ఈ ఏడాది కొంతమంది కథానాయికలను తెలుగు తెర మిస్సయింది. ఆ మాటకొస్తే తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాష తెరపైనా ఈ తారలు కనిపించలేదు. ఆడా లేరు.. ఈడా లేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా ఆ నాయికలు ఏం చేస్తున్నారో చూద్దాం.
‘లవ్ స్టోరీ (2021)’, ‘శ్యామ్ సింగరాయ్ (2021)’, ‘విరాటపర్వం (2022)’ సినిమాలతో రెండేళ్లుగా తెలుగు తెరపై సందడి చేసిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు. చెప్పాలంటే 2023లో నటిగా సాయిపల్లవి పూర్తిగా బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ తెలుగులోనే కాదు... ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు.
2022లో తమిళంలో చేసిన ‘గార్గి’ చిత్రం తర్వాత సాయి పల్లవి నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’, శివ కార్తికేయన్‌తో ఒక చిత్రం... సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు ఇవే. ‘తండేల్’ షూటింగ్ జరుగుతోంది. శివ కార్తికేయన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. వచ్చే ఏడాది డబుల్ ధమాకాలా సాయి పల్లవి ఈ రెండు చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేస్తారు.
హీరోయిన్‌గా ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘అంటే.. సుందరానికీ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, ‘బటర్ ఫ్లై’తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇలా.. 2022లో అనుపమా పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‌లో కనిపించారు. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు ముస్తాబైనా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమె కనిపించలేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో రవితేజ ‘ఈగల్’, తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉన్నాయి. ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు స్క్వేర్’ విడుదలవుతాయి. చూస్తుంటే.. 2024లో అనుపమా పరమేశ్వరన్ ముచ్చటగా మూడు సార్లయినా వెండితెరపై మెరిసే అవకాశం ఉంది.
గత ఏడాది రెండు తెలుగు సినిమాలు (పక్కా కమర్షియల్, థాంక్యూ), రెండు తమిళ సినిమాలు (తిరుచిత్రంబలం, సర్దార్)లతో కెరీర్‌లో దూకుడు పెంచినట్లుగా కనిపించారు రాశీ ఖన్నా. కానీ ఆ స్పీడ్‌కు ఈ ఏడాది స్పీడ్ బ్రేకర్ పడింది. రాశీ ఖన్నా సైన్ చేసిన హిందీ చిత్రం ‘యోధ’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంద్‌తో రాశీ ఖన్నా కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఇలా రాశీ ఖన్నా వెండితెరపై మెరవలేకపోయారు. అయితేనేం.. తమిళంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్‌గా నటించిన ‘అరణ్మణై 4’, హిందీ ‘యోధ’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో.. వచ్చే ఏడాది రాశీ ఖన్నా జోరు మళ్లీ కనిపిస్తుంది. అన్నట్లు మరో మాట.. తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ ఓ హీరోగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇక గత ఏడాది ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్, తమిళంలో ‘కోబ్రా’ చిత్రంతో తెరపై కనిపించిన శ్రీనిధీ శెట్టి ఈ ఏడాది కనిపించలేదు.
తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తలైవన్’ సినిమాలతో గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు నిధీ అగర్వాల్. కానీ ఈ ఏడాది మాత్రం స్లో అయ్యారు. ఈ ఏడాది ఆమె హీరోయిన్‌గా నటించిన ఏ చిత్రం ఏ భాషలో కూడా వెండితెరపైకి రాలేదు. నిధి నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
నాని ‘గ్యాంగ్‌లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ సుపరిచితురాలే. గత ఏడాది ‘ఈటీ’, ‘డాన్’ వంటి తమిళ చిత్రాలతో వెండితెరపై మెరిశారామె.
అయితే ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ప్రియాంక హీరోయిన్‌గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ ఏడాది రిలీజ్‌కు షెడ్యూలై, ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అలా ఈ ఏడాదిని మిస్ అయ్యారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగులో ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’, తమిళంలో ‘బ్రదర్’ చిత్రాలు చేస్తున్నారు ప్రియాంకా అరుళ్ మోహన్.
Comments
Please login to add a commentAdd a comment