స్టాక్‌మార్కెట్‌లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి.
2023 ప్రారంభంలో మార్కెట్‌లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి.
ర్యాలీకి కారణాలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది.
బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. జూన్‌లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్‌టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్‌లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి.
2024లో ఎలా ఉండబోతుందంటే..
వచ్చే ఏడాది స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు.
ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment