Bharat Rashtra Samithi
-
మనమెక్కడో తెలుసుకుందాం..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకునేందుకు భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతలు సొంత సర్వేల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో తమ తమ నియోజక వర్గాల్లో పరిస్థితిని, ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. పనితీరు మెరుగ్గా ఉండి గెలుపు అవకాశాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ దక్కుతుందని పార్టీ అధి నేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలు ‘థర్డ్ పార్టీ’ సర్వేలు చేయించుకుంటున్నారు. తమ పనితీరు, అదే సమయంలో ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈసారి గట్టిగా టికెట్ ఆశిస్తు న్న బీఆర్ఎస్ నేతలు కూడా సర్వేలపై ఆసక్తి చూపిస్తున్నారు. పథకాలు, పనితీరు ప్రభావంపై అంచనా ప్రభుత్వ పథకాలతో పాటు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఇతర పనులు ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందో ఓ అంచనాకు వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, కింది స్థాయిలో కేడర్ పనితీరు తమ గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకుల పనితీరు పైనా, తమతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారేమైనా దుర్వినియోగం చేశారా అనే కోణంలోనూ సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలతో పాటు వివిధ మార్గాల్లో ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. కేవలం పైపైన సమాచారంతో సరిపుచ్చుకోకుండా లోతుగా విశ్లేషించాలని కన్సల్టెన్సీలను కోరుతున్నారు. ఒక్కో మండలాన్ని మూడు నాలుగు క్లస్టర్లుగా విభజించి ఇన్ఫ్లూయెన్సర్స్ (ప్రభావశీలురు) నుంచి వివరాలు సేకరించేలా చేస్తున్నారు. ఇన్ఫ్లూయెన్సర్స్ కేటగిరీలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, ఉద్యోగులు, ఆర్ఎంపీలు, ఎల్ఐసీ ఏజెంట్లు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు తదితరులను చేర్చి కన్సల్టెన్సీలు శాంపిళ్లు సేకరిస్తున్నాయి. ఎన్నికల మేనేజ్మెంట్ సంస్థలకు ఫుల్ గిరాకీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే సంస్థలకున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని పలు కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి. సర్వేలతో పాటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ప్రచారం, ఇతర కార్యకలాపాల కోసం ఎమ్మెల్యేలు సొంతంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఎన్నికల మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్, ప్రచార వ్యూహాల రూపకల్పన, పర్సెప్షన్ మేనేజ్మెంట్ (ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు) తదితర సరికొత్త అంశాలతో ఈ కన్సల్టెన్సీలు రాజకీయ నేతలను ఆకర్షిస్తున్నాయి. ఈ కన్సల్టెన్సీల ద్వారా నియోజకవర్గాల్లో జరిగే కార్యకలాపాలను నేతల కుటుంబ సభ్యులు, సన్నిహితులు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి అందే సమాచారం కంటే ఈ థర్డ్ పార్టీ సంస్థల నుంచి అందే నివేదికలు శాస్త్రీయంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీ సర్వే నివేదికలపై ఎమ్మెల్యేల ఆసక్తి గతంలో బీఆర్ఎస్కు రాజకీయ వ్యూహాలు, సర్వే సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ దూరమైన తర్వాత ఇతర సంస్థలు తెరమీదకు వచ్చాయి. డిజిటల్ మీడియా వింగ్‌కు చెందిన ఓ నిపుణుడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ సర్వే సంస్థ ప్రస్తుతం బీఆర్ఎస్కు ఎన్నికల కోణంలో విస్తృత సేవలు అందిస్తోంది. ‘కె2 కన్సల్టెన్సీ’గా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న ఈ సంస్థ విపక్ష పార్టీల కన్సల్టెన్సీల కంటే చాలా ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే నేతృత్వంలోని సంస్థ కూడా సర్వేలు చేసి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కన్సల్టెన్సీల నివేదికలతో పాటు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి తమపై వెళ్తున్న నివేదికల వివరాలు తెలుసుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారు. -
నేలను విడిచే అభివృద్ధా?
భూమి రేట్లు పెరగడం తాము చేసిన ‘అభివృద్ధి’కి మచ్చుతునకగా రాజకీయ నాయకులు ప్రచారం చేసుకోవడం శోచనీయం. రాజకీయ అధికారం బడుగులకు ఉండాలనే నినాదంతో వచ్చిన తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి నాయకులు దీన్ని వల్లె వేయడం ఇంకా ఘోరం. భూమి వ్యాపార వస్తువు అయితే, దాని ధరలు కోట్లకు చేరితే, సామాజిక అన్యాయం పెరుగుతుందనే స్పృహ ఈ నాయకులకు లేకపోవడం గర్హనీయం. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాల వల్ల భూమి క్రమంగా కొందరి పాలు అవుతున్నది. ఈ కొందరు దానిని తమ పెట్టుబడులు పెంచే ఆర్థిక సాధనంగా పరిగణిస్తున్నారు. చుట్టూ కంచె వేసి పడావు పెడుతున్నారు. ఇది ఆహార భద్రతకు ముప్పు! భూమిని చాలా సాధారణంగా చూడడం అలవాటు అయింది. అసలు భూమి ఒక సహజ వనరు అని గుర్తించేవారు, గుర్తు పెట్టుకునేవారు అరుదు. భూమి, నేల, మట్టి, మన్ను వంటివి పర్యాయ పదాలుగా వాడతారు. కానీ, భూమి మనకు అందించే సేవలు ఆ పదాలలో ఇమిడి ఉన్నాయి. సమస్త పచ్చదనం, నీళ్ళు, అనేక రకాల జీవరాశులకు ఈ భూమి ఆలవాలం. భూమి పైన, లోపట, అంతటా ఉండే సంపద అపారం. సహజ భూవినియోగాన్ని మానవులు టెక్నాలజీ దన్నుతో అసహజ రీతిలో మార్చుతున్నారు. దానికి ‘అభివృద్ధి’ అని పేరు పెడుతున్నారు. ప్రాణ వాయువు నిరంతరం అందాలంటే చెట్లు, చేమ ఉండాలి. నీళ్ళు ఉండాలి. అవన్నీ ఉండాలంటే నేల కావాలి. ఈ పరస్పర ఆధారిత ప్రకృతి రుతుచక్రాలను మరిచిపోతున్నాము. తెలంగాణాలో భూమి ఆధారంగా అనేక వృత్తులు, జీవనో పాధులు ఉండేవి. గ్రామాలలో ఆహార ఉత్పత్తికి, స్వయంసమృద్ధికి భూమి అవసరం. పేదరికంలో, ఆకలితో ఉండడానికి భూమి లేకపోవ డమే కారణమని గుర్తించి పేదలకు భూమి పంచడం ఒక రాజకీయ, ఆర్థిక, పాలనాంశంగా మారింది. అయితే, గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాల నేపథ్యంలో భూమి క్రమంగా కొందరి పాలు అవుతున్నది. ఈ కొందరు దానిని తమ పెట్టుబడులు పెంచే ఆర్థిక సాధనంగా పరిగణిస్తున్నారు. చుట్టూ కంచె వేసి పడావు పెడు తున్నారు. ఇది ఆహార భద్రతకు ముప్పు. పైగా లక్షలాది కుటుంబాల జీవన సాధనం హరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎకరా ధర కోట్లలో ఉంటే పెట్టుబడి కొంత ఇక్కడకు మరలవచ్చుగాక, కానీ ధరలు శిఖరానికి చేరిన తరువాత ఆ భూమిలో ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. రియల్ ఎస్టేట్ ధరలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అది దాటితే పెట్టుబడి మురిగిపోతుంది. ఆ ఆర్థిక పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. పేదలకు వ్యవసాయానికీ, ఆహారానికీ, ఇండ్లకూ భూమి దొరకదు. భూమి ఉన్నవాడు దాని నుంచి పెట్టుబడికి తగ్గ ‘లాభం’ వచ్చే వ్యాపారం లేక ఇబ్బంది పడతాడు. కోట్ల రూపాయల భూమిలో ఏ వ్యాపారం చేస్తే అన్ని కోట్లు తిరిగి వస్తాయి? అ వ్యాపారాలకు మార్కెట్లు ఉన్నాయా? అటువంటి భూమిలో అపార్ట్మెంట్లు, ఇండ్లు కడితే కొనగలిగే స్థోమత ఉన్నవాళ్ళు ఎంత మంది ఉంటారు? ఇండ్లు, వ్యాపార సముదాయాల మార్కెట్లు స్థానిక డిమాండ్ మేరకు ఉంటేనే ఉపయుక్తం. తెలంగాణా ప్రభుత్వం ఇటువంటి సమీక్ష చేయడం లేదు. చేసిన అప్పులు తీరాలంటే ప్రభుత్వ ఆదాయం పెరగాలి. అది రియల్ ఎస్టేట్ ద్వారా పెరుగుతుంది అని బలంగా నమ్మి భూ బదలాయింపు విధానాలు అమలు చేస్తున్నారు. తెలంగాణా అస్తిత్వ ఉద్యమాలకు అందరికీ భూమి అనేది బలమైన పునాది. కానీ అది తెలంగాణా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు బలి అవుతున్నది. ధరణి, పారిశ్రామిక విధానాలు, భూసేకరణ చట్టం 2017, మునిసిపల్ చట్టం, పంచాయతీ రాజ్ చట్టం, పట్టణాల అభివృద్ధికి అడుగులు, భవనాల నిర్మాణానికి అప్పులు, రైతు బంధు వగైరా తెలంగాణా ప్రభుత్వ చర్యలు భూమి యాజమాన్యం కొందరి దగ్గరే ఉండే విధంగా ఉంటున్నాయి. బడుగులకు ఉన్న భూమిని అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నది. ఏ ధరకు అమ్ముకున్నా ఆ కుటుంబం భూమి లేని కుటుంబంగా మిగులుతుంది. స్వతంత్ర జీవనోపాధి కోల్పోతుంది. భూమి అమ్మిన ధనం విద్యకు, సంతతి వికాసానికి ఉపయోగపడినా, ఉద్యోగం లేనిదే సుస్థిరం కాదు. అయితే మంచిదే. కాకుంటే, సమస్య ఇంకొక రూపం తీసుకుంటుంది. అటు ఉద్యోగం రాక, ఉపాధి లేక, భూమి కోల్పోయి రోడ్డు మీదకు వచ్చిన కుటుంబాల సంఖ్య తెలంగాణా ఏర్పడక ముందు కంటే తెలంగాణా వచ్చినాక ఇంకా పెరిగింది. పట్టణాలు, నివాసిత ప్రాంతాల విషయంలో ప్రణాళికబద్ధ అభి వృద్ధి పోయి దళారుల రాజ్యం వచ్చింది. స్థానిక పంచాయతీ ప్రతి నిధుల చేతి నుంచి నిర్ణయాధికారం అధికారుల వ్యవస్థకు మళ్ళింది. ఇది ఒక రకంగా పల్లెల మీద పట్టణం కొనసాగిస్తున్న సామ్రాజ్యవాదం. ఇదే మోడల్ తెలంగాణలో అన్ని పట్టణాల చుట్టూ అమలు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు తయారు చేయటం, పల్లెలను విలీనం చేయటం, భూమి వినియోగం మార్చటం, ఫీజులు వసూలు చేయటం, తద్వారా అవినీతి సామ్రాజ్యానికి ఇంధనం అందించటం! ఈ క్రమంలో వ్యవసాయ భూమి తగ్గిపోయినా, చెరువులు మాయ మయినా, గుట్టలు విధ్వంసం అయినా, చెట్లు నరికివేసినా ఏ చట్టానికీ పట్టదు. ఈ మోడల్ చేస్తున్న పర్యావరణ హననంలో అనేక జీవ రాశులు, జీవనోపాధులు సమిధలు అయినాయి. గ్రామీణ ఉపాధి తగ్గిపోవడానికి కారణం వ్యవసాయ భూమి వ్యవసాయేతర పనులకు మరలడమే. ఒకవేళ గొర్రెల పథకానికి అవినీతి లేకుండా నిధులు ఇచ్చినా వాటిని మేపే భూములు లేకుంటే ఫలితం రాదు. తెలంగాణా ప్రభుత్వం ‘అభివృద్ధి’ పనులకు... అంటే, కొత్త రోడ్లు, ఉన్న రోడ్ల విస్తరణ, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాల విస్తరణ, చెత్త కుప్పలు, శ్మశానాలకు భూమిని సేకరిస్తున్నది. ఇది ఎక్కువ శాతం వ్యవసాయ భూమి అని గమనించాలి. ఆ భూమి మీదనే ఆధారపడి బతికే కుటుంబాలకు భూమికి బదులుగా భూమిని ఇవ్వవచ్చు, లేదా మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చు. ఇవేమీ చేయ కుండా చట్టాలను, సహజ న్యాయ సూత్రాలను కాదని భూమిని బదలాయిస్తున్నది. ఆహారం పండించే భూమి వినియోగం మార్చితే భవిష్యత్తులో ఆహార కొరతకు కారణం అవుతుంది. పెద్ద రోడ్లు ఎత్తుగా కట్టడానికి టన్నుల కొద్దీ మట్టి, రాళ్ళను వాడుతున్నారు. ఈ ‘అవసరం’ కొరకు గుట్టలను పిండి చేశారు. లక్షలాది చెట్లను నరికివేశారు. పెద్ద రోడ్లు కడుతున్నది కార్లు వేగంగా పోవటానికి. వీటి వల్ల వ్యవసాయ భూమి పోతున్నది, వర్షం నీటిని ఒడిసిపట్టే చెట్లు, గుట్టలు పోతున్నాయి. భూమి వినియోగం మార్చితే నీటి కొరత వస్తుంది అనే స్పృహ అధికారులకు, నాయకులకు, ప్రజలకు కొరవడింది. నీళ్ళు వచ్చినా, విద్యుత్ ఉన్నా, చిన్న, సన్నకారు రైతులు భూములను ఎందుకు అమ్ముకోవాల్సి వస్తున్నది? వ్యవసాయం వారికి ఎందుకు లాభసాటిగా మారడం లేదు? ఈ ప్రశ్నలకు సమా ధానంగా సుపరిపాలన పథకాల రచన చేయాల్సి ఉండగా, కేవలం భూమి ధరలు పెంచి ఇదే ఆర్థిక అభివృద్ధి అని తెలంగాణా నాయ కులు గొప్పలకు పోతున్నారు. మట్టిలో తేమ కొన్ని వందల టీఎంసీల నీటికి సమానం. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభించేది. మట్టిని, నేలను, పచ్చదనాన్ని సంరక్షించే కార్య క్రమాల మీద పెట్టుబడి పెడితే రైతుల కమతాలలో నీరు దక్కేది. ఆహార పంటలకు అనువైన పర్యావరణంతో పాటు అప్పులు, వడ్డీల భారం ఉండేది కాదు. సుస్థిర ఫలితాలు వచ్చేవి. దీనికి వ్యతిరేక దిశలో అడుగులు వేసి తెలంగాణ ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగించడంతో పాటు ఆర్థిక, సామాజిక వ్యవస్థలను కుదిపింది. ‘ఎంత ఖర్చు అయినా వెనుకాడం’ వంటి ప్రకటనల పర్యవసానంగా భూమితో కూడిన ఉత్పత్తి సంబంధాలు మారుతున్నాయి. భూమికి నీళ్ళు లక్ష్యంతో మొదలయ్యి, నీళ్ళ కొరకు భూమి అమ్మడం వ్యూహా త్మక తప్పిదం! పర్యావరణ హిత జీవనం మీద, సుస్థిర అభివృద్ధి మీద రాజకీయ, ఆర్థిక, సామాజిక వేత్తలు అత్యవసరంగా దృష్టి పెట్టకపోతే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వచ్చే ఉత్పాతాల నుంచి వెనుదిరిగే సమయం కూడా ఉండదు. దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు ‘ 90102 05742 -
బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని అన్నివిధాలా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేలా వ్యూహానికి పదును పెట్టాలని భారత్ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ, సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపణలు, జర్నలిస్టు రాజ్‌దీప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం కనుసన్నల్లో రాష్ట్ర బీజేపీ రాజకీయంగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశముందని బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ‘పశ్చి మ బెంగాల్ ఎన్నికల తరహా పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ పద్ధతిలో కేవలం ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలతో, సాధారణ కార్యక్రమాలతో అడ్డుకట్ట వేయలేమని పార్టీ భావిస్తోంది. బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టే అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతిదాడి చేసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఆతీ్మయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ తలమునకలై ఉంది. తాజాగా ఈ సమావేశాలనే వేదికగా చేసుకుని.. రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలకు పాల్పడే అవకాశముందనే అంశంపై శ్రేణులకు విడమరిచి చెప్పాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలను ఆదేశించింది. ‘స్లీపర్ సెల్స్’పై నిఘా బీజేపీతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడం, కేంద్ర నాయకత్వం వ్యూహాలను అమలు చేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వైనంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలిసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం లాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని నిఘా వర్గాలు నివేదించినట్లు సమాచారం. మరోవైపు సుమారు ఏడాది కాలంగా బీజేపీ అనుబంధ సంఘాలకు చెందిన ఇతర రాష్ట్రాల నేతలు, కేడర్.. తెలంగాణలో ‘స్లీపర్ సెల్స్’లా పనిచేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2020 చివరలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని ఎంపిక చేసిన డివిజన్లలో ఈ స్లీపర్ సెల్స్ పనిచేశాయని బీఆర్ఎస్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ బలాలు, బలహీనతలను సూక్ష్మస్థాయిలో పోస్ట్‌మార్టం చేస్తున్న ఈ స్లీపర్ సెల్స్ వాటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్లీపర్ సెల్స్ నుంచి అందుతున్న ఆదేశాల మేరకే పేపర్ లీకేజీ వంటి కుట్రల్లో ఆ పార్టీ కేడర్ పాలుపంచుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టాలని, బీజేపీ కుట్రలు, వ్యూహాలు సమర్ధంగా తిప్పికొట్టా లని అధికార పార్టీ నిర్ణయించింది. మంత్రులకే నాయకత్వం బీజేపీ నేతల వ్యూహాలు, కుట్రలను తిప్పికొట్టేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై ఎదురుదాడి బాధ్యతను మంత్రులకు అప్పగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీపై విమర్శలు, ఎదురుదాడి విషయంలో కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష కార్యాచరణలో భాగం కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలందరినీ పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రధాన నిందితుడుగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని మంత్రులందరూ ఏకకాలంలో మీడియా ద్వారా ఎదురుదాడి చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన బండి దిష్టిబొమ్మ దహనం, నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్.. మాస్టర్ ప్లాన్‌తో కేసీఆర్
సాక్షి ప్రత్యేకం: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీ ఆవిర్భావం అయితే జరిగింది. మరి మిగతా రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఎప్పుడు?. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం మొదలయ్యేది ఎప్పుడు? ఆ ప్రశ్నలకు ఓ సమాధానం ఇప్పుడు దొరికింది. డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే అధినేత కేసీఆర్ కార్యక్రమాలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ను అధికారికంగా ప్రకటించి వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు. వీలయినంత త్వరలో ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. ఢిల్లీలో జాతీయ కార్యాలయ ప్రారంభం.. దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి : కేసీఆర్ డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతున్నదనే నేపథ్యంలో.. ఆ లోపే బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించి, ఢిల్లీలో వేదికను సిద్దం చేయాలనే తలంపుతో వున్న అతికొద్ది సమయంలోనే ఢిల్లీ టూర్ ను అధినేత కెసిఆర్ చేపట్టారు. అటు ఉత్తరాదినుంచి ఇటు దక్షిణాది నుంచి అఖిలేష్ యాదవ్., కుమార స్వామి వంటి మాజీ సిఎం లు, ప్రముఖ పార్టీల అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశ రాజకీయ విమర్శకులు మేథావులు ఆశ్చర్యపోయేలా అత్యద్భుతంగా బిఆర్ఎస్ కార్యాలయాన్ని డిసెంబర్ 14 న అధినేత కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలనుంచి ఢిల్లీ కి చేరుకున్న సీనియర్ రాజకీయ నాయకులు, రచయితలు, మేథావులు, ప్రముఖులు వందలాదిగా బిఆర్ఎస్ అధినేతకు స్వయంగా కలిసి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకుని పనిచేయడానికి తమ సంసిద్దతను వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలనుంచి ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు పలు సామాజిక వర్గాల సంఘాల నేతలు, పలు రంగాలకు చెందిన వృత్తులకు చెందిన మేధావులు, యువతీ యువకులు బిఆర్ఎస్ లో చేరి అధినేత కేసీఆర్ వెంట కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్న వర్తమాన పరిస్తితి దేశవ్యాప్తంగా నెలకొన్నది. పలు రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి ( బీఆర్కేఎస్) ప్రారంభం : ‘‘ఎద్దు ఏడ్సిన యవుసం.. రైతు ఏడ్సిన రాజ్యం ముందట పడదు’’ అనే నానుడి వ్యవసాయాధారిత దేశంలోని ప్రజల నాలుకల మీద వుంటుంది. అటువంటి అత్యంత ప్రాముఖ్యతనివ్వాల్సిన వ్యవసాయం సాగునీటి రంగాన్ని దశాబ్దాలుగా దేశ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనను అధినేత కెసిఆర్ పలు మార్లు ప్రకటించారు. ఈ తాత్వికతతోనే తెలంగాణ సాధన అనంతరం తక్షణమే వ్యవసాయం సాగునీటి రంగానికి పెద్ద పీట వేశారు. అనతికాలంలోనే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారడంలో సిఎం కెసిఆర్ దార్శనికత అకుంఠిత ధీక్ష ప్రధాన కారణం. నేడు రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులను ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయం సాగునీటి రంగాన్ని కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పటిష్ట పరిచి అన్నం పెట్టే దేశ రైతన్నను కాపాడుకోవాలనే దీర్ఘకాలిక ధ్యేయంతో మహోన్నత ధ్యేయంతో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ స్పూర్తితో ముందడుగు వేసిండు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ ఈ నేపథ్యంలో ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం నాడు హైద్రాబాద్‌లో ప్రకటించిన అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అటు ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారు. చర్చల అనంతరం ఏర్పాట్లు చేసుకోవడానికి తిరిగి వారి వారి రాష్ట్రాలకు వెలుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్క్రతిక పరిస్తితులు నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాల్నో వారికి సుధీర్ఘంగా అధినేత కేసీఆర్ వివరించి వారిని ఆ దిశగా సమాయత్తం చేసి పంపుతున్నారు. ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి : ఈ నేపథ్యంలో ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠా,వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ దేశంలో.. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అందుకోవాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటి.? వాటిని బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దేశ ప్రజలకు అందించబోతున్నది..ప్రత్యామ్న్యాయ రాజకీయ వేదికగా బిఆర్ఎస్ తన పాత్రను భవిష్యత్తులో ఎట్లా పోశించబోతున్నది ? ఈ దేశ సకల జనులకు సబ్బండ వర్గాల ఆకాంక్షలకు చిరునామాగా బిఆర్ఎస్ ఎట్లా నిలవబోతున్నది ? అనే తాత్విక సైద్దాంతిక అంశాలను పలు భాషా సాహిత్యాలు రచనలు పాటల ద్వారా భావజాల ప్రచారం జరగనున్నది. ఆయా రంగాల వారిగా సాహిత్య సాంస్కృతిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా భావజాల వ్యాప్తి చేయడానికి అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు నెలలనుంచి సాహితీ వేత్తలతో లోతైన విశ్లేషణలు చర్చలు చేపట్టారు. త్వరలో అవి కార్యరూపం దాల్చడానికి రంగం సిద్దమైంది. ఊపందుకోనున్న బీఆర్ఎస్ కార్యాచరణ క్రిస్మస్ పండుగ తర్వాత నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల ఉదృతి పెరగనున్నది. ఈ మేరకు ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కే కార్యకలాపాలను ప్రారంభం కానున్నాయి. తద్వారా బిఆర్ఎస్ జాతీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తూ., దేశ ప్రజలను ఆకర్షిస్తూ చారిత్రక దశలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నది. డిసెంబర్ నెలాఖరున ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశం : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయ మీడియా లో ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. దేశంలో గుణాత్మక రాజకీయాలు వాటితో పాటు కేంద్రంలో గుణాత్మక పాలన రావాలంటే ఏ దిశగా అడుగులు వేయాలో, ఈ దేశ ప్రజల కర్తవ్యం ఏమిటో ఇప్పటికే బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ పలుమార్లు ఉద్ఘాటించారు. ‘‘గెలవాల్సింది రాజకీయ నాయకులు పార్టీలు కాదు.. ప్రజలు.. ప్రజా ప్రతినిధులు’’ అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ దేశానికి ప్రత్యామ్న్యాయం అంటే.. కొన్ని పార్టీలతో జతకట్టే రాజకీయ ఫ్రంటులు కాదనీ.. దేశ ప్రజలకు మేలు చేసే ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోయే రాజనీతిజ్జత కావాలని సిఎం కేసీఆర్ ప్రకటించిన నేఫథ్యంలో బిఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ పై జాతీయ మీడియాలో ఉత్కంఠ నెలకొంది. బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఏమిటి ? రాజకీయ సైద్దాంతికత ఏమిటి .? అభివృద్ధి నమూనా ఏమిటి అనే విషయంలో ఇప్పటికే జాతీయ మేధావి వర్గం చర్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘అంధకారబంధురంగా మారిన వర్తమాన రాజకీయ పాలన యవనికమీద వెలుగు దివ్వెను వెలిగిస్తాం..’’..అనే అధినేత సిఎం కెసిఆర్ ప్రకటన దేశవ్యాప్తంగా అటుమీడియా ఇటు రాజకీయ విమర్శకుల లాబీల్లో చర్చనీయాంశంగా మారిన సందర్బంలో...ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. డిసెంబర్ నెలాఖరు లో ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా విధి విధానాలను ప్రకటించనున్నారు. -
‘బీఆర్ఎస్’ వాట్ నెక్ట్స్?.. సీఎం కేసీఆర్ ప్లాన్ ఏంటి?
తెలుగు నేల నుంచి ఓ పార్టీ జాతీయ స్థాయికి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అంతకుముందే తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. దీనికి ఎన్నికల సంఘం కూడా క్లియరెన్స్ ఇచ్చింది. దేశ రాజధానిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సార్.. కార్.. నజర్ దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో భారతీయ రాష్ట్ర సమితి పతాకాన్ని ఆవిష్కరించి.. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రాధాన్యతను వివరించే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రకటనలకు పరిమితం కాకుండా.. ఈ విషయంలో విభిన్నంగా ముందుకు సాగాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. తన ఆలోచనలకు తగినట్లుగానే జాతీయ పార్టీలతో, సంస్థలతో గతంలో పనిచేసిన వ్యక్తులతో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నాచితక పార్టీల నాయకులతో కూడా కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ముందుగా జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. కార్ టీంలో ఎవరెవరు? బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. ప్రాథమికంగా 15 నుంచి 25 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. పార్టీ సీనియర్ నేత కేశవరావుకు ఈ కమిటీలో అవకాశం కల్పించనున్నారు. లోక్‌సభ ఎంపీల్లో ఒకరిద్దరికి, రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి ఈ కమిటీలో అవకాశం ఉంటుందని తెలిసింది. అదే సమయంలో కొందరు కొత్తవారికి, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నవారికి కూడా ఈ కమిటీలో స్థానం కల్పించనున్నారు. ప్రస్తుతం సైలెంట్.. జాతీయ స్థాయిలో పొత్తుల అంశానికి సంబంధించి ప్రస్తుతం సైలెంట్‌గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొందరపడి ఏ పార్టీతోనూ పొత్తులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపకూడదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. కేసీఆర్‌తో పూర్తిస్థాయిలో కలిసి పని చేయడానికి జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటికే ముందుకు వచ్చారు. వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని జేడీఎస్, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే కర్ణాటకలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. మరోవైపు దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే రాష్ట్రాలపైనే కేసీఆర్ ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏడాది కాలంలోనే వస్తున్నందున మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాజకీయాలకే ఉంటుందని దశలవారీగా జాతీయస్థాయిలో పర్యటించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Telidevara Bhanumurthy: మందల బడి మురుస్తాంది గొర్రె
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడు ఉంటు న్నడు. పొద్దుబోకుంటె టివిల ఫుట్‌బాల్ మ్యాచ్ జూస్కుంట గూసున్నడు. ఇంటి ముంగట మోటరాపి విక్రమార్కుడు హారన్ గొట్టిండు. టివి బంద్ జేసి బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. ‘‘ఇగమున్నా, సిగలేటు ముట్టిచ్చెతంద్కు ఇంగలం దొరకకున్నా, ఆనగొట్టి తొవ్వలు చెర్ల తీర్గ అయినా మోటర్ దీస్కోని వొస్తవు. గుంతలు, ఎత్తు గడ్డలని సూడ కుంట మోటర్ నడ్పుతవు. ఎవడన్న సైడియ్యకుంటె నీకు కోపం రావొచ్చు. నీ యాస్టనంత యాది మర్సెతందుకు బీఆర్ఎస్ కత జెప్త ఇను’’ అని అన్నడు బేతాలుడు. ‘‘చెప్పుడు నీ పనైతె ఇనుడు నా పనే గదా’’ అని విక్రమార్కుడు అన్నడు. ‘‘కతంత అయినంక నేనడ్గేటి సవాల్‌కు జవాబ్ జెప్పుడు గుడ్క నీ పనే. బొంతు పుర్గు సీతాకోక చిల్క అయిన తీర్గ టీఆర్ఎస్ పార్టి బీఆర్ఎస్ అయ్యింది. టీఆర్ఎస్ జెండల తెలంగాన నక్ష ఉన్నది గని బీఆర్ఎస్ జెండల బారతదేసం జెండ ఉన్నది. బీఆర్ఎస్ అంటె బరండి, రమ్ము, స్కాచ్ అని కొందరనబట్టిండ్రు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యింది; బీఆర్ఎస్ వీఆర్ఎస్ అయితదని రేవంత్ రెడ్డి అసువంటోల్లు అనబట్టిండ్రు.’’ ‘‘ఇంతకు బీఆర్ఎస్ అంటె ఏంది?’’ ‘‘భారత రాష్ట్ర సమితి. ముందుగాల రాస్ట్రం సంగతి జూస్కోవాలె. అటెంకల దేసంను బాగ జేస్త ననాలె. గట్ల గాకుంట కేసీఆర్ ఇల్లు మించిన పందిరేస్తున్నడు. ఎంటిక పోసతోని గుట్టను గుంజాలని సూస్తున్నడు.’’ ‘‘తెలంగాన గురించి కేసీఆర్ ఎన్నిటినో జేస్తె గిట్లంటవేంది?’’ ‘‘శాన జేసిండు. మాటల్తోని కోటలు గట్టిండు. రొండేండ్ల కిందట వాసాల మర్రి ఊరును దత్తు దీస్కుండు. యాడాదిల గా ఊరును బంగారి మర్రి జేస్తనన్నడు. రొండు నూర్ల గజాల వొంతున అందర్కి ఇండ్లు గట్టిపిచ్చి ఇస్తనన్నడు. శ్రమదానం కమిటి, హరిత హారం కమిటి అసువంటి కమిటిలు ఏసిండు. మొగులు మీది సర్గంను కిందికి దించుతనని ఒక్క తీర్గ జెప్పిండు. తొవ్వ ఏసెతంద్కు అడ్డమున్నయని శానమంది ఇండ్లను కూలగొట్టిండ్రు. అంగన్వాడి, బడి, పంచాయతి ఆపిస్, చెర్వులను బాగ జేసెతందుకు 150 కోట్లు కర్సయితదని అప్సర్లు సర్కార్‌కు జెప్పిండ్రు. గని ఇదువర దాంక సర్కార్ ఒక్క రూపాయి గుడ్క మంజూరు జెయ్యలేదు. గిప్పుడు వాసాల మర్రిల వాసాలే మిగిలినయి. కొత్త ఇండ్లేమొగని ఉన్న ఇండ్లు బోయినయి’’ అని బేతాలుడు అన్నడు. ‘‘ఇంతకు కేసీఆర్, బీఆర్ఎస్ జెండను యాడ ఎగిరేసిండు?’’ ‘‘డిల్లిల సర్దార్ పటేల్ మార్గ్‌ల ఒక బంగ్లను కిరాయికి దీస్కుండు. తీస్కునే ముంగట గది వాస్తు ప్రకారం మంచి గున్నదా లేదా అని అర్సుకుండు. పెండ్లాం, పిల్లలను దీస్కోని డిల్లికి బోయిండు. అయ్యగార్లు బెట్టిన మంచి మూర్తంల నవ చండీయాగం జేసిండు. యాగ మైనంక ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని వొచ్చి నోల్లందరు వొర్లుతుండంగ బీఆర్ఎస్ జెండ ఎక్కిచ్చిండు. మంగలార్తి దీస్కోని పార్టి అపిస్లకు బోయిండు.’’ ‘మోదీ జైశ్రీరాం అంటడు. జైశ్రీరాం గాదు జైసియా రాం అనాలని రాహుల్ గాందీ అంటున్నడు. రాంరాం అన్కుంట సీతా మాతను ఇడ్సిపెడ్తె ఎట్లని అడుగు తున్నడు. మన దేసమే గాకుంట దునియంత మంచి గుండెతందుకే రాజ శ్యామల యాగం జేసిననని కేసీఆర్ అంటున్నడు. గీల్లు గిట్లెందుకు జేస్తున్నరు’’ అని విక్ర మార్కుడు అడిగిండు. ‘‘లీడర్లందరు మతం పేరు మీద మాయలు జేస్తుంటరు. గుళ్లు గట్టిస్తరు. దీపాలు ముట్టిస్తరు. జెనా లను గొర్లను జేస్తరు. జెనం గొల్రు గుడ్క లీడర్ల యెంబడి దిరుక్కుంట మురుస్తుంటయి. రేపొద్దుగాల ఏమైతయో మరుస్తుంటయి. దేసంల అన్నిటి కన్న ఎక్వ గొర్లున్న రాస్ట్రం తెలంగాన అని గీనడ్మ ఒక పేపర్ల రాసిండ్రు ఎందుకు? గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్ప కుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ముందుగాల నీ లెక్కనే నాకు అర్తం గాలేదు. జెర సోంచాయిస్తె అర్తమైంది. ఆడు అబద్దం రాయలేదు. ఉన్న నిజమే రాసిండని’’ విక్ర మార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంట్లకు బోయిండు. తోక:– ‘‘నేను ఇంటర్ల ఫస్ట్ కిలాస్ల పాసైన. గీ సదువుతోని నీకు కొల్వు యాడ దొరుక్తది. డిగ్రి మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జిలు ఏస్కోని బత్కాలె అని మా నాయిన అన్నడు. డిగ్రిల ఫస్ట్ కిలాస్ల పాసైన. కొల్వు దొర్కలే. బిటెక్ మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బండి బెట్టుకోని బత్కాలె అని మా కాక అన్నడు. బిటెక్ల మంచి మార్కులొచ్చినయి. కొల్వు దొర్కలే. ఎంబిఏ మంచిగ సదివితివా అంటె సర్కార్ కొల్వు దొరక్తది. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జీలు ఏస్కోని బత్కాలె అని మా మామ అన్నడు. ఎంబిఏ గుడ్క మంచి మార్కులతోని పాసైన. ఏం లాబం. కొల్వులు లెవ్వు. మిర్చి బజ్జీలేస్కోని బత్కు అని సర్కా రోల్లు జెప్పిండ్రు. ముప్పై రూపాయలకు నాలుగు మిర్చి బజ్జీలు. మీకెన్ని బజ్జీలు గావాలె.’’ (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
ఢిల్లీ: భారత రాష్ట్ర సమితికి ఆదిలోనే షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఫ్లెక్సీలను తొలగించింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయం ఎదుట అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్తూ.. అధికారులు మంగళవారం వాటిని తొలగించారు. ఎన్డీఎంసీ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై గులాబీ పార్టీ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం హస్తినకు చేరుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ యాగాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి నేటి నుండి భారత రాష్ట్ర సమితి
-
బీఆర్ఎస్ ప్రకటన కోర్టు ధిక్కరణే : రేవంత్ రెడ్డి
కంటోన్మెంట్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం.. కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం బోయిన్‌పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అవినీతి వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 12వ తేదీన విచారణ ఉందని ఈ లోపే దాని పేరుని బీఆర్ఎస్గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం సరి కాదన్నారు. ’’2017లో బంగారు కూలీల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాపారస్తుల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. దీనిపై నేను ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో. టీఆర్ఎస్ పార్టీ పై చర్యలు తీసుకోవాల్సిందిగా 2018లోనే హైకోర్టు ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలిచ్చింది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో తాజాగా డిసెంబర్ 6న మరోసారి ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాను. డిసెంబర్ 7న నోటీసు వెళ్లగా సోమవారం రోజు విచారణకు వచ్చే అవకాశముంది. ఇంతలోనే ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు మారుస్తూ లేఖ పంపడం దారుణం.’’అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్ఎస్కి సహకరించిందని ఆరోపించారు. నిజంగా బీజేపీ కేసీఆర్‌పై చర్య లు తీసుకోవాలని భావిస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదో జవాబు చెప్పా లని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో, తెలంగాణ రాష్ట్రంతో పేరు బంధం కూడా తెగిపోయిందన్నారు. కేసీఆర్ ఎన్నికల సంఘానికి పెట్టుకున్న దరఖాస్తులో కూడా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అని పేర్కొనడాన్ని ఆయన ఎత్తిచూపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని ఆయన ఆరోపించారు. ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు ఇటీవల మృతి చెందిన వందమంది కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున రాజీవ్ గాంధీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మ య్య, షబ్బీర్‌అలీ, ఏఐసీసీకార్యదర్శి నదీమ్ జావిద్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కవితకు ఓ న్యాయం.. కనిమొళికో న్యాయమా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పట్ల ఓ రకంగా.. మిగతా వారి పట్ల మరో రకంగా అధికారులు ప్రవరిస్తున్నారని రేవంత్ నిందించారు. తమిళనాడు మాజీ సీఎం కుమార్తె కనిమొళికి ఓ న్యాయం, కవితకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారిని ఢిల్లీలో విచారణకు పిలిచి, కవిత వివరణ మాత్రం ఆమె కోరుకున్న సమయానికి తీసుకుంటామనడం టీఆర్ఎస్, బీజేపీ పరస్పర సహకారానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీలు బీజేపీ ఏజెంట్లు దేశంలో బీజేపీ అధికారాన్ని పదిలంగా ఉంచేందుకు ఎంఐఎం, ఆప్, బీఆర్ఎస్ పనిచేస్తున్నా యని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముంబై భాషలో చెప్పాలంటే అసదుద్దీన్ ఒవైసీ, కేజ్రీవాల్, కేసీఆర్‌లు సుపారీ కిల్లర్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌లో మీడియా తో మాట్లాడారు. అంబానీ, అదానీల కోసం నల్లచట్టాలు చేసిన మోదీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ అనుకూలంగా ఓటు వేసిందని నిందించారు. కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని హామీనిచ్చారు. రైతులను పొట్టనబెట్టుకున్న రాక్షసుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్‌కు కాలం చెల్లడంతో బీఆర్ఎస్ అనే మారువేషంతో వస్తున్నారని ధ్వజమెత్తారు. -
కారు లేకుండానే.. బీఆర్ఎస్ అధికారికంగా లాంఛ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పుట్టుకొచ్చిన పార్టీ.. ఇరవై రెండేళ్లకు పేరు మార్చుకుంది. స్వరాష్ట్ర కల సాకారం.. రాష్ట్రాభివృద్ధి దరిమిలా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయ్యింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధికారిక ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ప్రత్యేక పూజలు, ఈసీ పంపిన పత్రాలపై సంతకం అనంతరం జెండా ఆవిష్కరించి భారత రాష్ట్ర సమితిని అధికారికంగా లాంఛ్ చేశారు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బీఆర్ఎస్ కండువాను ఆయన మెడలో కప్పుకున్నారు. జెండా రంగు గులాబీనే కాగా.. తెలంగాణ స్థానంలో మధ్యలో భారత దేశం మ్యాప్ వచ్చి చేరింది. అయితే కారు మాత్రం జెండాలో కనిపించకపోవడం గమనార్హం. తెలంగాణ భవన్ వద్ద భారీగా పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్, మరికొందరు ముఖ్యనేతలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పలువురు నేతలకు బీఆర్ఎస్ కండువాలను కప్పారు కేసీఆర్. ఇదీ చదవండి: బీఆర్ఎస్ పేరును నేనే మొదట కోరా! -
హస్తిన మార్గాన..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరో ప్రస్థానం దిశగా అడుగు వేసింది. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలనే వినతికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేయడంతో.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా ప్రస్థానం మొదలుపెట్టిన టీఆర్ఎస్.. శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్గా రూపుమారుతోంది. టీఆర్ఎస్తో స్వరాష్ట్ర సాధనకు పోరాడి రెండు పర్యాయాలు సీఎం పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. బీఆర్ఎస్తో ఢిల్లీస్థాయిలో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎంట్రీకి సంబంధించి సంకేతాలు ఇస్తూ వచ్చారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని, అందుకోసం ప్రయత్నిస్తామని ప్రకటనలు చేశారు. జలదృశ్యం వేదికగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సిద్దిపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు కేసీఆర్ ఏకకాలంలో రాజీనామా ప్రకటించారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారు. 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులకు పునాదులు వేసింది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికలో కేసీఆర్ తిరిగి విజయం సాధించడంతో టీఆర్ఎస్ ప్రస్థానానికి తొలి మైలు రాయి పడింది. అప్పటి నుంచి ఉద్యమ పార్టీగా వినూత్న వ్యూహాలతో ముందుకుసాగిన టీఆర్ఎస్.. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని, కరీంనగర్ సభలో నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తెలంగాణ ఏర్పాటు హామీ ఇప్పించింది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా జాతీయ స్థాయిలో 36 పార్టీలతో లేఖలు ఇప్పించారు. కొత్త సవాళ్ల మధ్య.. ఉద్యమ నేతగా కేసీఆర్ అనుసరించిన ఎత్తుగడలు, తీసుకున్న నిర్ణయాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరిట అనుసరించిన విధానాలు, ముఖ్యమంత్రిగా చేపట్టిన కొన్ని సంస్కరణలు పలు సందర్భాల్లో విమర్శలు, ప్రతి విమర్శలకు గురయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్కు కొత్త సవాళ్లు విసిరాయి. అయితే ఇవేవీ తమపై ప్రభావం చూపవనే రీతిలో కేసీఆర్ దూకుడుగా ముందుకెళుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ ప్రవేశానికి సంబంధించి గత రెండేళ్లలో వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు, జాతీయ స్థాయిలో పేరొందిన పార్టీలు, నేతలతో మంతనాలు జరిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతుందని కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5న నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు. డిసెంబర్ 9న లాంఛనంగా పేరుమార్పును అమల్లోకి తెస్తున్నారు. దీనితో రెండు దశాబ్దాల టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పేరిట మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. రాజీనామాలు, ఉప ఎన్నికల వ్యూహంతో.. రాజీనామాలు, ఉప ఎన్నికలను ఉద్యమ వ్యూహంగా మార్చుకున్న కేసీఆర్.. పలు సందర్భాల్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి భిన్నమైన ఫలితాలు చవిచూశారు. 2004లో కాంగ్రెస్ పొత్తుతో టీఆర్ఎస్ 54 సీట్లలో పోటీచేసి 26 చోట్ల గెలిచింది. 2006లో కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవడం టీఆర్ఎస్కు కొత్త ఊపిరి పోసింది. 2008లో పార్టీలో మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించగా.. ఉప ఎన్నికల్లో తిరిగి ఏడుగురు మాత్రమే గట్టెక్కారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టులతో మహా కూటమి పేరిట జట్టుకట్టినా కేవలం పది మంది మాత్రమే టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణంతో ఉమ్మడి ఏపీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని టీఆర్ఎస్ అనువుగా మలుచుకోగలిగింది. 2010 నుంచి 2012 వరకు పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా రాజీనామాలు, ఉప ఎన్నికలతో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమరణ దీక్ష.. ఎడతెగని పోరాటాలతో.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించింది. దీనితో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అదే ఏడాది డిసెంబర్ 23న ప్రకటించింది. దీనితో తెలంగాణ జేఏసీ ఏర్పాటు ద్వారా టీఆర్ఎస్ ఆందోళనను ఉధృతం చేసింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి ఆందోళనలతో ఊపును కొనసాగించింది. ఎడతెగని పోరాటాలతో కేంద్రం దిగొచ్చింది. 2014 ఫిబ్రవరిలో ఉమ్మడి ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అదే ఏడాది మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు గాను 63చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించగా.. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే గడువుకన్నా ఆరు నెలలు ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి 2018 డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు వెళ్లిన టీఆర్ఎస్కు 119 స్థానాలకు గాను 88 సీట్లు దక్కాయి. రెండోసారి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. -
బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దలు. ఆ దిశగానే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు పచ్చ జెండా ఊపేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో అభ్యర్థిని గెలిపించి ‘తెలంగాణ మోడల్’ను భారత దేశమంతా అమలు చేయమని ఆశీర్వదించారు. మేమంతా ఇప్పుడు ‘భారత్ రాష్ట్ర సమితి’ వెంటేనని తెలంగాణ మెజారిటీ ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి, సంక్షేమాలను వివరించాల్సిన అవశ్యకత ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని 64 ప్రత్యేక పథకాలు ఇక్కడే అమలవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, చేనేత బీమాలు తెలంగాణ సమాజంలో కేసీఆర్ మార్కును చూపిస్తున్నాయి. ఒక వైపు కాళే శ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్‌లతో రాష్ట్రంలో సాగు లోకి వచ్చిన భూ విస్తీర్ణం అమాంతం పెరిగిపోయి గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది. 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్, సర్కారే ధాన్యం కొనుగోలు చేయడం, గొర్రె పిల్లలు పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటివి కూడా గ్రామీణఆర్థిక వ్యవస్థను రోజురోజుకూ పటిష్టం చేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2018 ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న హామీల్లో మెజారిటీ నెరవేర్చటం, మిగిలినవి ప్రగతిలో ఉండటం విశేషం. అన్నింటి కంటే ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో విజయవంతమై రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతుండటం శుభ పరిణామం. ఇవి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డయాలసిస్, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతో నిరు పేదలు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడి నుంచి పూర్తిగా తప్పించుకున్నారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ నుండి కేంద్రానికి వివిధ రూపాల్లో రూ. 2.15 లక్షల కోట్ల రూపాయలను చెల్లిస్తే... కేంద్రం నుండి తెలంగాణ కు లక్ష కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఎక్కువ ఆదాయం పంపే రాష్ట్రాల్లో ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఇవ్వాల్సిన అసవరం ఉంది. ఇక దేశంలో సామాజిక పింఛన్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ఎంతో ముందున్నది. (క్లిక్: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో వెనకబడిన, అణచివేతకు గురవుతున్న ప్రాంతాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవశ్యకత నేడు ఎంతో ఉంది. సహజ సంపదలు ఎన్ని ఉన్నా... వాటిని వినియోగించు కోలేని స్థితి పలు రాష్ట్రాల్లో పక్కాగా కనిపిస్తున్నది. స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్లకు సాకారమైన కాళేశ్వరం... నేడు తెలంగాణ ప్రగతిలో మేలి మలుపు అయింది. వివిధ నదుల కింద ప్రాజెక్ట్‌ల నిర్మాణం ద్వారా, అనేక పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరిచి సంపద సృష్టించి, ఆ సంపదను మళ్లీ ప్రజలకే పంచడం కేసీఆర్ ప్రత్యేకత. అందుకే మునుగోడు ఓటరు కేసీఆర్‌ని దీవించి భారత్ రాష్ట్ర సమితికి పచ్చాజెండా ఊపారు. - డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ఉభయ రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటున్న టీఆర్ఎస్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందే ప్రయత్నాల్లో ఉన్న టీఆర్ఎస్, మునుగోడు ఉప ఎన్నిక గెలుపును కీలక మలుపుగా భావిస్తోంది. 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పినట్లుగానే మునుగోడు విజయం కూడా బీఆర్ఎస్కు కొత్త మలుపును ఇస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: బీఆర్ఎస్గా టీఆర్ఎస్.. అభ్యంతరాలపై పత్రికా ప్రకటన రిలీజ్ కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మునుగోడుకు పరిమితం చేయకుండా.. ఉపఎన్నికలో గెలుపును కేవలం మునుగోడుకే పరిమితం చేయకుండా రాష్ట్ర, జాతీయ రాజకీయాల కోణంలో ప్రొజెక్ట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుత ఉపఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత దూకుడును పెంచడమో లేదా వేగాన్ని తగ్గించడమో చేస్తుందని ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అనుసరించే వ్యూహం ఎలా ఉంటుందనే కోణంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. ప్రస్తుత ఫలితం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే అంశంపైనా టీఆర్ఎస్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ నాయకత్వంలోని ఓ బృందం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేయాల్సిన అడుగులపై కసరత్తు కొనసాగిస్తుందని, అదే సమయంలో 2023 ఎన్నికలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించేలా తమ కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో వరుసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడమే తమకు అత్యంత ప్రధానమని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్నికల రాజకీయాలను ఎండగట్టడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించేందుకు మునుగోడు గెలుపును వ్యూహంగా మలుచుకోవడంపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
Telidevara Bhanumurthy: బీఆర్ఎస్ అంటే ఏంది?
ఇయ్యాల ఆనగొట్టింది. రేపు ఎండ గొట్టొచ్చు. ఎల్లుండి సలిబెట్టొచ్చు. దినాలెప్పుడు ఒక్క తీర్గనే ఉండయి. మా తాత జమాన్ల విక్రమార్కుడు నడ్సుకుంట బొందలగడ్డ కాడ్కి బోయెటోడు. బేతాలుడు చెట్టు మీద ఉండెటోడు. గాన్ని బుజం మీదేస్కోని విక్రమార్కుడు నడ్సెటోడు. గాడు జెప్పేటి కత ఇని ఆకర్కి అడిగిన సవాల్‌కు జవాబ్ జెప్పెటోడు. మా నాయిన జమాన్ల విక్రమార్కుడు సైకిల్ మీద బొందలగడ్డ దిక్కుబోతే, సైకిలెన్క గూసోని బేతాలుడు కత జెప్పెటోడు. జమానా బదల్ గయా. గిప్పుడు విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ కాడ్కి బోయి హారన్ గొడ్తున్నడు. గాడ రొండంత్రాల బంగ్లలున్న బేతాలుడు ఇవుతల కొస్తున్నడు. మోటరెన్క సీట్ల గూసుంటున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ఎప్పటి తీర్గనే ఎన్క గూసున్న బేతాలుడు కత జెప్పబట్టిండు. మున్పటి లెక్క గాకుంట గాల్లిద్దరు ముచ్చట బెట్టుకుంట మోటర్ల బోబట్టిండ్రు. ‘అయ్యగారు బెట్టిన మూర్తంల దస్రనాడు కేసిఆర్ కొత్త పార్టీ బెట్టిండు’ అని బేతాలుడన్నడు. ‘మల్ల టీఆర్ఎస్ ఏమైంది?’ విక్రమార్కుడు అడిగిండు. ‘టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. ముల్లు బోయి కత్తి వొచ్చె ఢాంఢాం. తెలంగాన బోయి భారతొచ్చె రాంరాం’. ‘గది వీఆర్ఎస్ అయితదా?’ ‘కేటీఆర్ ముక్యమంత్రి గావాలంటె కేసీఆర్‌కు వీఆర్ఎస్ తప్పది. ఎప్పటి సందో ప్రతాని కుర్సి మీద గూసున్నట్లు గాయినకు కలలొస్తున్నయి. తెల్లారి నాలుగ్గొట్టంగ బడేటి కలలు నిజమైతయని ఒక సన్నాసి గాయినకు జెప్పిండు’. ‘కేసీఆర్ ఏం జేసిండు?’ ‘కర్నాటక రాస్ట్రం బోయిండు. కుమారస్వామిని గల్సిండు. వొచ్చె అసెంబ్లీ ఎలచ్చన్ల కోట్లు ఇస్త అన్నడు. గట్ల మాట ఇచ్చినంకనే కేసీఆర్‌తోని కుమారస్వామి ఫోట్వ దిగిండు. గని గాయిన తోని పని గాదు. అడుగు మాడదు, అట్టు పేరదు. బిహార్ ముక్యమంత్రి నితీశ్ కుమార్‌నే గాకుంట లాలూప్రసాద్ యాదవ్‌ను గుడ్క కేసీఆర్ గల్సిండు. చౌతాలను గల్సిండు. అందరం ఒక్కటై బీజేపీతోని కొట్లాడ్దామని అన్నడు. గని అస్సయ్ అంటె అదే సహి, దూలా అంటె ఇదే సహి అనె తంద్కు గాల్లు టీఆర్ఎస్ మంత్రులసొంటోల్లు గారు. కేసీఆర్ కడ్మ రాస్ట్రాల రైతు లీడర్లకు గాడి కిరాయి లిచ్చిండు. గాల్లు పట్నమొస్తె దావత్ ఇచ్చిండు. రైతుబందు పద్కంను తారీఫ్ జెయ్యమన్నడు. దేసమంత గా పద్కం బెడ్తె మంచిగుంటదని గాల్లతోని జెప్పిచ్చిండు’. ‘బేతాలా! ఏ బట్ట కాబట్ట మాస్క అయితెనే మంచి గుంటది. ఒక రాస్ట్రం పద్కం ఇంకొక రాస్ట్రంకు మంచి గుండదు.’ ‘నివొద్దే. మన్మన్ని, పెండ్లాంను దీస్కోని కేసీఆర్ యాద్గిరిగుట్టకు బోయిండు. నర్సిమ్మసామికి కిల పదారు తులాల బంగారమిచ్చిండు. దేవుడా! నన్ను ప్రతానిని జేస్తె నీ గుడినంత బంగారం జేస్త అని మొక్కిండు’ ‘ఇంకేం జేసిండు?’ ‘పట్నంల బిహార్ కూలోల్లు సస్తె గాల్ల కుటుంబాలకు తలా పది లచ్చలు ఇచ్చి వొచ్చిండు. మహారాస్ట్ర బోయి తీస్ మార్కాన్ నన్నడు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టి బెడ్తె టీఆర్ఎస్ లీడర్లు ఏం జేసిండ్రు! కొందరు దేస్ కీ నేతా కేసీఆర్ అని వొల్లిండ్రు. కొందరు గాయిన ఫోట్వలకు పాలతోని అబిసేకం జేసిండ్రు. ఇంకొందరు కోవ పేడలు బంచిండ్రు. పటాకులు గాల్చిండ్రు. వరంగల్ టీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరైతె డిస్కో డాన్సు జేసిండు. హమాలోల్లకు తలా ఒక కోడి, కోటర్ విస్కి సీస ఇచ్చిండు. కేసీఆర్ ప్రతానమంత్రి అయితున్నడని సాటిచ్చిండు. ఇగ కేసీఆర్ ప్రతాని గావాలనుకుంట చౌటుప్పల్‌ల బువ్వ దినే ముంగట మంత్రి మల్లారెడ్డి టీఆర్ ఎసోల్లకు మందు బోసిండు. గాయిన విస్కి సీసలెందుకు బంచిండు? గీయిన మందు ఎందుకు బోసిండు? గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) ‘బీఆర్ఎస్ అంటె బిరండి, రమ్ము, స్కాచ్ అనుకోని ఒకలు విస్కి సీసలు బంచితె, ఇంకొకలు గిలాసలల్ల మందు బోసిండ్రు’ అని విక్రమార్కుడు జెప్పిండు. సరింగ గప్పుడే బొందల గడ్డొచ్చింది. మోటరాగింది. మోటర్ల కెల్లి దిగి బేతాలుడు ఇంటికి బోయిండు. (క్లిక్ చేయండి: చల్నేదో బాల్ కిషన్) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
‘పార్టీ’టైమ్... కాసింత కామెడీగా!
‘జనం కమెడియన్లను సీరియస్‌గా, పొలిటీషియన్లను కామెడీగా తీసుకుంటున్నారని’... ఓ అమెరికా పెద్దమనిషి చెప్పి దాదాపు వందేళ్ల య్యింది. ఇంకా అదే ట్రెండ్ కొసాగుతున్న ట్టుంది.. ఇది చూడండి.. ముందస్తు అరెస్ట్‌లు, హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బందోబస్తు.. 100 మంది అదుపులోకి.. 3 గంటలపాటు ఉద్రిక్తత.. 1,500 మంది పోలీసుల మోహరింపు.. బారికేడ్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... కామెడీ షో ప్రశాంతంగా పూర్తయింది.. – ఇదీ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మునావర్ స్టాండప్ కామెడీ షో తీరు. 5వ తారీఖున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన గురించి ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.. ట్రంప్, పుతిన్, కిమ్‌లాంటి వాళ్లు కేసీఆర్ బ్యాచ్‌తో టచ్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ‘ప్రపంచ రాష్ట్ర సమితి’ (పీఆర్ఎస్) పార్టీ పెడితే మన పరిస్థితి ఏమిటీ అని పలువురు దేశాధినేతలు తర్జన భర్జన పడుతున్నారు.. పీఆర్‌ఎస్‌లో ఉండడమా, స్వతంత్రంగా ఉండడమా అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. – ఇదీ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మెసేజ్. ఇట్లా.. కామెడీ సీరియస్‌గా.. పాలిటిక్స్ కామెడీగా! ‘మన వాళ్లు వట్టి వెధవాయిలు..’ ఇందిరమ్మ సృష్టించిన ఎమర్జెన్సీ చీకట్లలో ఉదయించిన ‘జనతా’లాగా.. పంచమ స్వరాన్ని దళిత శంఖారావంలా దేశ వ్యాప్తం చేయ ప్రయత్నించిన కాన్షీరాం బీఎస్పీ లాగా... చాలా కాలం తర్వాత అలా దేశవ్యాప్త సంచలనం.. మోదీ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి విజయ దశమి నాడు గాండీవం ఎత్తిన కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. మన తెలుగు ఎన్టీయార్ కల ‘భారతదేశం’ పార్టీ భావనను ఆయన వీరాభిమాని కేసీఆర్ దేశవ్యాప్తం చేసే అద్భుత సన్నివేశం.. దీన్ని కొంతమంది.. అదీ తెలుగు వాళ్లు.. మరీ తెలంగాణ తల్లి బిడ్దలు.. ఇలా ట్రోల్ చేయడం ఆశ్చర్యమే మరి! జాతీయ పార్టీలు చిన్న మునుగోడు పైనే పడుతుంటే.. జాతీయవాదాన్ని ఎత్తుకున్న తెలు గోడిని మరో తెలుగోడు ప్రశంసించడం మాని.. పరిహసించడమా! ‘ముందుకు పోతానంటే ఎందుకు నీ విరగబాటు ఇటనే నిలుచో మందురు..’ అని శ్రీశ్రీ.. ‘మన వాళ్లు వట్టి వెధవాయిలోయ్..’.. అని గురజాడ గిరీశం ఊరికే అన్నారా పునర్భూదోషం... జ్యోతిష్యులు కూడా దీన్ని వదలక పోవడం మరింత చిత్రం.. తెలుగు నేలపై ఆధ్యాత్మిక వైభవానికి కేసీఆర్ ఎంత చేస్తున్నారో మనకు తెలుసుగా.. శుభం పలకవచ్చుగా! ధనుర్లగ్నంలోనే పార్టీ ప్రకటన జరిగిందట... ఇది అచ్చంగా రాజులు మరో సామ్రాజ్యంపై దాడిచేసేటప్పుడు పెట్టే ముహూర్తం... యుద్ధానికి ప్రతీక, విజయానికి సూచిక.. తిరుగులేదు అంటూనే.. కాస్త లో–వాయిస్‌లో కొర్రీలు చూపుతున్నారు. దుర్ముహూర్త స్పర్శా దోషం ఉంది., పునర్భూదోషం ఉంది. పలుమార్లు శ్రమించాల్సిందే, నల్లేరుపై నడక కాదు కష్టపడాల్సిందే.. అంటున్నారు. ఠాఠ్.. అదేమీ లేదు వ్యక్తిగత జాతకం అద్భుతం అని కాస్త హై–వాయిస్‌లో దబాయిస్తున్న ప్రో– జ్యోస్యులూ ఉన్నారనుకోండి! ఇదో ‘స్టార్టప్’ తరహా... ఇక సామాజిక మాధ్యమాల్లో తిష్ఠవేసిన విశ్లేషకుల ముచ్చట్లు రకరకాలు..మచ్చుకు ఒకటి.. – మన దగ్గర ఒక్క పార్లమెంట్ ఎన్నికకయ్యే ఖర్చులో బయటి రాష్ట్రాల్లో నాలుగైదు పార్లమెంట్ నియోజక వర్గాలు లాగించవచ్చు. బాగా వనరు లున్న పార్టీ కనుక చిన్నా చితకా పార్టీలను ఆకర్షించవచ్చు. వారికి ఆర్థిక సాయం చేయవచ్చు. ఇదో స్టార్టప్ తరహా వ్యవహారం.. ఇది స్టార్టప్‌ల కాలంకదా.. చూద్దాం ఇది సక్సెస్ అవుతుందో లేదో.. అని విశ్లేషణ బాల ‘పిట్టకథ’ ఇంకాస్త కరడు గట్టిన తెలంగాణ వాదులు ఓ పిట్టకథ చెబుతున్నారు. ఓ పిల్లాడిని తల్లి పిలిచి సీసా మూత తియ్యరా అంది పలుమార్లు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అన్న దాన్ని తీసుకుని ఓ రెండు మార్లు ప్రయత్నించి మూత తీసి హీరోలా తమ్ముడి వైపు చూసి వెళ్లాడు. తమ్ముడు తల్లిని అడిగాడు అన్న ఎలా తీయగలిగాడు అని.. నువ్వు చాలా చాలా సార్లు ప్రయత్నించినప్పుడే అది లూజయింది. మరోమారు నువ్వు ప్రయత్నించినా వచ్చేది అని నవ్విందట! కేసీఆర్‌దీ ఇదే తంతు. ఎన్నో దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమం కీలక దశలో జొరబడి పేరు కొట్టేశాడు అంటూ వెటకారం చేస్తూ... ప్రతిసారీ అన్ని సీసాల మూత తియ్యడం సాధ్యం కాదు... అని నర్మగర్భంగా, కాస్త వ్యంగ్యంగా.. పక్కోడి ప్రయత్నాలు, ఉద్యమాలు, ఆత్మబలిదానాలు లేకుండా అస్సలు సాధ్యంకాదని సీరియస్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు.. నామ్‌కే వాస్తే.. ఈ సీసాల గొడవ ఇలా ఉండగా.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు పేరు మార్పుపై. ‘..సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే సిరి సిరి మువ్వా..’ శ్రీశ్రీ పాటేసుకుంటున్నారు.. గొర్రెలెలా? కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఇలా డౌటేస్తున్నారు... ఫర్ సపోజ్...మన బీఆర్ఎస్ ఢిల్లీ పీఠం ఎక్కిందనుకుందాం... రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటాం. కమీషన్లకు కక్కుర్తి పడకుండా కార్పొరేట్లకు రుణ మాఫీ రద్దు చేసి..దానికి బదులు దేశమంతటా దళిత బంధు, రైతు బంధు ఇచ్చుకుందాం. రాష్ట్రానికో కాళేశ్వరం కట్టుకుందాం.. ఊర్లన్నీ పచ్చగ చేసుకుందాం.. ..కానీ, మన గొర్రెల పథకం ఉందిగా.. దేశమంతా గొర్రెలెలా పంచడం? ఇక్కడ మనకు సరిపోకే పక్క రాష్ట్రాలనుంచి తెస్తున్నామాయే! (క్లిక్ చేయండి: రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!) -
52 దేశాల ఎన్నారైల మద్దతు బీఆర్ఎస్కే
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితికి ప్రపంచంలోని 52 దేశాల ఎన్నారైలు మద్దతు ప్రకటించారని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కో–ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఎన్నారై ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... కేసీఆర్ దసరా రోజు తీసుకున్న బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయాన్ని ఆయా దేశాల ఎన్నారై ప్రతినిధులు స్వాగతించారని తెలిపారు. తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాల ఎన్నారైలు సైతం మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్నారైలు భావిస్తున్నారని, బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేసీఆర్ అడుగుజాడల్లో ముందుకెళ్తామని ఎన్నారైలు పేర్కొన్నట్లు మహేష్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నారైల మద్దతు బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు. (క్లిక్: కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చిన కోమటిరెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ!)