G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం | Sakshi
Sakshi News home page

G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం.. సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం..

Published Sat, Sep 9 2023 10:24 AM

G20 Summit Delhi Live Updates On Day 1 In Telugu - Sakshi

► జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌ ఆమోదం పొందింది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్‌ సాధించింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

►సదస్సు మధ్యలో ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యూకే ప్రధాని రిషి సునాక్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద, జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ కానున్నారు.

►‘15 సంవత్సరాల క్రితం ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడానికి తొలిసారి జీ20 నేతలు కలిసి మందుకువచ్చాం. అపారమైన సవాళ్ల సమయంలో కలిసాం. జీ20 నాయకత్వాన్ని అందించేందుకు ప్రపంచం మరోసారి చూస్తోంది. మనమంతా కలిసి ఈ సవాళ్లను పరిష్కరించగలమని నేను నుమ్ముతున్నాను’ అని| బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ట్వీట్‌ చేశారు.

►జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. పలు కీలక ఒప్పందాలపై ప్రపంచ నేతలు చర్చలు జరుపుతున్నారు. అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, భారత్‌ మధ్య మెగా రైల్‌-పోర్టు కనెక్టివిటీ డీల్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

►G20లో శాశ్వత సభ్యదేశంగా మారినందుకు ఆఫ్రికన్ యూనియన్‌ చైర్‌పర్సన్ అజలీ అసోమానిని ప్రధాని మోదీ హత్తుకున్నారు.  ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతకు మోదీ అభినందనలు తెలిపారు.

►జీ20 రౌండ్‌టేబుల్‌పై ప్ర‌ధాని మోదీ కూర్చున్న చైర్‌ వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌పై ఇండియా అని కాకుండా భార‌త్ అని రాసి ఉంది. అలాగే మోదీ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తూ.. భార‌త్ మిమ్మ‌ల్ని స్వాగ‌తిస్తోంద‌న్నారు.

►గ‌త కొన్ని రోజుల నుంచి ఇండియా పేరు మార్పు విషయంలో తీవ్ర స్థాయిలో చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయంగా భార‌త్‌ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంత‌ర్జాతీయ స‌మావేశంలో ఇండియాను భార‌త్‌గా గుర్తిస్తూ.. రౌండ్‌టేబుల్‌పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు.

►జీ20 సదస్సులో తొలి సెషన్‌ ప్రారంభమైంది. వన్‌-ఎర్త్‌పై ప్రపంచ నేతలు చర్చలు సాగిస్తున్నారు.

►భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సు ‘సాబ్‌కా సాథ్‌’ చేరికలకు చిహ్నంగా మారిందన్నారు.  ఇది భారత్‌లో ప్రజల జీ20గా మారిందని తెలిపారు. కోట్లాది మంది భారతీయులు దీనికి కనెక్ట్ అయ్యారని 60కి పైగా నగరాల్లో 200 కంటే ఎక్కువ సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు. 'సబ్‌కా సాథ్' భావనతో ఆఫ్రికన్ యూనియన్‌కు G20 శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయాలని భారత్‌  ప్రతిపాదించిందని తెలిపారు. 

►ప్రపంచానికి కొత్త దిశను చూపించడానికి 21వ శతాబ్దం ఒక ముఖ్యమైన సమయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాత సమస్యల నుంచి కొత్త సవాళ్లను కోరుతున్న సమయంలో మనం మన బాధ్యతలను మానవతావాదిగా నిర్వర్తిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  కోవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. కొవిడ్‌ను ఓడిస్తే ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చని తెలిపారు. అ

►జీ 20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ  మనమందరం కలిసి కదలాల్సిన సమయం ఇదని తెలిపారు. ఈ సందర్భంగా 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' మనకు టార్చ్ బేరర్‌గా పనిచేస్తుంది. భవిష్యత్తు తరాలకు సంబంధించి ఆహారం, ఇంధన నిర్వహణ, ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఆరోగ్యం, శక్తి , నీటి భద్రత వంటి విషయాల్లో పరిష్కారాన్ని కనుగొనాలి.

► జీ20 శాశ్వత సభ్య దేశంగా కొత్తగా చేరిన యూనియన్ ఆఫ్ కొమొరోస్, ఆఫ్రికన్‌ యూనియన్‌ ఛైర్‌పర్సన్ అజలీ అసోమనిని మోదీ గ్రూప్‌లోకి స్వాగతించారు. ఆయనను అభినందించి సభ్య దేశాలకు కేటాయించిన కుర్చులీ కూర్చోబెట్టారు.

► జీ20 సదస్సు ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ముందుగా మోరాకో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రకృతి విలయంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయం అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: భారత్‌ అధ్యక్షతన తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ముందుగా జీ20 దేశాధినేతలు ఒక్కొక్కరిగా భారత మండపానికి చేరుకున్నారు. దేశాధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఉదయం 10:30కు ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో జీ20 సదస్సు ప్రారంభం అయ్యింది.

►అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, సౌదీ అరేబియా ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ జీ20 సదస్సు వేదిక అయిన ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపానికి చేరుకున్నారు.

►బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్  రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగ‌న్‌, దక్షిణాఫికా అధ్యక్షుడు సిరిల్‌ రమసోఫా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని జీ20 సదస్సు వేదిక భారత్ మండపానికి చేరుకున్నారు. 

► ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, జపాన్‌ ప్రధాని కిషిదా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్  ప్రగతి మైదాన్‌లోని జీ20 సదస్సు వేదిక భారత్ మండపానికి చేరుకున్నారు.

► చైనా మంత్రి లీ కియాంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకున్నారు. భారత్ మండపానికి చేరుకున్నారు.

బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ జీ 20 సమ్మిట్‌కు వేదికైన భారత్ మండపానికి చేరుకున్నారు.

జీ20 సదస్సులో భాగంగా ఇవాళ.. పదిన్నర నుంచి ఒకటిన్నర మధ్యలో వన్ ఎర్త్ సమ్మిట్ జరగనుంది. ఆపై 1.30గం నుంచి 3.00 మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. మ.3- మ.4.45 మధ్య సెషన్ 2లో భాగంగా.. వన్ ఫ్యామిలీ సమ్మిట్ జరుగుతుంది. ఇక రాత్రి 7గం - 8గం మధ్య జీ20 దేశాధినేతలు గ్రూప్ ఫోటో దిగుతారు. రా.8గం 9.15గం సమయంలో జీ20 దేశాధినేతల డిన్నర్ మీటింగ్ ఉంటుంది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే జీ20 సదస్సు ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపం వేదికగా రెండు రోజులపాటు(ఇవాళ, రేపు) సాగనుంది. వసుదైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్‌ ఈ సదస్సును నిర్వహిస్తోంది. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపుతూ.. భౌగోళికంగా ముక్కలైన రాజకీయ వాతావరణానికి చికిత్స చేసే సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై ఈ సదస్సు దృష్టి పెట్టబోతోంది.

.

1.

Advertisement
Advertisement