ఇవి కాంగ్రెస్‌ అనుకూల ఫలితాలు కావు  | Union Minister Amit Shah at the BJP state conference | Sakshi
Sakshi News home page

ఇవి కాంగ్రెస్‌ అనుకూల ఫలితాలు కావు 

Published Fri, Dec 29 2023 4:25 AM | Last Updated on Fri, Dec 29 2023 3:26 PM

Union Minister Amit Shah at the BJP state conference - Sakshi

సాక్షి, హైదరాబాద్, ఇబ్రహీంపట్నం రూరల్‌: ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చినవి కావనీ, అవి కేవలం కేసీఆర్‌ సర్కార్, నాటి అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని బీజే పీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వేవ్‌ వంటిదేమీ పనిచేయలేదని, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక తీర్పుతో తెలంగాణ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందినట్టు అయ్యిందని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబపాలన, అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు ఇది అని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మాత్రమే కనిపించే వారని, అందుకే ప్రజలు తిప్పికొట్టి ఫాంహౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్‌ కంటే కాంగ్రెస్‌ ఏమీ తక్కువ కాదనీ, కాంగ్రెస్‌ దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే మునిగిన పడవ కాగా, కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ అని, ప్రసుతమున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు.

గురువారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అమిత్‌ షా మాట్లాడారు. రా్రష్ఠంలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీసీవర్గాల అభ్యున్నతికి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ బీసీ సీఎం నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్‌ షా చెప్పారు.  

మోదీకి పది ఎంపీ సీట్లు బహుమతిగా ఇవ్వండి 
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 10 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 35% ఓటింగ్‌ సాధించి పది ఎంపీ సీట్లు గెలిచేలా కృషి చేస్తామంటూ పార్టీ మండల అధ్యక్షులు ఆపై రాష్ట్రస్థాయి వరకు నాయకులందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిస్తే ఐదేళ్లలో 8 స్థానాలకు పెరిగామని, 8 స్థానాల నుంచి మళ్లీ వచ్చే అసెంబ్లీ నాటికి 95 స్థానాలకు బీజేపీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే వరకు వస్తూనే ఉంటా 
’’గురువారం నేను హైదరాబాద్‌కు వస్తున్నపుడు ఇద్దరు జర్నలిస్టులు మళ్లీ తెలంగాణకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా మళ్లీ మళ్లీ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువసార్లు వెళ్తాను’’అని వారికి సమాధానం ఇచ్చానని అమిత్‌ షా చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నాయకులు, కేడర్‌లో నిరాశ రావడం సహజమేనని, ఐతే బీజేపీ ఎన్నికల కోసమే పోరాడే పార్టీ కాదని, దేశం కోసం, భరతమాత కోసం పోరాడే పార్టీ అని స్పష్టం చేస్తున్నానని చెప్పారు.

’’1950నాటి నుంచి బీజేపీ ఎన్నో ఎన్నికల్లో పోటీచేసింది, అనేకసార్లు డిపాజిట్లు కూడా కోల్పోయింది, రెండుసీట్ల నుంచి 300కు పైగా సీట్లతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చరిత్రను సొంతం చేసుకుంది.. నాడు వచ్చిన ఫలితాలతో నిరాశ చెంది ఉంటే ఈ స్థాయి ఫలితాలు సాధించగలిగే వాళ్లమా’’అని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లోనూ 300కు పైగా సీట్లు సాధించి వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు.  

ఆ సంకల్పం తీసుకోండి 
’’గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు జరిగిన ఎన్నికల్లో 9% ఓట్లు సాధించింది.. ఆ తర్వాత మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారానికి వచ్చింది.. దాంతో పోలిస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్‌ వచ్చినందున, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడా మూడింట 2వంతుల మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి’’అని అమిత్‌షా పిలుపునిచ్చారు. 

పీఎంగా మోదీ.. రాహుల్‌..మీకు ఎవరు కావాలి? 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థులుగా మోదీ, రాహుల్‌గాంధీ ఉంటే ఎవరు ప్రధాని కావాలి అంటూ అమిత్‌ షా అడగ్గా.. మోదీ.. మోదీ అని శ్రేణులు బిగ్గరగా అరిచి మరీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోదీ గెలుపు చారిత్రక అవసరమని, ప్రజల్లోకి వెళ్లి మళ్లీ మోదీని గెలిపిద్దామని కోరుతూ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ బలపరుస్తూ మాట్లాడగా దానిని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపిస్తాంః కిషన్‌రెడ్డి 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే లోక్‌ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపిస్తామని చెప్పారు. కచ్చితంగా డబుల్‌ డిజిట్‌ సంఖ్యలో ఎంపీలను గె లుస్తామని చెప్పారు. జాతీయ ప్రధానకార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్‌ బన్సల్, బండి సంజయ్, జాతీ య ఉపాధ్యక్షురాలు పార్లమెంటరీ బో ర్టు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు అర్వింద్‌ ధర్మపురి, సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేతలు  పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. 

బీజేఎల్పీ నేత ఎన్నిక వాయిదా 
ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, పాయల్‌ శంకర్, రామారావు పాటిల్, జైపాల్‌రెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబును రాష్ట్ర నేతలు అమిత్‌ షాకు పరిచయం చేశారు. వారిని ఆయన అభినందించారు. ఐతే సమావేశానంతరం అమిత్‌షా సమక్షంలో సమావేశం నిర్వహించి బీజేఎల్పినేతను ఎన్నుకోవాల్సి ఉండగా సమయాభావం వల్ల జరగలేదు. మరోసారి వచ్చినప్పుడు నిర్ణయిద్దామని రాష్ట్ర పార్టీనేతలకు చెప్పిన అమిత్‌ షా గురువారం రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యరు. 

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా 
చార్మినార్‌/దూద్‌బౌలి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా గురువారం మధ్యాహ్నం చార్మినార్‌  భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జరిగిన సామూహిక పూజ హారతిలో ఆయన పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement