2023.. భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర విషాదం మిగిల్చిన సంవత్సరంగా చిరకాలం గుర్తుండిపోనుంది. భారీ అంచనాల నడుమ స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు చివరి వరకు అద్భుతంగా పోరాడి అనూహ్య రీతిలో తుది మెట్టుపై బోల్తా పడి అభిమానులకు తీవ్ర గుండెకోతను మిగిల్చింది.
లక్షలాది మంది సమక్షంలో, కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల నడుమ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అడియాశలు చేసింది.
ఈసారి కప్ మనదే అని ధీమాగా ఉండిన భారతీయులు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధించారు. టోర్నీ గడిచి దాదాపు నెల రోజులు అవుతున్నా అభిమానులు, ఆటగాళ్లు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు.
ఈ చేదు అనుభూతి మినహాయిస్తే భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకోవడం ద్వారా భారత్ 2023కు ఘన స్వాగతం పలికింది. అనంతరం అదే శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఆతర్వాత న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ (3-0), వన్డే సిరీస్‌లు (2-1) నెగ్గి, కొత్త ఏడాది తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది.
దీని తర్వాత స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో (టెస్ట్‌లు) నెగ్గిన భారత్.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయి 2023లో తొలి సిరీస్ పరాజయాన్ని చవిచూసింది.
అనంతరం ఏప్రిల్, మే మసాల్లో టీమిండియా ఆటగాళ్లు సహా ప్రపంచ క్రికెట్ మొత్తం ఐపీఎల్‌తో బిజీగా ఉండింది. జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌తో టీమిండియా తిరిగి అంతర్జాతీయ వేదికపై ప్రత్యక్షమైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్‌షిప్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది.
దీని తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో, వన్డే సిరీస్‌ను 2-1తో గెలుపొందింది. ఈ పర్యటనలో భారత్ టీ20 సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది.
అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో నెగ్గింది. దీని తర్వాత శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత స్వదేశంలో ఆసీస్‌తో 3 వన్డేలు ఆడిన భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ సిరీస్ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమిండియా.. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం అదే ఆసీస్‌తో స్వదేశంలోనే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడిన భారత్ 4-1 తేడాతో జగజ్జేతను ఓడించింది.
దీని తర్వాత భారత్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. వన్డే, టెస్ట్ సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ ఏడాదంతా భారత క్రికెట్ జట్టుకు సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment