సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది కేసీఆర్‌కు వేసినట్టేనని, బీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించినట్టేనని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్‌ఎస్‌లో చేరారని, గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ జరిపిస్తామని, దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేవని, వాటికి కుటుంబ పాలనే సర్వస్వమని విమర్శించారు. బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఏర్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలతో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. శనివారం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జీ ప్రకాశ్ జవదేకర్, ఇతర నేతలతో కలసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు మినహా చేసిందేమీ లేదు. మిషన్ భగీరథ, పాస్‌పోర్ట్ స్కాం, మియాపూర్ భూముల అక్రమాల్లో వందల కోట్ల కుంభకోణం, ఔటర్‌రింగ్‌రోడ్డు టెండర్ల స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ మద్యం స్కాం, గ్రానైట్ కుంభకోణం.. ఇలా ఎన్నో రూపాల్లో అవినీతి జరిగింది. కాగ్ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్లు ఖర్చు చేసినా 65 శాతమే పనులు పూర్తయ్యాయి. దళితబంధు, డబుల్ బెడ్రూం స్కీంలలో దళితుల నుంచి కమీషన్లు దండుకున్న చరిత్ర బీఆర్‌ఎస్ నేతలది.
విచారణ చేసి జైలుకు పంపుతాం
బీఆర్‌ఎస్ సర్కార్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడగానే ఒక్కొక్కఅవినీతి ఆరోపణపై విచారణ జరిపి, దోషులుగా తేలిన ప్రతీ ఒక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాం. హైదరాబాద్‌లో రోహింగ్యాల చొరబాటు, ఇక్కడ ఆశ్రయం పొంది ఓటర్ కార్డులు పొందడంపై ఎన్‌ఐఏ విచారణ సాగుతోంది.
దీనిపై కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసింది. పదిరోజుల క్రితమే కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ అవినీతి సొమ్ముతో ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రలోభాల కోసం కర్ణాటక నుంచి, ఇతర రూపాల్లో వస్తున్న అక్రమ డబ్బు విషయంలో ఏజెన్సీలు, ఈసీ తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
కేసీఆర్‌ను మార్చాలంటూ కాంగ్రెస్‌కు ఓటేస్తే..
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ తెలంగాణ విరోధిగా నిలిచింది. సుదీర్ఘ పాలనలో తెలంగాణను అణచివేసింది. ఉమ్మడి ఏపీలో నాటి సీఎం టి.అంజయ్యను తీవ్రంగా అవమానించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించిన తీరు తెలంగాణ ప్రజల మనస్సులో నాటుకుపోయింది. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కితగ్గి దాదాపు 1,500 మంది ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కారణమైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
కానీ కాంగ్రెస్‌కు ఓటు వేసినా, ఒవైసీలకు ఓటు వేసినా బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు పడ్డట్టే. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అవినీతి తప్ప మరేమీ చేయలేదు. గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు తీరాలంటే బీజేపీని గెలిపించాలి.
ప్రస్తుత పథకాలేవీ ఆపబోం..
తెలంగాణతోపాటు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన ఇక్కడి ఓటర్లు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి అండగా నిలుస్తారని, డబుల్ ఇంజిన్ సర్కార్‌ను తీసుకొస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై బీసీ నేతను సీఎంను ఎన్నుకుంటారు.
ప్రస్తుతం అమలవుతున్న పథకాలేవీ మేం ఆపబోం. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే తొలి కేబినెట్ భేటీలోనే పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటాం. బీఆర్‌ఎస్ సర్కార్ ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాటిని సర్దుబాటు చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి..’’అని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment