రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లోటస్ ఎలెట్రా (Lotus Eletre)
ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు 'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది.
హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5)
హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది.
2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift)
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు.
ఎంజీ కామెట్ (MG Comet)
ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3)
'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment