరిగిన బలం ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. 2018 ఎన్నికల్లో గెలిచిన వారిలో మెజారిటీ సభ్యులు పార్టీని వీడడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఏడాది తిరిగే సరికి 65 మంది సభ్యుల (మిత్రపక్షమైన సీపీఐతో కలిపి)కు తన బలాన్ని పెంచుకుంది. ఇక, ఏడాది చివర్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ, ప్రజాపాలన లాంటి కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భట్టి విక్రమార్క లాంటి నాయకుల ఆధ్వర్యంలో వచ్చే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళుతోంది. మూడోస్థానం నుంచి మొదటి స్థానానికి ఏడాది ఆరంభంలో మూడోస్థానంలో (బీఆర్ఎస్, బీజేపీల తర్వాత) ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే కొద్దీ రెండో స్థానంలోకి, ఆ తర్వాత మొదటి స్థానంలోకి చేరుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద బూస్టప్ ఇచ్చాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుతో ఇక కాంగ్రెస్ పార్టీ కి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పటికే డిక్లరేషన్ల పేరుతో ప్రజల్లోకి వెళుతున్న కాంగ్రెస్, ఆ తర్వాత ఆరు గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో దూకుడుతో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టగలిగింది. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమనే భావనను ప్రజలకు కలిగించడంలో సఫలీకృతమైంది. జూలై మొదట్లో ఖమ్మంలో నిర్వహించిన ప్రజాగర్జనసభ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. సభకు రాహుల్‌గాంధీ హాజరు కావడం, రాష్ట్రమంతా ప్రభావం చూపే విధంగా మాజీ ఎంపీ పొంగులేటి బృందం కాంగ్రెస్‌లో చేరడం, సీఎల్పీ నేత హోదాలో భట్టి విక్రమార్క చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ముగింపు అక్కడే జరగడంతో పార్టీ కి కొత్త ఊపు వచ్చింది. అదే ఊపుతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కి డిక్లరేషన్లు, ఆరుగ్యారంటీలకు తోడు తెలంగాణలో అధికారం రావడం తన కల అని సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. ఇతర పార్టీ ల నుంచి కూడా ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. పార్టీ నుంచి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి తదితరులు రావడం, మైనంపల్లి హన్మంతరావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి లాంటి నేతలు పార్టీ లోకి రావడం పెద్ద బలాన్నే ఇచ్చింది. వెరసి... మూడో స్థానం నుంచి మొదటి స్థానం వరకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతో అధికారాన్ని దక్కించుకోగలిగింది. -
కంగుతిన్న కమలదళం
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. 2023 జనవరి నాటికి అప్పటి రాష్ట్రపార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పలు విడతలుగా చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’తో నూతనోత్సాహం వెల్లివిరిసింది. అధికార బీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్న స్థాయిలో పెద్ద ఎత్తున హైప్ వచ్చింది. కానీ బండి సంజయ్ మార్పుతో పరిస్థితి క్రమక్రమంగా తారుమారు అయ్యింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిషన్‌రెడ్డి అంతగా సుముఖంగా లేకపోయినా అధిష్టానం ఒత్తిడితో అయిష్టంగానే నాయకత్వ భారాన్ని మోసేందుకు సిద్ధమయ్యారు. ఊపందుకున్న అసంతృప్త నేతల సమావేశాలు బండి సంజయ్ మార్పుపై ఢిల్లీస్థాయిలో కసరత్తు ప్రారంభమైందనే వార్తలు వెలువడిన నాటి నుంచే రాష్ట్ర పార్టీలో మునుపెన్నడూ చూడనంతస్థాయిలో అసంతృప్త నేతల రాజకీయాలు, అసమ్మతి అంతస్థాయిలో లేకపోయినా విడిగా భేటీలు ఊపందుకున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని జాతీయనేతలు విమర్శలు గుప్పించి, ఆరోపణలపై విచారణ జరిపినా, అరెస్ట్ చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అది బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందంటూ అమిత్ షా, నడ్డా విమర్శించినా ఈడీ, సీబీఐ వంటి వాటిద్వారా చర్యలెందుకు తీసుకోలేదనే ప్రశ్నలు గుప్పించారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా అటు అసంతృప్త నేతలకు నచ్చజెప్పడమో, చర్యలపై స్పష్టత ఇవ్వడమో చేయకపోవడంతో జన సామాన్యంలోనూ బీఆర్ఎస్తో బీజేపీకి అంతర్గత దోస్తీ ఉందనే అనుమానాలు ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను బీజేపీ సాధించలేకపోయిందనే చర్చ కూడా పార్టీలో జరిగింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి వంటి నాయకులు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో 1 సీటు...7 శాతం ఓటింగ్‌తో మొదలై... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే గెలిచింది.105 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. కేవలం ఏడుశాతం ఓట్లు రాగా, ఆరునెలలలోపే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుపొంది 19 శాతం ఓటింగ్‌ను సాధించి బీజేపీ సత్తా చాటింది. అప్పటి నుంచి మూడేళ్ల వ్యవధిలో వరుసగా జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్ల నుంచి ఏకంగా 48 స్థానాల్లో గెలుపు, మొదటిసారిగా పార్టీ బీ ఫామ్‌పై టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏవీఎన్‌రెడ్డి సంచలన విజయం సాధించి, రాజకీయంగా ప్రజల మద్దతు సాధించి ముందుకుసాగింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తీసికట్టుగా ఓట్లు రావడం, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి 12 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూసినా ఫలితం వెలువడే దాకా నువ్వానేనా అంటూ బీఆర్ఎస్కు బీజేపీ చెమటలు పట్టించింది, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం అన్నిరకాలుగా అండదండలు అందించి మద్దతుగా నిలిచింది. రెండు,మూడునెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ పది సార్లకు పైగా తెలంగాణలో పర్యటించారు. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని, ఎస్సీ రిజర్వేషన్ట వర్గీకరణకు జాతీయపార్టీ మద్దతు ప్రకటన, కేంద్రప్రభుత్వ సానుకూల నిర్ణయం వంటివన్నీ కూడా రాష్ట్రంలో బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలిచేందుకు దోహదపడలేదనే అభిప్రాయంలో పార్టీనాయకుల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రపార్టీ అధ్యక్షుడి మార్పు, ఆలస్యంగా అభ్యర్థుల ఖరారు, తెలంగాణలో ఏమాత్రం బలం, ఉనికి లేని జనసేనతో పొత్తు కుదుర్చుకొని 8 సీట్లు కేటాయించడం వంటి అంశాలు బీజేపీ ఎన్నికల ఫలితాల సాధనలో ప్రభావం చూపాయి. ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల పరాజయం.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీచేసి 8 సీట్లలో గెలిచి, 19 చోట్ల రెండోస్థానంలో, 46 చోట్ల డిపాజిట్లు దక్కించుకుంది. మొత్తంగా 14 శాతం ఓటింగ్‌ను సాధించింది. సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్ రెండుచోట్ల), ఎం.రఘునందన్‌రావు ఓటమి చవిచూడడం పార్టీకి షాక్ కలిగించింది. కచ్చితంగా గెలుస్తారనుకున్న వీరిని ప్రజలు ఓడించడంతో ఆ పార్టీ నాయకులు అవాక్కయ్యారు. గ్రేటర్లో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి 7 అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని పరువు నిలబెట్టుకుంది. అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, బండి సంజయ్ ఎంపీగా ఉన్న కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా దక్కించు కోలేకపోయారు. -
మూడో 'సారీ'...
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న బీఆర్ఎస్ కోరిక నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పార్టీని విస్తరించే లక్ష్యంతో గత ఏడాది భారతరాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు, శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా ఈ ఏడాది ఆరంభం నుంచే సన్నద్ధమైంది. జాతీయస్థాయిలో విస్తరణే లక్ష్యంగా... బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నాక పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జనవరి 18న ఖమ్మంలో తొలి బహిరంగసభ జరిగింది. ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్‌మాన్ (పంజాబ్), పినరయి విజయ్ (కేరళ)తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా పార్టీలో కొత్తగా చేరిన తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్రలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా తొలిసారిగా ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగిన తొలి బహిరంగసభకు కేసీఆర్ హాజరయ్యారు. మార్చి 26న కాందార్ లోహ, ఏప్రిల్ 24న ఔరంగాబాద్ సభల్లోనూ కేసీఆర్ పాల్గొన్నారు. మే 19న నాందేడ్‌లో రెండు రోజుల కార్యకర్తల శిబిరాన్ని ప్రారంభించిన కేసీఆర్ జూన్ 15న నాగపూర్‌లో పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించారు. జూన్ 23న మహారాష్ట్ర పర్యటనకు రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్‌తో వెళ్లి పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో పూజలు చేశారు. ఆగస్టు ఒకటిన కొల్హాపూర్‌లో అన్నాభావ్ సాఠే వర్ధంతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 8న నోటీసులు జారీ చేసింది. మార్చి 11న కవిత ఈడీ విచారణకు హాజరైంది. కవితపై ఈడీ విచారణకు పలు మార్లు నోటీసుల జారీ అంశం బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు తీహార్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ అటు కేటీఆర్, ఇటు కవితను ఉద్దేశిస్తూ లేఖలు విడుదల చేయడంతో విపక్షాల విమర్శలకు దారితీసింది. టీఎస్పీఎస్సీ, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు కూడా బీఆర్ఎస్కు తలనొప్పులు సృష్టించాయి. గవర్నర్‌తో ఘర్షణ రాష్ట్ర గవర్నర్‌తోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను కారణంగా చూపడంతో గణతంత్ర వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరి గాయి. ఫిబ్రవరి మొదటివారంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం అంశంపై రాజ్‌భవన్, ప్రగతిభవన్ నడుమ కోల్డ్‌వార్ జరిగింది. చివరకు గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం ఓకే చెప్పగా, బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అసెంబ్లీ పంపిన బిల్లులు గవర్నర్ ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ కోటాలో శాసనమండలికి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించగా, రాజకీయాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపైనా గవర్నర్, ప్రభుత్వం నడుమ మాటల యుద్ధం జరిగింది. మరోవైపు కేంద్రంతోనూ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘర్షణ ఏడాది పొడవునా కొనసాగింది. కేటీఆర్ పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై లేఖలు రాశారు. ఫిబ్రవరి నుంచే... ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే బీఆర్ఎస్ వివిధ రూపాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమైంది. సీపీఐ, సీపీఎంతో ఎన్నికల అవగాహన ఉంటుందని మొదట్లో భావించినా, అది కుదరలేదు. శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్‌కు మద్దతు ప్రకటించింది. మార్చి 12 నుంచి నియోజకవర్గస్థాయిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించి మే నెలాఖరు వరకు కొనసాగించింది. జూన్‌లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరిట 20 రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. సచివాలయం, భారీ అంబేడ్కర్ విగ్రహం, అమరుల జ్యోతి ప్రారంభం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ భారీ సభలు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 27న తెలంగాణ భవన్లో పార్టీ ప్లీనరీ జరగ్గా, రెండు రోజుల ముందే జిల్లాల్లోనూ మినీ ప్లీనరీలు నిర్వహించారు. ఒకేసారి 115 మంది జాబితా.. షెడ్యూల్ రాకముందే ఆగస్టు 21న ఒకేసారి 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కేసీఆర్ ప్రకటించారు. జాబితాలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడగా, అలంపూర్ అభ్యర్థి అబ్రహంకు చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారు. ఏడుగురు సిట్టింగులకు టికెట్లు నిరాకరించారు. టికెట్లు ఆశించిన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకమునుపే అక్టోబర్ 15న పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 28 వరకు మూడు విడతల్లో పార్టీ అధినేత కేసీఆర్ 97 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగ్గా, డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో 39 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. డిసెంబర్ 8న బాత్రూంలో కాలు జారడంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ శస్త్ర చికిత్స అనంతరం డిసెంబర్ 15న డిశ్చార్జి అయ్యారు. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడంపై బీఆర్ఎస్ మండిపడింది. శ్వేతపత్రం తప్పులతడక అంటూ డిసెంబర్ 24న తెలంగాణభవన్‌లో కేటీఆర్ ‘స్వేదపత్రం’విడుదల చేశారు. -
అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ
అసెంబ్లీలోకి సీపీఐ ఎమ్మెల్యే అడుగిడగా, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంకు మాత్రం పరాభావమే మిగిలింది. సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఎంతో ప్రతిష్ట కలిగిన సీపీఎంకు గత అసెంబ్లీలోనూ, ప్రస్తుత అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం దక్కలేదు. పొత్తుల్లో సీపీఐ సక్సెస్ బీఆర్ఎస్తో పొత్తు విఫలం కావడంతో సీపీఐ కాంగ్రెస్‌కు దగ్గరమైంది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు కాగా, సీపీఎంతో పొత్తు కుదరలేదు. చివరకు సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగగా, సీపీఐ కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. ఆ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి వామపక్షాలు కలిసి పనిచేయాలని ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నాయి. కానీ పొత్తుల విషయంలో పొసగక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఎన్నికల దృష్టితో చూస్తే సీపీఐ వ్యూహం ఫలించదని అంటున్నారు. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓట్లను నిలబెట్టుకోలేకపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. సీపీఎంకు ఘోర పరాభవం... తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. భద్రాచలం మినహా ఇతరచోట్ల గెలుపోటటములను నిర్దేశించలేకపోయింది. సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లో 15 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా, మిగిలిన నాలుగు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అంతేకాదు అన్ని స్థానాల్లోనూ సీపీఎం డిపాజిట్లు పొందకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు నియోజకవర్గంలోనూ సత్తా చాటలేకపోయారు. ఆయనకు కేవలం 5,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి 5,860 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ 5,719 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలుపునకు సీపీఎం అడ్డుపడినట్టుగా హస్తం వర్గాలు అంటున్నాయి. 19 చోట్ల పోటీ చేస్తే సీపీఎంకు వచి్చన మొత్తం ఓట్లు కేవలం 52,349 మాత్రమే కావడం గమనార్హం. -
ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి..
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవంటారు. ప్రేమను పొందేందుకు కొందరు ఎంతకైనా వెనుకాడరు. ఇదేకోవలో ఐదుగురు మహిళలు ప్రేమ కోసం తమ దేశ సరిహద్దులు దాటి, విదేశాల్లోకి ప్రవేశించి, చిక్కుల్లో పడ్డారు. వీటికి సంబంధించిన ఉందంతాలు 2023లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ సీమా హైదర్ పేరు దేశంలో చర్చనీయాంశమైంది, పాకిస్తాన్‌కు చెందిన ఈ 27 ఏళ్ల మహిళ ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ 21 ఏళ్ల భారతీయ కుర్రాడు సచిన్ మీనా ప్రేమలో పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా తన ప్రేమను నెరవేర్చుకునేందుకు పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకుంది. సీమా.. భారత్ వచ్చేందుకు పాకిస్తాన్‌లోని తన ఇంటిని అమ్మేసింది. భారత్ వచ్చిన సీమాపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. విచారణ కూడా జరిగింది. ఇప్పటికి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అంజు రాజస్థాన్‌కు చెందిన అంజు తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. ఆమె అక్కడ తన తన పాకిస్తానీ ప్రేమికుడిని పెళ్లాడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత అంజు భారత్‌కు తిరిగి వచ్చింది. అంజును మొదట ఐబీ, తర్వాత పంజాబ్ పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని తన తండ్రి ఇంటిలో ఉంటోంది. అయితే ఆమె భారత్‌లో ఎంతకాలం ఉంటుంది? పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తుందా? అనేది ఇంకా వెల్లడికాలేదు. జవేరియా ఖానుమ్ జావేరియా పాకిస్తాన్‌లోని కరాచీ నివాసి. త్వరలో ఆమె కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతోంది. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఖానుమ్ భారతదేశానికి వచ్చి 45 రోజులు ఉంది. ఆమెకు డప్పులతో ఘన స్వాగతం పలికారు. అట్టారీ సరిహద్దు నుంచి ఆమె భారత్‌లోకి ప్రవేశించింది. బార్బరా పొలాక్ జార్ఖండ్‌లోని తన ప్రియుడిని కలవడానికి పోలాండ్‌కు చెందిన బార్బరా పొలాక్ భారతదేశానికి వచ్చింది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. విడాకులు తీసుకున్న ఆమె తన సోషల్ మీడియా స్నేహితుడు షాదాబ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఆమె షాబాద్‌ను పెళ్లి చేసుకోవడానికి వీలుగా 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. కృష్ణా మండల్ కృష్ణా మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ తన ప్రియుడు అభిక్ మండల్‌ను కలిసేందుకు బంగ్లాదేశ్ మీదుగా ఈదుకుంటూ భారత్ వచ్చింది. కృష్ణా.. అభిక్ మండల్ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమెకు పాస్‌పోర్ట్ లేదు. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణాను భారత ఏజెన్సీ అరెస్టు చేసి, బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అప్పగించింది. ఇది కూడా చదవండి: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
స్టార్టప్‌లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే..
2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు మాత్రం కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో భారతదేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి, ఎందుకు తొలగించాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. Layoffs.fyi డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా బైజు సంస్థ రెండు విడతల్లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ తన ఆస్తులను తాకట్టుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్ కంపెనీలలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), SAP ల్యాబ్స్ (300), అప్‌గ్రాడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), Dunzo (300), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్లు (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), MPL (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 26,02,238 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
భారత్‌లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎస్1 ఎక్స్ ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. ఏథర్ 450ఎస్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). రివర్ ఇండీ ( River Indie) దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్ పాడ్ హెడ్‌లైట్ సెటప్, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు. సింపుల్ డాట్ 1 బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. టీవీఎస్ ఎక్స్ రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. -
2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!
కళ్లు మూసి తెరిచేలోపు మరో ఏడాది పూర్తయిపోయింది. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్ మొన్నే చేసుకున్నట్లు. ఇంతలోనే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఈ ఏడాది గడిచిపోయింది. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే 2023లో మాత్రం పలు అద్భుతమైన సినిమాలు రిలీజయ్యాయి. మూవీ లవర్స్‌తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా చాలా సినిమాలకు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది తమకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో చెప్పేశారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. పఠాన్ (హిందీ- అమెజాన్ ప్రైమ్), సప్త సాగర ఎల్లో దాచే-రెండు భాగాలు (కన్నడ-అమెజాన్ ప్రైమ్), జవాన్ (హిందీ-నెట్‌ఫ్లిక్స్) సినిమాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు. 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. 'డాడా' (తమిళం) చిత్రం తనని బాగా మెప్పించిందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ.. 'ద గ్రేట్ ఇండియా కిచెన్' (తమిళ-తెలుగు) సినిమా.. ఈ ఏడాది వచ్చిన వాటిలో తన ఫేవరెట్ అని చెప్పింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌కి అయితే జైలర్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), సప్త సాగర ఎల్లో దాచే సైడ్-ఏ (కన్నడ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ జియో బేబీకి.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), B 32 ముతళ్ 44 వరే (మలయాళ) సినిమాలు బాగా నచ్చేశాయని చెప్పాడు. వీటిలో ఒకటి ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ అవినాష్ అరుణ్.. 12th ఫెయిల్ (హిందీ- హాట్‌స్టార్), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (హిందీ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. కన్నడ దర్శకుడు హేమంత్ ఎమ్ రావు.. తమ తోటీ దర్శకులు తీసిన ఆచార్ అండ్ కో (కన్నడ-అమెజాన్ ప్రైమ్), హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ-జీ5) సినిమాలు బాగా నచ్చాయని అన్నాడు. ఇలా పలువురు స్టార్ దర్శకులకు నచ్చిన సినిమాలంటే కచ్చితంగా అవి బెస్ట్ మూవీస్ అయ్యింటాయ్. వీటిల్లో చాలావరకు మీరు చూసేసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే మాత్రం.. 2023 ముగిసేలోపు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ) -
2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. మోదీసర్కార్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ 10 జడ్జ్మెంట్స్ ఒకసారి చూద్దాం.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై.. 2023 డిసెంబర్ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వాదనలతో పూర్తిస్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజులపాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆర్థికశాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ BV నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టంచేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా.. ఎన్నికల కమిషనర్ల అప్పాయింట్మెంట్స్కు సంబంధించిన సవరణ బిల్లును.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతతో కూడిన ప్యానెల్.. సీఈసీ, ఈసీలను ఎంపికే చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదికతోపాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీచేసింది. విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది.విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా..విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలనఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. 6 నెలల సమయం వద్దని.. విడాకులు వెంటనే జారీచేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. స్వలింగ సంపర్కలు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్‌లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్ DY.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేసింది. జల్లికట్టు, కంబల. ఎద్దులబండి పందాల వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోవలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలను అనుమతిస్తూ.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. సంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని.. వాటికి అటంకం కలిగించలేమని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ జడ్జ్మెంట్స్ ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చిన సుప్రీంకోర్టు డీమోనిటైజేషన్‌పై ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం సీఈసీ, ఈసీల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చిన కేంద్రప్రభుత్వం విదేశీ రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు సరికాదన్న సుప్రీం విద్వేషపూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. వెంటనే విడాకులు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం నిరాకరణ 3-2 తేడాతో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు -
ఆరంభం.. ముగింపు ఒకేలా! సౌతాఫ్రికా, టీమిండియాకు కన్నీళ్లు
Rewind: 2023... ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన రెండు జట్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడేసి.. సొంతగడ్డపై అభిమానుల మధ్య కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. వీటితో పాటు ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాల గురించి తెలుసుకుందాం!! 1. ఆస్ట్రేలియా ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా వేదికగా ఈ ఏడాది ఆరంభంలో మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ జరిగింది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొమ్మిదవ ఎడిషన్‌లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఓటమితో టోర్నీని ఆరంభించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది. బెత్ మూనీ అర్ద శతకం(53)కు తోడు బౌలర్లు రాణించడంతో 19 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. కేప్‌టౌన్ వేదికగా ట్రోఫీ గెలుపొంది.. ఏకంగా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. 2. డబ్ల్యూపీఎల్ ఆరంభం భారత మహిళా క్రికెట్లో సువర్ణాధ్యాయానికి 2023లో నాంది పలికింది బీసీసీఐ. టీ20 లీగ్ ఫార్మాట్లో వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మహిళా క్రికెటర్లను ఒక్క చోట చేర్చి ఐదు జట్లుగా విభజించి పోటీని నిర్వహించింది. ఐపీఎల్ మాదిరి వేలంలో క్రికెటర్లను కొనుగోలు చేసే అవకాశం ఫ్రాంఛైజీలకు ఇచ్చింది. ఇక ఈ చరిత్రాత్మక ఈవెంట్లో మొట్టమొదటి టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు.. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీని ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. 3. ఆసియా కప్ విజేతగా టీమిండియా ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, తమ జట్టును అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా నిర్ణయించింది. ఇక ఈ టోర్నలో పాకిస్తాన్ సూపర్-4 దశలోనే నిష్క్రమించగా.. టీమిండియా- శ్రీలంక ఫైనల్ చేరాయి. తుదిపోరులో రోహిత్ శర్మ సేన లంకను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సంచలన విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. 4. జనాలు లేని వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభ మ్యాచ్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ జరిగింది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. అయితే, క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో వరల్డ్‌కప్ ఆరంభం పేలవంగా జరిగింది. ఎలాంటి హడావుడి, పెద్దగా ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్ జరిగిపోయింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. 5. పసికూనలుగా వచ్చి.. సెమీస్ రేసులో నిలిచి వన్డే వరల్డ్‌కప్-2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా అడుగుపెట్టిన జట్టు అఫ్గనిస్తాన్. ఆరంభ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన అఫ్గన్.. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహంలా చెలరేగింది. వరుసగా ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఓడించి చరిత్రాత్మక విజయాలతో సెమీస్ రేసులో తానూ ఉన్నాననే సంకేతాలు పంపింది. టాపార్డర్‌లో యువ బ్యాటర్లు రాణించడం, రషీద్ ఖాన్ నాయకత్వంలోని స్పిన్ దళ రాణించడం అఫ్గన్‌కు కలిసివచ్చింది. సెమీస్ చేరకపోయినా అద్భుత ప్రదర్శనలతో ఈసారి వరల్డ్‌కప్‌లో అఫ్గనిస్తాన్ తమదైన ముద్ర వేయగలిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కంటే మెరుగ్గా రాణించి మధుర జ్ఞాపకాలు మిగిల్చుకుంది. 6. ఒలింపిక్స్‌లో క్రికెట్ విశ్వక్రీడల్లో బ్యాటర్ల మెరుపులు.. బౌలర్ల దూకుడు చూడాలని కోరుకుంటున్న అభిమానుల కల త్వరలోనే నెరవేరనుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఈ ఏడాది ఆమోదం తెలిపింది. కాగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మళ్లీ తిరిగి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇక లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్లో పురుష, మహిళా జట్లు బరిలోకి దిగనున్నాయి. 7. మాక్సీ మాగ్జిమమ్ ఇన్నింగ్స్ వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ విధ్వంసకర ద్విశతకంతో చెలరేగాడు. సహచరులంతా చేతులెత్తేసిన వేళ.. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. తన చేతిలో ఏదో మంత్రదండం ఉందా అన్న అనుమానం కలిగేలా షాట్ల మీద షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కండరాలు పట్టేయడంతో కదల్లేక క్రీజులో నిలబడిపోయినా మాక్సీ పట్టువీడక నభూతో అన్న చందంగా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ కమిన్స్ సహకారం అందిస్తుండగా.. 201 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 8. రికార్డుల రారాజు కిరీటంలో అరుదైన కలికితురాయి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదుతూ.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ శతకాల రికార్డుకు ఎసరుపెట్టిన కోహ్లి.. వన్డేల్లో అతడిని అధిగమించాడు. వన్డే ప్రపంచకప్-2023లో తన పుట్టినరోజు(నవంబరు 5) నాటి మ్యాచ్‌లో సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లి.. న్యూజిలాండ్‌తో సెమీస్ సందర్భంగా అతడి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో 50వ సెంచరీ నమోదు చేశాడు. 9. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు చేరుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరంభంలో తడబడ్డా.. తమకే సాధ్యమైన రీతిలో పుంజుకుని ఏకంగా విశ్వవిజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌లో లక్ష మందికి పైగా టీమిండియా అభిమానుల ప్రత్యక్షంగా చూస్తుండగా.. రోహిత్ శర్మ సేనను ఓడించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ట్రవిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చి వరల్డ్‌కప్ హీరోల జాబితాలో తన పేరునూ లిఖించుకున్నాడు. 10. ఆస్ట్రేలియాపై భారత్ తొలి టెస్టు గెలుపు భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు రాణించడంతో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జయకేతనం ఎగురవేసింది హర్మన్‌ప్రీత్ బృందం. ఇక ఇంతవరకు ఇరు జట్ల మధ్య పదకొండు టెస్టులు జరుగగా.. నాలుగు ఆసీస్ గెలవగా.. ఒకటి భారత్ సొంతమైంది. ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. -
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్‌లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్‌తో పాటు యాంకరింగ్‌లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్‌బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్‌తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్‌శెట్టి ఫాంహౌస్‌లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్‌లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్‌కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్‌దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
2023 టాలీవుడ్లో టాప్-10 కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు
కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టేస్తాము. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలో మనమేం సాధించాం..? ఏం నష్టపోయాం..? అనే లెక్కలు వేసుకోవడం సహజం. సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా కేవలం బాలీవుడ్‌కు మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అక్కడి చిత్రాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాలీవుడ్‌కు పోటీగా టాలీవుడ్ చిత్రపరిశ్రమ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్-10లో ఉన్న చిత్రాల గురించి ఒకసారి చూద్దాం. కేవలం ఈ కలెక్షన్స్ వివరాలు టాలీవుడ్ పరిధి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించగలరు. 1. 'వాల్తేరు వీరయ్య' మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో రవితేజ కీ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్లో రూ. 160 కోట్ల రాబట్టి 2023లో విడుదలైన చిత్రాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ పరంగా టాప్-1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 2. ఆదిపురుష్- ప్రభాస్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 'ఆదిపురుష్'. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 393 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్లో 'వాల్తేరు వీరయ్య' కంటే కలెక్షన్స్ పరంగా 'ఆదిపురుష్' వెనకపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో ఉన్నా కూడా టాలీవుడ్లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 3. వీరసింహా రెడ్డి - బాలకృష్ణ 2023 సంక్రాంతి బరిలో 'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ రేసులో మెగాస్టారే పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 134 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 97 కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 4. భగవంత్ కేసరి- బాలకృష్ణ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 5. 'బ్రో'- సాయిధరమ్ తేజ్,పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్ ప్రధాన కథానాయకుడిగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దీనిని డైరెక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 114 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 6. దసరా- నాని నాని పాన్ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేశ్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రంకావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 118 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 76 కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 7. జైలర్- రజనీకాంత్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 604 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 68 కోట్లు రాబట్టి ఏడో స్థానం దక్కించుకుంది. రజనీకాంత్ కెరియర్లో ఆల్‌టైమ్ హిట్‌గా జైలర్ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 8.'బేబీ'- ఆనంద్ దేవరకొండ 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రేమ కథా చిత్రం 'బేబీ' . సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్‌ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 81 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 64 కోట్లు రాబట్టి ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 9. విరూపాక్ష- సాయిధరమ్ తేజ్ సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్‌కు బిగ్గెస్ట్ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 10. సలార్- ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సలార్ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతానికి (డిసెంబర్ 23) టాలీవుడ్లో రూ. 101కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ టెన్ లస్ట్‌లో మూడో స్థానానికి సలార్ చేరుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్స్ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్ కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యే సరికి టాప్-1 లోకి కూడా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.160 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. -
2023 రౌండప్: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!
ఒకప్పుడు టాలీవుడ్లో రీమేకులు సర్వసాధారణం. ఇతర భాషల్లో రిలీజై సూపర్ హిట్ అయిన చిత్రాలన్నీ తెలుగులో రీమేక్ చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునతో పాటు స్టార్ హీరోలంతా రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. వాటిలో చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. కానీ ఓటీటీ రాకతో రీమేక్ చిత్రాల పని అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందుకే ఈ ఏడాది రీమేక్ చిత్రాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. భారీ నుంచి ఓ మోస్తరు చిత్రాలవరకు అన్ని రీమేకులు డిజాస్టర్స్‌గా నిలిచాయి. బోల్తా పడిన భోళా శంకర్ ఈ ఏడాది విడుదలై డిజాస్టర్ అయిన చిత్రాల్లో భోళా శంకర్ ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్. అక్కడ అజిత్ ..ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళంలో ఈ కథ సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. చిరు కెరీర్లో దారుణమైన సినిమాల్లో భోళా శంకర్ ఒకటిగా నిలిచింది. భారీ నష్టాలు మిగిల్చిన ‘బ్రో’ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ కూడా రీమేక. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన.. తమన్ సంగీతం ..ఏది ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్‌గా ‘రావణాసుర’ పైకి చెప్పనప్పటికీ రావణాసుర కూడా రీమేక్ చిత్రమే. ‘విన్సీ డా’అనే బెంగాలీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్‌ని మాత్రమే తీసుకొని కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. తొలిసారి రవితేజ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన డిజాస్టర్‌గా నిలిచింది. కృష్ణవంశీ ఆశలపై నీళ్లు చల్లిన ‘రంగమార్తాండ’ చాలా కాలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. కథ, కథనం, మేకింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధంగా ఈ చిత్రం ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆకట్టుకోలేకపోయిన ‘హంట్’ ఈ ఏడాది సుధీర్ బాబు చేసిన మరో ప్రయోగం హంట్. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం.. మక్కీకి మక్కీ తెరకెక్కించడం కారణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇవి మాత్రమే కాదు ఫిబ్రవరిలో విడుదలైన బుట్టబొమ్మ(మలయాళ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్), నవంబర్‌లో రిలీజైన కోట బొమ్మాళి పీఎస్(మలయాళ సూపర్ హిట్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్) చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
ఈ ఏడాది భారత్‌కు వెరీ బిగ్ ఇయర్
2023.. భారత్‌కు వెరీ బిగ్ ఇయర్. ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రపంచం జైకొట్టిన ఏడాది. విశ్వగురువుగా అవతరించిన ఏడాది. దేశానికి కొత్త ప్రజాస్వామ్య సౌధాన్ని అందించింది 2023. సొరంగం నుంచి యుద్ధభూమి వరకు.. భారతీయుడు కష్టంలో ఉంటే.. కేంద్రం కాపాడుతుందనే భరోసా ఇచ్చింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హెడ్‌లైన్స్, కీలక విషయాలను ఒకసారి చూద్దాం.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల కూటమి G20 శిఖరాగ్ర సదస్సుకు.. 2023 సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ సౌత్‌కు లీడర్‌గా ఆవిర్భవించిన భారత్.. G20 అధ్యక్ష హోదాలో తన ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ అంశంతో కూడిన తీర్మానానికి ఏకాభిప్రాయం సాధించి.. విశ్వగురువుగా అవతరించింది. G20 కూటమి సందర్భంగా ఇండియా స్థానంలో మన దేశం పేరును కేంద్రం భారత్‌గా పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. 2023 జూన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు అధికారిక పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. వైట్‌హౌస్ వేదికగా ప్రధానికి అఫీషియల్ డిన్నర్ ఇచ్చారు బైడెన్ దంపతులు. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసిందీ పర్యటన. 2023లో దేశ రాజకీయాల్లో తన సుప్రిమసీని మరింత పెంచుకుంది బీజేపీ. హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జెండా ఎగరేయడమే కాకుండా.. మిజోరంలోనూ సత్తా చాటింది. అంతకుముందు మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడంతోపాటు నాగాలాండ్, మేఘాలయలోనూ సంకీర్ణ సర్కార్‌లో చేరింది. ప్రస్తుతం సొంతంగా 12 రాష్ట్రాల్లో.. కూటమి భాగస్వామిగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారం చెలాయిస్తోంది కమలదళం. ఓవైపు బీజేపీ జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌కు మాత్రం కష్టకాలమే నడిచింది. 2023లోనూ హస్తరేఖలు మారలేదు. మోదీ ఇంటి పేరును కించపరిచిన పరువునష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోవడం 2023 బిగ్ హెడ్‌లైన్స్‌లో ఒకటి. సూరత్ కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించడంతో.. మార్చి 23న లోక్‌సభ నుంచి అనర్హతకు గురయ్యారు రాహుల్. ఆగస్టు 7న ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్‌సభ సెక్రటేరియట్. 2023లో కీలకమైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. కర్ణాటక, తెలంగాణ విజయాలు స్వల్ప ఊరటనిచ్చాయి. 2023లో భారత రాజకీయాల్లో మరో కొత్త కూటమి ఆవిర్భవించింది. ప్రధాని మోదీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 28 ప్రతిపక్ష పార్టీలు ఒకటయ్యాయి. ఈ కూటమికి ఇండియా నామకరణం చేశారు. I.N.D.I.A అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇక్లూజివ్ అలయెన్స్. ఇండియ కూటమి ఏర్పాటుతో యూపీఏ కాలగర్భంలో కలిసిపోయింది. 2023 ఏప్రిల్‌లో చైనాను వెనక్కి నెట్టి... జనాభాపరంగా ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని అందుకుంది భారత్. 142.86 కోట్లమందితో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. వృద్ధ జానాభాతో చైనా ఇబ్బందులు పడుతుంటే.. యువజనంతో భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొంది ఐక్యరాజ్యసమితి జనాభా ఫండ్ నివేదిక. 2023 మే 28న భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ.. సరికొత్త ప్రజాస్వామ్య సౌధం కొలువుతీరింది. లోక్‌సభ స్పీకర్ పోడియం పక్కనే చారిత్రక సెంగోల్‌ను ప్రతిష్ఠించడం 2023కే బిగ్గెస్ట్ హైలైట్.ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో.. 41మంది నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుపోవడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. 2023 నవంబర్ 12న ఈ ప్రమాదం జరగ్గా.. అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా.. 16 రోజుల తర్వాత టన్నెల్ నుంచి కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఫైనల్ మిషన్‌ను లైవ్‌లో చూసిన ప్రధాని మోదీ.. బయటకు వచ్చిన కూలీలతో ఫోన్లో మాట్లాడారు. 2023లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన మరో అంశం.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీపార్టీ కీలక నేతల అరెస్ట్. ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుంది. ఈ ఇద్దరు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీయర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రెండుసార్లు సమన్లు జారీచేసింది ఈడీ. రెండు కీలక సంఘటనలకు 2023 ఏప్రిల్ నెల సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, మీడియా సమక్షంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఇద్దరినీ పాయింట్‌బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే, ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ భద్రతాదళాలకు చిక్కాడు. బింద్రెన్వాలా 2.0గా ప్రచారం చేసుకుంటూ.. సిక్కు యువతను రాడికలిజంవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్న అమృత్‌పాల్ కోసం నెలరోజులపాటు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పంజాబ్ పోలీసులు. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 850 మందికి పైగా గాయపడ్డారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా భావిస్తుండగా. కుట్రకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.2023లో దేశాన్ని కుదిపేసిన మరో సంఘటన మణిపూర్ అల్లర్లు. కుకీ-మైతేయీ జాతుల మధ్య వైరంతో రాష్ట్రం అట్టుడికింది. కుకీ-జోమి కమ్యూనిటీకి ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించగా.. ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు సంధించాయి విపక్షాలు. 2023 మాన్సూన్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాలు.. భారీ వర్షాలు వరదలతో విలవిల్లాడాయి. ఆకస్మిక వరదలు. కొండచరియలు విరిగిపడిన ఘటనలతో హిమాచల్ కకావికలమైంది. వందలమంది ప్రాణాలు కోల్పోగా..12వేలకోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని ఢిల్లీ 3రోజులపాటు వరద ముంపులో చిక్కుకుంది. 45ఏళ్ల తర్వాత డేంజర్ మార్క్ దాటి ప్రవహించింది యమునా నది. ఏడాది చివర్లో మిగ్జామ్ ఎఫెక్ట్‌తో కురిసిన భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది. చివరగా డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడే ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలో అలజడి సృష్టించారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి.. కలర్‌స్మోక్ వెదజల్లారు. పార్లమెంట్‌పై దాడి ఘటన 22వ వార్షికోత్సవం రోజు ఈ ఘటన జరగడం.. దేశాన్ని షాక్‌కు గురిచేసింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేశాయి ఇండియా కూటమి పార్టీలు. సభా మర్యాదను పాటించనందుకు.. అసాధారణ రీతిలో..ఉభయసభల నుంచి 143మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఢిల్లీ వేదికగా భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జూన్21-23 మధ్య ప్రధాని మోదీ అమెరికా స్టేట్ విజిట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కమలవికాసం ఈశాన్య భారతంలో మరింత బలం పెంచుకున్న బీజేపీ 2023లోనూ కాంగ్రెస్ పార్టీకి కష్టాలే మార్చి 23న రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం NDAకు పోటీగా కూటమి కట్టిన 28 ప్రతిపక్ష పార్టీలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ 2023 మే 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం 41 మంది కార్మికులు.. 16 రోజుల మెగా రెస్క్యూ ఆపరేషన్ ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్ట్ అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ ఏప్రిల్ 15న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ లైవ్ మర్డర్ ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ అరెస్ట్ 2023 జూన్ 2న బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జాతుల మధ్య వైరంతో మణిపూర్‌లో మారణకాండ ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ విలవిల యమున ఉప్పొంగడంతో నీటమునిగిన ఢిల్లీ లోక్‌సభలో అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ నుంచి 143మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ -
ఈ ముద్దుగుమ్మలు ఆడా లేరు...ఈడా లేరు!
ఈ ఏడాది కొంతమంది కథానాయికలను తెలుగు తెర మిస్సయింది. ఆ మాటకొస్తే తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాష తెరపైనా ఈ తారలు కనిపించలేదు. ఆడా లేరు.. ఈడా లేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా ఆ నాయికలు ఏం చేస్తున్నారో చూద్దాం. ‘లవ్ స్టోరీ (2021)’, ‘శ్యామ్ సింగరాయ్ (2021)’, ‘విరాటపర్వం (2022)’ సినిమాలతో రెండేళ్లుగా తెలుగు తెరపై సందడి చేసిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు. చెప్పాలంటే 2023లో నటిగా సాయిపల్లవి పూర్తిగా బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ తెలుగులోనే కాదు... ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. 2022లో తమిళంలో చేసిన ‘గార్గి’ చిత్రం తర్వాత సాయి పల్లవి నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’, శివ కార్తికేయన్‌తో ఒక చిత్రం... సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు ఇవే. ‘తండేల్’ షూటింగ్ జరుగుతోంది. శివ కార్తికేయన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. వచ్చే ఏడాది డబుల్ ధమాకాలా సాయి పల్లవి ఈ రెండు చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేస్తారు. హీరోయిన్గా ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘అంటే.. సుందరానికీ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, ‘బటర్ ఫ్లై’తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇలా.. 2022లో అనుపమా పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‌లో కనిపించారు. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు ముస్తాబైనా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమె కనిపించలేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో రవితేజ ‘ఈగల్’, తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉన్నాయి. ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు స్క్వేర్’ విడుదలవుతాయి. చూస్తుంటే.. 2024లో అనుపమా పరమేశ్వరన్ ముచ్చటగా మూడు సార్లయినా వెండితెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది రెండు తెలుగు సినిమాలు (పక్కా కమర్షియల్, థాంక్యూ), రెండు తమిళ సినిమాలు (తిరుచిత్రంబలం, సర్దార్)లతో కెరీర్లో దూకుడు పెంచినట్లుగా కనిపించారు రాశీ ఖన్నా. కానీ ఆ స్పీడ్‌కు ఈ ఏడాది స్పీడ్ బ్రేకర్ పడింది. రాశీ ఖన్నా సైన్ చేసిన హిందీ చిత్రం ‘యోధ’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంద్‌తో రాశీ ఖన్నా కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఇలా రాశీ ఖన్నా వెండితెరపై మెరవలేకపోయారు. అయితేనేం.. తమిళంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా నటించిన ‘అరణ్మణై 4’, హిందీ ‘యోధ’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో.. వచ్చే ఏడాది రాశీ ఖన్నా జోరు మళ్లీ కనిపిస్తుంది. అన్నట్లు మరో మాట.. తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ ఓ హీరోగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇక గత ఏడాది ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్, తమిళంలో ‘కోబ్రా’ చిత్రంతో తెరపై కనిపించిన శ్రీనిధీ శెట్టి ఈ ఏడాది కనిపించలేదు. తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తలైవన్’ సినిమాలతో గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు నిధీ అగర్వాల్. కానీ ఈ ఏడాది మాత్రం స్లో అయ్యారు. ఈ ఏడాది ఆమె హీరోయిన్గా నటించిన ఏ చిత్రం ఏ భాషలో కూడా వెండితెరపైకి రాలేదు. నిధి నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. నాని ‘గ్యాంగ్‌లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ సుపరిచితురాలే. గత ఏడాది ‘ఈటీ’, ‘డాన్’ వంటి తమిళ చిత్రాలతో వెండితెరపై మెరిశారామె. అయితే ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ప్రియాంక హీరోయిన్గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ ఏడాది రిలీజ్‌కు షెడ్యూలై, ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అలా ఈ ఏడాదిని మిస్ అయ్యారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగులో ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’, తమిళంలో ‘బ్రదర్’ చిత్రాలు చేస్తున్నారు ప్రియాంకా అరుళ్ మోహన్. -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్‌అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్‌లో టాప్‌లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్‌లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్‌తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
2023లో భారత్‌లో అడుగుపెట్టిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లోటస్ ఎలెట్రా (Lotus Eletre) ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు 'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది. 2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు. ఎంజీ కామెట్ (MG Comet) ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3) 'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది.