2023.. భారత్‌కు వెరీ బిగ్ ఇయర్. ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రపంచం జైకొట్టిన ఏడాది. విశ్వగురువుగా అవతరించిన ఏడాది. దేశానికి కొత్త ప్రజాస్వామ్య సౌధాన్ని అందించింది 2023. సొరంగం నుంచి యుద్ధభూమి వరకు.. భారతీయుడు కష్టంలో ఉంటే.. కేంద్రం కాపాడుతుందనే భరోసా ఇచ్చింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హెడ్‌లైన్స్, కీలక విషయాలను ఒకసారి చూద్దాం..
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల కూటమి G20 శిఖరాగ్ర సదస్సుకు.. 2023 సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ సౌత్‌కు లీడర్‌గా ఆవిర్భవించిన భారత్.. G20 అధ్యక్ష హోదాలో తన ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ అంశంతో కూడిన తీర్మానానికి ఏకాభిప్రాయం సాధించి.. విశ్వగురువుగా అవతరించింది. G20 కూటమి సందర్భంగా ఇండియా స్థానంలో మన దేశం పేరును కేంద్రం భారత్‌గా పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. 2023 జూన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు అధికారిక పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. వైట్‌హౌస్ వేదికగా ప్రధానికి అఫీషియల్ డిన్నర్ ఇచ్చారు బైడెన్ దంపతులు. ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసిందీ పర్యటన.
2023లో దేశ రాజకీయాల్లో తన సుప్రిమసీని మరింత పెంచుకుంది బీజేపీ. హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జెండా ఎగరేయడమే కాకుండా.. మిజోరంలోనూ సత్తా చాటింది. అంతకుముందు మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడంతోపాటు నాగాలాండ్, మేఘాలయలోనూ సంకీర్ణ సర్కార్‌లో చేరింది. ప్రస్తుతం సొంతంగా 12 రాష్ట్రాల్లో.. కూటమి భాగస్వామిగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారం చెలాయిస్తోంది కమలదళం.
ఓవైపు బీజేపీ జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌కు మాత్రం కష్టకాలమే నడిచింది. 2023లోనూ హస్తరేఖలు మారలేదు. మోదీ ఇంటి పేరును కించపరిచిన పరువునష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోవడం 2023 బిగ్ హెడ్‌లైన్స్‌లో ఒకటి. సూరత్ కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించడంతో.. మార్చి 23న లోక్‌సభ నుంచి అనర్హతకు గురయ్యారు రాహుల్. ఆగస్టు 7న ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్‌సభ సెక్రటేరియట్. 2023లో కీలకమైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. కర్ణాటక, తెలంగాణ విజయాలు స్వల్ప ఊరటనిచ్చాయి.
2023లో భారత రాజకీయాల్లో మరో కొత్త కూటమి ఆవిర్భవించింది. ప్రధాని మోదీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 28 ప్రతిపక్ష పార్టీలు ఒకటయ్యాయి. ఈ కూటమికి ఇండియా నామకరణం చేశారు. I.N.D.I.A అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇక్లూజివ్ అలయెన్స్. ఇండియ కూటమి ఏర్పాటుతో యూపీఏ కాలగర్భంలో కలిసిపోయింది. 2023 ఏప్రిల్‌లో చైనాను వెనక్కి నెట్టి... జనాభాపరంగా ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని అందుకుంది భారత్. 142.86 కోట్లమందితో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. వృద్ధ జానాభాతో చైనా ఇబ్బందులు పడుతుంటే.. యువజనంతో భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొంది ఐక్యరాజ్యసమితి జనాభా ఫండ్ నివేదిక.
2023 మే 28న భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ.. సరికొత్త ప్రజాస్వామ్య సౌధం కొలువుతీరింది. లోక్‌సభ స్పీకర్ పోడియం పక్కనే చారిత్రక సెంగోల్‌ను ప్రతిష్ఠించడం 2023కే బిగ్గెస్ట్ హైలైట్.ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో.. 41మంది నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుపోవడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. 2023 నవంబర్ 12న ఈ ప్రమాదం జరగ్గా.. అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా.. 16 రోజుల తర్వాత టన్నెల్ నుంచి కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఫైనల్ మిషన్‌ను లైవ్‌లో చూసిన ప్రధాని మోదీ.. బయటకు వచ్చిన కూలీలతో ఫోన్‌లో మాట్లాడారు.
2023లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన మరో అంశం.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీపార్టీ కీలక నేతల అరెస్ట్. ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుంది. ఈ ఇద్దరు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీయర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రెండుసార్లు సమన్లు జారీచేసింది ఈడీ. రెండు కీలక సంఘటనలకు 2023 ఏప్రిల్ నెల సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, మీడియా సమక్షంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఇద్దరినీ పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే, ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ భద్రతాదళాలకు చిక్కాడు. బింద్రెన్‌వాలా 2.0గా ప్రచారం చేసుకుంటూ.. సిక్కు యువతను రాడికలిజంవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్న అమృత్‌పాల్ కోసం నెలరోజులపాటు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పంజాబ్ పోలీసులు.
2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 850 మందికి పైగా గాయపడ్డారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా భావిస్తుండగా. కుట్రకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.2023లో దేశాన్ని కుదిపేసిన మరో సంఘటన మణిపూర్ అల్లర్లు. కుకీ-మైతేయీ జాతుల మధ్య వైరంతో రాష్ట్రం అట్టుడికింది.
కుకీ-జోమి కమ్యూనిటీకి ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించగా.. ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు సంధించాయి విపక్షాలు. 2023 మాన్‌సూన్‌లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాలు.. భారీ వర్షాలు వరదలతో విలవిల్లాడాయి. ఆకస్మిక వరదలు. కొండచరియలు విరిగిపడిన ఘటనలతో హిమాచల్ కకావికలమైంది. వందలమంది ప్రాణాలు కోల్పోగా..12వేలకోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని ఢిల్లీ 3రోజులపాటు వరద ముంపులో చిక్కుకుంది. 45ఏళ్ల తర్వాత డేంజర్ మార్క్ దాటి ప్రవహించింది యమునా నది. ఏడాది చివర్లో మిగ్‌జామ్ ఎఫెక్ట్‌తో కురిసిన భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది.
చివరగా డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడే ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. ఇద్దరు వ్యక‌్తులు లోక్‌సభలో అలజడి సృష్టించారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి.. కలర్‌స్మోక్ వెదజల్లారు. పార్లమెంట్‌పై దాడి ఘటన 22వ వార్షికోత్సవం రోజు ఈ ఘటన జరగడం.. దేశాన్ని షాక్‌కు గురిచేసింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేశాయి ఇండియా కూటమి పార్టీలు. సభా మర్యాదను పాటించనందుకు.. అసాధారణ రీతిలో..ఉభయసభల నుంచి 143మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు.
- ఢిల్లీ వేదికగా భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు
- జూన్21-23 మధ్య ప్రధాని మోదీ అమెరికా స్టేట్ విజిట్
- మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కమలవికాసం
- ఈశాన్య భారతంలో మరింత బలం పెంచుకున్న బీజేపీ
- 2023లోనూ కాంగ్రెస్ పార్టీకి కష్టాలే
- మార్చి 23న రాహుల్ గాంధీపై అనర్హత వేటు
- రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం
- NDAకు పోటీగా కూటమి కట్టిన 28 ప్రతిపక్ష పార్టీలు
- ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్
- 2023 మే 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం
- 41 మంది కార్మికులు.. 16 రోజుల మెగా రెస్క్యూ ఆపరేషన్
- ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్ట్
- అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్
- ఏప్రిల్ 15న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ లైవ్ మర్డర్
- ఏప్రిల్ 23న ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ అరెస్ట్
- 2023 జూన్ 2న బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం
- జాతుల మధ్య వైరంతో మణిపూర్‌లో మారణకాండ
- ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ విలవిల
- యమున ఉప్పొంగడంతో నీటమునిగిన ఢిల్లీ
- లోక్‌సభలో అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తులు
- పార్లమెంట్ నుంచి 143మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment