త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్‌లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్‌ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్‌లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు....
► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్‌ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్‌లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది.
►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్‌ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ.
► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్‌టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్‌తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది.
► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది.
► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా.
► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో పనిచేసింది.
► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది.
(చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు)
Comments
Please login to add a commentAdd a comment