Tri forces
-
గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో ఈ సారి త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతోపాటు.. మహిళా అగి్నవీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. త్రివిధ దళాలు, అగి్నవీర్‌ల్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లోనూ త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పరేడ్‌లో పాల్గొనలేదు. ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా ఆధికారులే నాయకత్వం వహిస్తారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే వినిపించనున్నాయి. 1950 నుంచి జనవరి 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లో ‘అబైడ్ విత్ మి’ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీ. అయితే దీనిపై విమర్శలు, వివాదం తలెత్తడంతో 2022లో నిలిపివేశారు. ఈసారి జరిగే బీటింగ్ రిట్రీట్‌లో పూర్తిగా స్వదేశీ స్వరాలే వాయించబోతున్నారు. -
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
అనుక్షణం అప్రమత్తం
హిండన్ (యూపీ): సరిహద్దుల్లో అనుక్షణం త్రివిధ బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయని భారత వాయుసేన చీఫ్ వి.ఆర్. చౌధరి చెప్పారు. గత ఏడాది తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో డ్రాగన్ కుయుక్తుల్ని తిప్పికొట్టడమే దీనికి సాక్షీభూతంగా నిలుస్తుందని అన్నారు. శుక్రవారం 89వ భారత వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ వద్ద విఆర్ చౌధరి మాట్లాడుతూ వైమానిక దళంలో బలగాలకు మరింత శిక్షణ అవసరమని అన్నారు. యువ అధికారులు మరింత రాటు దేలేలా శిక్షణ ఇవ్వడానికి అనుభవం కలిగిన అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన దేశ భూభాగంలోకి విదేశీ శక్తులు రాకుండా ఉండేలా మన శక్తిని చూపించాలని ఆయన వ్యాఖ్యానించారు. మన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని, స్పష్టమైన లక్ష్యాలతో సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానిని ప్రతిజ్ఞ చేస్తున్నానని పేర్కొన్నారు. అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉందన్నారు. యువ ఆఫీసర్లకు ఆయా టెక్నాలజీలను వాడేలా శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. వాయుసేనలోని బృంద సభ్యులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 75 యుద్ధ విమానాలతో ఎయిర్‌షో నిర్వహించారు. వైమానిక దళం ఆధునీకరణలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చెప్పారు. సరిహద్దులో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి, క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేలా బలగాలను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ జనరల్ ఎంఎం నరవాణె హాజరయ్యారు. భారత వాయుసేన దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఏఎఫ్ బృందాలకు శుభాకాంక్షలు చెప్పారు. -
నారీ శక్తి సైనిక శక్తి
న్యూఢిల్లీ: భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. శీతాకాలం వేళ ఆదివారంనాడు సూర్యకిరణాల వెచ్చదనం మధ్య త్రివిధ బలగాలు నిర్వహించిన 90 నిమిషాల పెరేడ్ అణువణువునా దేశభక్తిని నింపుతూ రోమాలు నిక్కబొడిచేలా సాగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది. రాజ్‌పథ్‌లో గోవా, మేఘాలయ తదితర రాష్ట్రాల శకటాల ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం దగ్గర నివాళులర్పించడం దగ్గర్నుంచి గగనతలంలో త్రివిధ బలగాలకి సంకేతంగా హెలికాప్టర్లు చేసే విన్యాసాల వరకు ఎన్నో తొలి ఘటనలకు ఈ వేడుకలు సాక్షీభూతమయ్యాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి పెరేడ్ని తిలకించారు. రాజ్‌పథ్‌లో పెరేడ్ మొదలు కావడానికి ముందు జాతీయ గీతం బ్యాండ్‌ని వాయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో 21 సార్లు గాల్లోకి తుపాకులు పేల్చి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఇతర ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యుద్ధస్మారక కేంద్రం వద్ద ప్రధాని నివాళులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం పెరేడ్ ప్రారంభం కావడానికి ముందు కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. ఏటా ఇండియా గేట్ దగ్గరున్న అమర్ జ్యోతి జవాన్ వద్ద నివాళుల ర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కాషాయ బాందినీ ప్రింట్ తలపాగాతో.. జాతీయ వేడుకల సమయంలో ప్రధానమంత్రి మోదీ రంగుల తలపాగా ధరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. తెల్ల రంగు పైజామా, కుర్తా, దానిపైన నీలం రంగు జాకెట్, కాషాయ రంగులో వీపు మీదుగా జారేలా ఉండే బాందినీ ప్రింట్ తలపాగా ధరించారు. రాజస్తాన్, గుజరాత్‌లలో ఇలాంటి తలపాగాలను ధరిస్తారు. ఆకట్టుకున్న శకటాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన ఆద్యంతం మనోహరంగా సాగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్ ప్రదేశ్ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది. ఎన్నో ఫస్ట్లు రాజ్‌పథ్‌లో జరిగిన పెరేడ్ని మహిళా కమాండర్ కెప్టెన్ తాన్యా షెర్గిల్ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్‌కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ► సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్స్పెక్టర్ సీమ నాగ్ నేతృత్వంలో డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శన సాగింది. నడుస్తున్న బైక్ పైభాగాన నిల్చొని సీమ సెల్యూట్ సమర్పించడం ఈ షోకే హైలైట్. ► జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొని ‘‘తిరిగి గ్రామానికి’’అన్న థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం ముందుభాగంలో కశ్మీర్ చేతి వృత్తులను ప్రతిబింబించేలా శాలువా అల్లుతున్న కార్మికుడ్ని ఉంచారు. ► రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) గత ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్)ని ఈ సారి పెరేడ్లో తొలిసారిగా ప్రదర్శించారు. మిషన్ శక్తిలో భాగంగా మన క్షిపణి వ్యవస్థ సత్తా దీంతో తెలుస్తుంది. ► ధనుష్ శతఘ్నులను తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించారు. 155ఎంఎం/45 కాలిబర్ సామర్థ్యం కలిగిన ఈ శతఘ్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 36.5కి.మీ. దూరం వరకు ధనుష్ కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తుంది. ► కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్లో ప్రదర్శించాయి. మారుమూల ప్రాంతాల్లో భారీ లోడ్లను కూడా చినూక్ మోసుకుపోగలదు. ఇక అపాచి హెలికాప్టర్ గగనతలం నుంచి గగనతలానికి, నింగి నుంచి నేలకి కూడా క్షిపణుల్ని ప్రయోగించే సత్తా ఉంది. ► నీలాకాశంలో జరిగే వైమానిక విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా సాగాయి. 40 విమానాలు త్రిశూల్ ఆకారంలో విన్యాసాలు చేయడంతో మొదలై త్రివిధ దళాలకి గుర్తుగా మూడు ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు ’VIP’ ఆకారంలో వచ్చాయి. ఈ ప్రదర్శనని ఇలా నిర్వహించడం ఇదే తొలిసారి. 17 వేల అడుగుల ఎత్తులో.. న్యూఢిల్లీ: 17 వేల అడుగుల ఎత్తు.. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. మోకాళ్ల లోతు మంచు.. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లకు ఇవేవీ అడ్డంకి కాలేదు. 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా లదాఖ్‌లో ‘వందేమాతరం.. భారత్ మాతా కీ జై’ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. సైనికులను కీర్తిస్తూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. దేశానికి నిజమైన హీరోలు మీరే అంటూ ఒకరు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. గణతంత్ర వేడుకలు జరుపుతున్న హీరోలు అంటూ ఇంకొకరు అని కొనియాడారు. గణతంత్ర వేడుకల్లో మోదీ ధరించిన తలపాగాలు పరేడ్‌లో ఆకాశ్ క్షిపణి బైక్‌పై సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల విన్యాసం -
‘జై జవాన్’ మరిచారా?
ఆదేశాలనే తప్ప పర్యవసానాలను ఆలోచించకుండా, ప్రాణాలను లెక్క చేయ కుండా ముందుకురికే అలవాటున్న త్రివిధ దళాల సిబ్బంది తమ సమస్యల పరి ష్కారం కోసం రోడ్డెక్కరు. వారి క్రమశిక్షణ అలాంటిది. వారి సర్వీస్ నిబంధనలు అలాంటివి. త్రివిధ దళాలకు సంబంధించిన చట్టాలు భావప్రకటనా స్వేచ్ఛను నిర్ద్వంద్వంగా నిరాకరించాయి. ‘ఒకే ర్యాంక్... ఒకే పింఛన్ (ఓఆర్ఓపీ)పై గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న వివాదం రిటైరైన సైనిక సుబేదార్ ప్రాణాలు కోల్పోవడానికి దారి తీయడమే దురదృష్టమనుకుంటే... దాని వెనకే జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రమపరుస్తున్నాయి. న్యూఢిల్లీలో రక్షణమంత్రి మనోహర్ పారికర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన అయిదారు గురు మాజీ సైనికోద్యోగుల్లో రాంకిషన్ ఒకరు. వారికా అవకాశం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగి అక్కడికి దగ్గర్లో ఉన్న పార్క్‌లో కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి రాంకిషన్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి చేర్చాక ఆ సమాచారం అందుకుని అక్కడికొచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులను పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. రాహుల్‌గాంధీ బుధవారం రెండుసార్లు, ఇవాళ ఒకసారి పోలీసు నిర్బంధంలోకి వెళ్లారు. ఇవాళ చేసింది అరెస్టు కాదని పోలీసులంటున్నారు. రాంకి షన్ కుటుంబంపట్ల అగౌరవంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జంతర్‌మంతర్ వద్ద సాగుతున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్‌ను పోలీస్ వ్యాన్ ఎక్కించడమైతే వాస్తవం. ఓఆర్ఓపీ వ్యవహారంలోనూ, ప్రత్యేకించి ఈ ఉదంతానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరునూ విపక్షాలు తప్పుబడుతుంటే... మాజీ సైనికుడి మరణాన్ని రాజకీయం చేయజూస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతు న్నారు. వివాదం తలెత్తినప్పుడు పాలకపక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిం చడం ఎక్కడైనా, ఎప్పుడైనా రివాజే. 2011లో మాజీ సైనికులు రోడ్డెక్కినప్పుడు వారిని బీజేపీ సమర్ధించింది. 2014 ఎన్నికల ముందు సైతం వారి ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఇప్పుడు విపక్షంలో ఉండి కాంగ్రెస్ ఆ పనే చేస్తోంది. కనుక ఈ అంశంలో ఫలానా పార్టీది రాజకీయమని ప్రకటించడం కూడా రాజ కీయమే అవుతుంది. ఓఆర్ఓపీ సమస్య ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిపడింది. 1973లో ఏర్పాటుచేసిన కేంద్ర వేతన సవరణ సంఘం(పీఆర్సీ)లో తొలిసారి సైనికుల నుంచి ప్రాతినిధ్యం లేకుండా చేయడం వల్ల వేతన సవరణలో వారికి అన్యాయం జరిగింది. అప్పటినుంచీ ఆ సంప్రదా యమే కొనసాగుతోంది. దీనివల్ల త్రివిధ దళాలకు పెరిగే జీతాలకూ, ప్రభుత్వ సిబ్బందికి పెరిగే జీతాలకూ వ్యత్యాసం ఉంటోంది. పింఛన్లలో సైతం అది ప్రతిబింబిస్తోంది. హోదాల గుర్తింపులోనూ సమస్యలొస్తున్నాయి. 1986నాటి నాలుగో వేతన సవరణ సంఘం నివేదికతో ఇది మరింత పెరిగింది. త్రివిధ దళాల్లోని కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ వంటి హోదాలు పోలీసు ఉన్నతాధికారుల హోదాతో పోలిస్తే తగ్గిపోయాయి. వేతనాల్లో, పింఛన్లలో కూడా ఆమేరకు వ్యత్యాసం వచ్చింది. సైన్యంలో 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసినవారిలో కేవలం 0.8 శాతంమందికి మాత్రమే మేజర్ జనరల్ పదోన్నతి వస్తుంది. కానీ పౌర అధికారుల్లో దానికి సమాన ర్యాంక్ అయిన జాయింట్ సెక్రటరీ హోదాకు 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఐఏఎస్‌లలో వంద శాతంమంది, 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన ఐపీఎస్‌లలో 80 శాతంమంది చేరుకుంటారు. ఇదే స్థితి మిగిలిన హోదాల్లోనూ ఉంది. ఓఆర్ఓపీ అమలు చేస్తామని 2004 ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన కాంగ్రెస్ దాన్ని వమ్ము చేసింది. దాని అమలు సాధ్యంకాదని యూపీఏ సర్కారు 2008లో ప్రకటించింది. పర్యవసానంగా 22,000మంది రిటైరైన సైనిక సిబ్బంది తమ పతకాలనూ, అవార్డులనూ రాష్ట్రపతికి తిరిగిచ్చేశారు. తమ నెత్తుటి సంత కాలతో వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాతే 2011లో అన్ని పక్షాలతో బీజేపీ నేత భగత్‌సింగ్ కోషియారి నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పడటం, అది ఓఆర్ఓపీని అమలు చేయాలని సిఫార్సు చేయడం పూర్తయింది. ఆ తర్వాతైనా యూపీఏ ప్రభుత్వం చురుగ్గా కదల్లేదు. కమిటీ నివేదికను ఆమోదించడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. 2014 ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఓఆర్ఓపీ అమలును ప్రకటించింది. పాలనాపరమైన ఉత్తర్వు ఇచ్చింది. ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన ఎన్డీఏ సర్కారు బడ్జెట్లోనూ దీని ప్రస్తావన ఉంది. ఓఆర్ఓపీని అమల్లోకి తెచ్చామని మొన్న ఫిబ్రవరిలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినా అసంతృప్తి చల్లారలేదు. ఇచ్చిన హామీకీ, దీనికీ పొంతన లేదని ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైరైనవారే పెదవి విరిచారు. అమలు సంగతలా ఉంచి ఆందో ళన జరుపుతున్నవారితో వ్యవహరిస్తున్న తీరు గర్హించదగ్గది. నిరుడు స్వాతంత్య్ర దినోత్సవం సమయంలోనూ, ఆ తర్వాత నిరసనకు దిగినవారితో ఢిల్లీ పోలీసులు అతిగా వ్యవహరించారు. రాంకిషన్ మరణానికి కారణమేమిటన్నది పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుంది. కానీ ఆయన కుమారుడు, ఇతర కుటుంబసభ్యుల విషయంలో పోలీసుల ప్రవర్తన... పరామర్శకొచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోసహా నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచవు. పరామర్శే నేరమనుకో వడం మంచిదికాదు. దీనికితోడు నోరుజారడంలో అపకీర్తి గడించిన విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాంకిషన్ మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఆయనిప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ అని చెప్పడం దేనికి సంకేతం? వీకే సింగ్ మాదిరే పలువురు బీజేపీ నేతలు నోరుపారేసుకున్నారు. సర్జికల్ దాడుల విషయంలో జవాన్లను కీర్తిస్తూనే వారి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, వారిని అవమానిస్తున్నారని అందరూ అనుకుంటారన్న ఇంగితం కూడా ఈ నేతలకు లేకపోయింది. ఇలాంటి ఎత్తుగడలు విడనాడి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం అవసరమని పాలకులు గుర్తించాలి.