
గిల్- సచిన్ (PC: BCCI)
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మరింత వినోదాత్మకంగా
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు అదనపు ప్రయోజనం కలుగుతుందని శుబ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్ కారణంగా అదనపు బ్యాటర్ లేదంటే బౌలర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని.. ఈసారి స్కోర్లు 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు.
ఈ నిబంధన ఐపీఎల్‌ను మరింత వినోదాత్మకంగా మార్చిందని గిల్ జియోహాట్‌స్టార్ షోలో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఐపీఎల్‌తో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గిల్ గుర్తు చేసుకున్నాడు.
‘‘పంచకులలోని తౌ దేవి లాల్ స్టేడియానికి మా నాన్నతో కలిసి మూడు, నాలుగు మ్యాచ్‌లకు వెళ్లాను. నాకు తెలిసి అప్పటికి ఐపీఎల్ మొదలై మూడేళ్లు గడిచి ఉంటాయి.
నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్
అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చింది. నాకప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా.. సచిన్ సర్‌తో గ్లెన్ మాక్స్‌వెల్‌తో నేను ఫొటో తీసుకున్నా.
వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నపుడు బాల్స్ త్రో చేసేవాడిని. ఐపీఎల్‌తో నాకున్న తొలి జ్ఞాపకం అదే. సచిన్ సర్ గురించి నాకు ముందు నుంచే తెలుసు. ఆయనను చూసే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.
మా నాన్న ఆయనకు వీరాభిమాని
ఇక మా నాన్న అయితే.. సచిన్ సర్‌కి వీరాభిమాని. మా గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించేవి’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు. ఇక కెప్టెన్సీ అనేది ఓ నిరంతర ప్రయాణమన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. నాయకుడిగా భిన్న అనుభవాలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు.
జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడి నైపుణ్యాలపై అవగాహన పెంచుకుని.. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకున్న వారే నాయకులుగా రాణిస్తారని గిల్ అన్నాడు. ప్రతి మ్యాచ్ సరికొత్తగా ఉంటుందని.. ఆటగాళ్ల బలాలు, బలహీనతలు అర్థం చేసుకుంటే.. వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా అనుభవం గడించినపుడే..
ఇక సారథిగా చేసే ప్రయాణంలో అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత రాటుదేలతామని.. అయితే, ఒక్కోసారి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటపుడు సంయమనంతో ముందుకు సాగితే ప్రతికూల ప్రభావం పడదని గిల్ చెప్పుకొచ్చాడు.
టైటాన్స్ పగ్గాలు చేపట్టిన కొత్తల్లో తాను సహచర ఆటగాళ్లతో ఎక్కువగా మమేకం కాలేకపోయానన్న.. అయితే, నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తనకు తెలియకుండానే ఎంతో మారిపోయానని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం.. వారి మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నానని గిల్ తెలిపాడు.
చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment