నెరవేరని ‘హ్యాట్రిక్‌’ కల | BRS could not come close to the magic figure | Sakshi
Sakshi News home page

నెరవేరని ‘హ్యాట్రిక్‌’ కల

Published Mon, Dec 4 2023 4:45 AM | Last Updated on Mon, Dec 4 2023 8:50 AM

BRS could not come close to the magic figure - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరుసగా మూడుమార్లు అధికారంలోకి వచ్చి ‘హ్యాట్రిక్‌’సాధించేందుకు భారత్‌ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డినా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. పార్టీ పేరు మార్పుతో ఓ వైపు జాతీయ రాజకీయాల్లో అరంగేట్రానికి బాటలు వేసుకుంటూనే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏడాది కాలంగా సన్నద్ధమైనా అధికారం పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని బీ ఫామ్‌ల జారీ, ఇతర పార్టీల నుంచి చేరికలు, ఎన్నికల ప్రచార సభలు తదితరాలు అన్నింటా విపక్ష పార్టీలతో పోలిస్తే ముందంజలో ఉన్నా.. అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌కు చేరువ కాలేకపోయింది.

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 104 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండటం, అందులో సంగం మందికి పైగా ఎమ్మెల్యేలు వరుసగా రెండు కంటే ఎక్కువ పర్యాయాలు గెలిచిన వారే ఉండటం ప్రతికూలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 35 మంది పార్టీ ఎమ్మెల్యేలపై క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రతికూలత నెలకొందని నిఘా వర్గాలు, వివిధ సంస్థలు నివేదికలు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాన్ని కలిగించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌ కార్పొరేటర్లను మార్చక పోవడం వల్ల నష్టం జరిగిందని తేలినా.. మళ్లీ ‘సిట్టింగులకే టికెట్లు’అంటూ పెద్దపీట వేయడం నష్టం చేకూర్చినట్లు ఫలితాల సరళి వెల్లడిస్తోందని అంటున్నారు. 13 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి కొత్త వారికి అవకాశమిచ్చిన చోట 9 మంది గెలుపొందడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, రుణ మాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితబంధు, బీసీబంధు పథకాలు వంటి అంశాలు, ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వ్యవహార శైలి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టడంలో కీలకంగా మారాయని అంటున్నారు.  

స్థానికంగా దృష్టి కేంద్రీకరించలేకపోయారా?
ఈ ఏడాది మార్చి నుంచే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించి తొలి విడతలో జిల్లా కలెక్టరేట్లు, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సభలు నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలతో కేడర్‌ను కార్యోన్ముఖుల్ని చేసే పనికి పూనుకున్నారు. జూన్‌లో దశాబ్ది ఉత్సవాల పేరిట సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేశారు. అందరికంటే ముందుగా ఆగస్టులోనే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి అంతర్గత అసమ్మతి సర్దుబాటుకు పూనుకున్నారు.

నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకమునుపే బీ ఫామ్‌లు జారీ చేశారు. ఇంత చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు టీఆర్‌ఎస్‌ పేరును ఏడాది క్రితం బీఆర్‌ఎస్‌గా మార్చడం, పార్టీ పేరులో తెలంగాణ పదం లేకపోవడంపై పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రపై దృష్టి కేంద్రీకరించే క్రమంలో స్థానికంగా పార్టీ, ప్రభుత్వంపై కేసీఆర్‌ అంతగా దృష్టి కేంద్రీకరించలేదనే అభిప్రాయం కూడా ఉంది.

అభ్యర్థుల ప్రకటనకు ముందూ, తర్వాత టికెట్‌ దక్కదని తేలడంతో పార్టీని వీడిన పొంగులేటి, తుమ్మల వంటి నేతలు తీరని నష్టం కలిగించారని అంటున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు ధీటుగా ప్రకటించిన మేనిఫెస్టోను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పాక్షిక ఫలితాన్నే ఇచ్చాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

‘తెలంగాణ మోడల్‌’కు మిశ్రమ స్పందన 
భారీగా ఓట్లు సాధిస్తుందని భావించిన ‘తెలంగాణ మోడల్‌’నినాదం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పొరుగునే ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీగా సీట్లను సాధించి పెట్టింది. అయితే ‘తెలంగాణ మోడల్‌’లో అంతర్భాగమైన సంక్షేమ పథకాలు ఓట్ల వర్షం కురిపిస్తాయనే లెక్కలు తారుమారై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మిశ్రమ, ఇతర జిల్లాల్లో అరకొర ఫలితాన్నే ఇచ్చాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాలకు ఐదు సీట్లు బీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి.

ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లోకేవలం రెండేసి స్థానాలకు మాత్రమే బీఆర్‌ఎస్‌ పరిమితమైంది. 2018 ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాన్ని అందించిన నల్లగొండలో సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో గద్వాల, ఆలంపూర్‌లో మాత్రమే గెలుపు సాధ్యమైంది. మొదట్నుంచీ పార్టీకి పూర్తి ప్రతికూలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటరు ప్రస్తుత ఎన్నికలోనూ అదే తీరును ప్రదర్శించడం గమనార్హం.  

కాంగ్రెస్‌కు హైదరాబాద్‌ నో 
ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు బీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచాయి. హైదరాబాద్‌లోని 15 స్థానాలకు గాను మిత్రపక్షాలైన బీఆర్‌ఎస్, ఎంఐఎం చెరో ఏడు స్థానాలు దక్కించుకున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లకు గాను పది స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రానికి ఓటర్లు ఏకపక్షంగా మద్దతు పలికారు.

పొరుగునే ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పది సీట్లకు గాను మంత్రి హరీశ్‌రావు సర్వశక్తులూ ఒడ్డటంతో సిద్దిపేట, గజ్వేల్‌ సహా ఏడు చోట్ల పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లోనూ బీఆర్‌ఎస్‌కు ప్రాతినిథ్యం దక్కగా, అధికార పగ్గాలు చేపడుతున్న కాంగ్రెస్‌కు హైదరాబాద్‌ జిల్లాలో ఒక్క సీటూ దక్కక పోవడం గమనార్హం. 

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాంహరీశ్‌రావు 
సాక్షి, హైదరాబాద్‌: ‘రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ పార్టీని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నిక సమరంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు’అని హరీశ్‌రావు ఆదివారం ట్వీట్‌ చేశారు.

‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విజేతలతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల కఠోర శ్రమకు కృతజ్ఞతలు. అధికారమున్నా లేకున్నా మనం తెలంగాణ ప్రజల సేవకులం. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పోరాడుదాం. కోరుట్ల ప్రజలకు ప్రత్యేకించి శుభాకాంక్షలు’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.  

హరీశ్‌రావుకు తగ్గిన మెజార్టీ 
2018లో 1,18,699.. ఈసారి 82,308 ఓట్లు 
ఎమ్మెల్యేగా 7వ సారి విజయం

సాక్షి, సిద్దిపేట: గత ఎన్నికల కంటే ఈసారి మాజీమంత్రి టి.హరీశ్‌రావుకు 36,391 మెజార్టీ తగ్గింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన హరీశ్‌రావుకు నవంబర్‌ 30న జరిగిన ఎన్నికల్లో 1,81,436 ఓట్లు పోలు కాగా, ఆయన 1,05,514 ఓట్లు సాధించారు. సమీపకాంగ్రెస్‌ అభ్యర్థి పూజల హరికృష్ణపై 82,308 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏడోసారి హరీశ్‌రావు విజయం సాధించారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి సైతం 20 మంది ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement