Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ | 2023 Tollywood Hit And Flop Movies | Sakshi
Sakshi News home page

Year End 2023: 306 సినిమాలు.. హిట్లు తక్కువ..ఫ్లాపులు ఎక్కువ

Published Sun, Dec 31 2023 12:45 AM | Last Updated on Sun, Dec 31 2023 9:11 AM

2023 Tollywood Hit And Flop Movies - Sakshi

స్ట్రయిట్‌ చిత్రాలు 236... డబ్బింగ్‌ సినిమాలు 70...  మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్‌గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు  ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు.

ఇక ఈ ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్‌లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు దక్కడం ఓ రికార్డ్‌. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కి దక్కడం మరో ఆనందం.  ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్‌ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్‌ హిట్‌.. మోర్‌ ఫట్‌గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి...

స్టార్‌ హీరోలు కొందరు ‘హిట్‌ హిట్‌ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్‌ రేంజ్, చిన్న రేంజ్‌ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్‌ గురించి తెలుసుకుందాం.

సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్‌ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన  బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు.

సంక్రాంతికి మంచి హిట్‌ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్‌ కేసరి’తోనూ మరో హిట్‌ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్  ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు ఈ ఏడాది ఓ హిట్‌.. ఓ ఫట్‌ పడ్డాయి. ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’తో ప్రభాస్‌కి సూపర్‌ డూపర్‌ హిట్‌ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్‌ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్‌ మూవీ ‘దసరా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అలాగే శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్‌ మూవీ ‘హాయ్‌ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్‌ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్‌ లవ్‌స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్‌ ధనుష్‌ తెలుగులో చేసిన స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘సార్‌’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ  పీరియాడికల్‌ యాక్షన్  అండ్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.  

నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ నవీన్  పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్‌ హిట్‌ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్‌బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ హిట్‌తో జోష్‌గా ఉన్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా కార్తీక్‌ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్‌ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్‌ హిట్‌ సాధించారు.

రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్‌ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్‌ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ మూవీకి సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్‌ డైరెక్షన్‌ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‌‡హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది.

రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్‌ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్‌. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్‌ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్‌లో సక్సెస్‌ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్‌.  ఈ చిత్రానికి అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్‌ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్‌రామ్‌ ‘డెవిల్‌’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఇంకా స్ట్రయిట్‌ హిట్‌ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్‌ ‘ఉగ్రం’, పాయల్‌ రాజ్‌పుత్‌ ‘మంగళవారం’, నవీన్  చంద్ర ‘మంత్‌ ఆఫ్‌ మధు’, సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌ల ‘మ్యాడ్‌’, తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్‌ ‘జైలర్‌’, విజయ్‌ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్‌ సెల్వన్‌ 2’, విజయ్‌ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్‌ ‘2018’, షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’, ‘జవాన్‌’, రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి.

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. 
ఫట్‌ అయిన ఆ చిత్రాల గురించి..

‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్‌ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్‌’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్‌ హిట్‌ ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్‌ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్‌ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి.

రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ రూపోందింది. హీరో రామ్‌–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది.

ఇక సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటించిన ఏజెంట్‌’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్‌ తేజ్‌ వ్యక్తిగతంగా ఫుల్‌ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్‌లో కొత్త చాప్టర్‌ని మొదలుపెట్టారు. అయితే కెరీర్‌ పరంగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది.

నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్‌లో రూపోందిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్‌ మూవీ అనిపించుకుంది. టాక్‌ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్‌ సమంత, నటుడు దేవ్‌ మోహన్‌ కాంబినేషన్‌లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్‌ ‘రామబాణం’, కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’, నిఖిల్‌ ‘స్పై’, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’, సుధీర్‌ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement