సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పుట్టుకొచ్చిన పార్టీ.. ఇరవై రెండేళ్లకు పేరు మార్చుకుంది. స్వరాష్ట్ర కల సాకారం.. రాష్ట్రాభివృద్ధి దరిమిలా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయ్యింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధికారిక ఆవిర్భావ వేడుకలు జరిగాయి.
ప్రత్యేక పూజలు, ఈసీ పంపిన పత్రాలపై సంతకం అనంతరం జెండా ఆవిష్కరించి భారత రాష్ట్ర సమితిని అధికారికంగా లాంఛ్ చేశారు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బీఆర్‌ఎస్ కండువాను ఆయన మెడలో కప్పుకున్నారు. జెండా రంగు గులాబీనే కాగా.. తెలంగాణ స్థానంలో మధ్యలో భారత దేశం మ్యాప్ వచ్చి చేరింది. అయితే కారు మాత్రం జెండాలో కనిపించకపోవడం గమనార్హం.
తెలంగాణ భవన్ వద్ద భారీగా పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్, మరికొందరు ముఖ్యనేతలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పలువురు నేతలకు బీఆర్‌ఎస్ కండువాలను కప్పారు కేసీఆర్.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ పేరును నేనే మొదట కోరా!
Comments
Please login to add a commentAdd a comment