రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు.. | MBBS seats to reach ten thousand in the state | Sakshi
Sakshi News home page

రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు..

Published Fri, Dec 29 2023 4:48 AM | Last Updated on Fri, Dec 29 2023 4:57 AM

MBBS seats to reach ten thousand in the state - Sakshi

ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి ఏడు ప్రభుత్వ కాలేజీల ప్రారం¿ోత్సవం, వచ్చే సంవవత్సరానికి మరో ఏడు జిల్లాల్లోనూ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ఇది సాకారం అయితే దేశంలోనే ప్రతిజిల్లాలోనూ మెడికల్‌ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కుతుంది. సాగునీటిరంగంలో కాళేశ్వం ప్రాజెక్టు లోపాలు పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. పింఛన్లు పెంపు ఆసరా లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులకు బ్రేక్‌ పడింది. కేంద్రంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కారణంగా ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది.   

వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది సాధించిన ప్రధాన విజయాల్లో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించడంగా చెప్పవచ్చు. 2023–24 సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే మెడికల్‌ విద్యార్థులు వాటిల్లో చేరారు.

ఇక 2024–25 సంవత్సరంలోనూ జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుంది. అంటే 800 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

33 జిల్లాలకుగాను  ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకాగా, తాజాగా అనుమతించిన 8 ప్రభుత్వ  మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ఒక మెడికల్‌ కాలేజీ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. ఇవి పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల సంఖ్య మొత్తం 34కు చేరుతుంది. తాజా నిర్ణయంతో అన్ని  జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉండే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. అంటే మొత్తంగా రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.  

పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ  
పింఛన్‌ రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంపు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికొస్తే..ప్రధానంగా ఆసరాలో భాగంగా దివ్యాంగుల పింఛన్‌ రూ.3,016 నుంచి రూ. 4,016కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెంచింది. పెంపునకు అనుగుణంగా 5,11,656 మందికి నెలకు రూ.­205.48 కోట్లు అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
 
♦ జీపీలు, సర్పంచ్‌లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదలలో జాప్యం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పలు జీపీల్లో సర్పంచ్‌లు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వివిధ పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య 
చేసుకున్నారు.  
♦ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనూ నిధుల సమస్య   ఉపాధి హామీ అమల్లో భాగంగా... తెలంగాణలో నియమ,నిబంధనలు, మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపేసింది. అయితే కేంద్రం పక్షపాతం ప్రదర్శిస్తూ సకాలంలో నిధులు విడుదల చేయడం లేదంటూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ విమర్శలు సంధించింది. ఇదిలా ఉంటే...ఈ పథకంలో భాగంగా ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీస్, ఔట్‌సోర్సింగ్‌–కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత రెండు, మూడు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది.  

మా‘స్టార్‌’ ఏదీ?
♦ సాగని పదోన్నతులు... ఆగిన బదిలీలు ఆఖరులో తప్పని 
♦ టెట్‌ చిక్కులు.. టీచర్‌ పోస్టులకూ బ్రేకులు 
♦ ఉన్నత విద్యామండలిలో మహా నిశ్శబ్దం  

దీర్ఘకాలిక డిమాండ్‌ అయిన బదిలీలు, పదోన్నతులుపై ఆశలు రేకెత్తిందీ ఈ ఏడాదే. 10 వేలమంది టీచర్లు ప్రమోషన్లపై కలలుగన్నారు. దాదాపు 50 వేలమంది స్థానచలనం ఉంటుందని ఆశించారు. కానీ నోటిఫికేషన్‌ ఇచ్చిన ఊరట ఎంతోకాలం నిలవలేదు. అడ్డుపడ్డ కోర్టు వ్యాజ్యాలు టీచర్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ప్రమోషన్లకూ బ్రేకులు పడటం 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకమే. ఉపాధ్యాయ కొలువుల భర్తీపై నిరుద్యోగుల గంపెడాశలకు 2023 నీళ్లు చల్లింది.

విద్యాశాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా, 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్‌ రావడం, అదీ అర్ధంతరంగా ఆగిపోవడం నిరుద్యోగులకు 2023 అందించిన ఓ పీడకల. జాతీయ ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయాల వెనుకబాటు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం జరిగిన ఉద్యమాలు దూరమయ్యే కాలంలో కని్పంచిన దృశ్యాలు. బాసర ట్రిపుల్‌ ఐటీలో వెంటవెంట జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థిలోకాన్ని కలవరపెట్టాయి. టెన్త్‌ పరీక్షల సరళీకరణ, ఇంటర్‌ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం 2023లో కనిపించిన కొత్తదనం.

ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలిలో కుదుపులకు గతించే కాలమే సాక్షీభూతమైంది. మండలి చైర్మన్, వైస్‌చైర్మన్‌ తొలగింపుతో కార్యకలాపాలే మందగించిపోవడం ఈ ఏడాదిలో ఊహించని పరిణామమే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యార్థులు పోటెత్తడం ఈ సంవత్సరంలో కనిపించిన విశేషం. కరోనా కాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జేఈఈ మెయిన్‌ కాస్తా గాడిలో పడింది.  

రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి
♦ 2022–23 సీజన్లో వరి ఉత్పత్తి 
♦ 2.58 కోట్ల టన్నులు రికార్డులు బద్దలు కొట్టిన తెలంగాణ వ్యవసాయరంగం 

రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ధాన్యం 2.58 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. వానాకాలం సీజన్‌లో 1.38 కోట్ల టన్నులు, యాసంగిలో 1.20 కోట్ల టన్నులు ఉంది. ఈ మేరకు తుది నివేదికను ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉత్పాదకత ఎకరానికి 2,124 కిలోలు వచ్చింది. కాగా, ఈ యాసంగిలో 57.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పాదకత ఎకరానికి 2,091 కిలోలు వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో 1.22 కోట్ల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎకరానికి 2,108 కిలోల ఉత్పాదకత వచ్చింది.

ఆ మేరకు 2.58 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 15వ తేదీన విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది వరకు 11 విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం రూ. 72,815 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం 12వ విడత సొమ్మును కొత్త ప్రభుత్వం అందజేసే ప్రక్రియ చేపట్టింది. అందులో ఒక ఎకరాలోపు రైతులకు రైతుబంధు సొమ్ము అందజేస్తున్నారు. 

కాళేశ్వరం ‘కుదుపు’
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మసకబారిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రతిష్ట
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రతిష్టను కుంగదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బయటపడిన లోపాలు.. 2023 చివరి త్రైమాసికంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపివేశాయి. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పియర్లు గత అక్టోబర్‌ 21వ తేదీన కుంగిపోగా, కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని పియర్లు కుంగినట్టు ..నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.

7వ బ్లాక్‌ను పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సిఫారసు చేసింది. ఇతర బ్లాకులూ విఫలమైతే బ్యారేజీని పూర్తిగా పునర్నిర్మించక తప్పదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించడంతో భవిష్యత్‌లో వాటికి సైతం ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని ఎన్డీఎస్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది.

అన్నారం బ్యారేజీ పునాదుల (రాఫ్ట్‌) కింద నిర్మించిన కటాఫ్‌ వాల్స్‌కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీకి బుంగలు ఏర్పడినట్టు ఎన్డీఎస్‌ఏ బృందం మరో నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను సొంత ఖర్చులతో చేస్తామని గతంలో హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయం ఎవరు చేపట్టాలని అన్న అంశంపై ఎల్‌అండ్‌ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదు.  

మిల్లుల్లోనే రూ. 22 వేల కోట్ల విలువైన బియ్యం 
పేదలకు ఉచిత బియ్యం పంపిణీతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించే బృహత్తర బాధ్యత నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ 2023లో కొన్ని తప్పటడుగులు వేసింది. తద్వారా కార్పొరేషన్‌కు అప్పులు గుదిబండగా మారాయి. 2022 రబీ(యాసంగి)లో రైతుల నుంచి సేకరించిన సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి, సీఎంఆర్‌ కింద ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడంతో ఆ భారం సంస్థపై పడింది.

యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేయడం వల్ల బియ్యం విరిగి తమకు నష్టం వస్తుందని, అందుకే మిల్లింగ్‌ చేయలేమని రైస్‌మిల్లర్ల వాదనను అంగీకరించింది. మిల్లర్ల పట్ల ఉదారత చూపి, ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, ఎన్నికల సంఘం బ్రేక్‌ వేయడంతో మిల్లుల్లోనే 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటితో పాటు అంతకు ముందు లెక్క తేలని ధాన్యం కలిపి సుమారు రూ. 22వేల కోట్ల విలువైన 83 ఎల్‌ఎంటీ ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు మిల్లర్లు చూపారు.

కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఈ లెక్కలు తీసిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఏకంగా రూ.56వేల కోట్ల అప్పులు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా రూ. 11వేల కోట్లు సంస్థ నష్టపోయినట్లు తేల్చారు. మిల్లర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 2023లో ఆ సంస్థ ప్రజల్లో పలుచనైపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement