సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందే ప్రయత్నాల్లో ఉన్న టీఆర్‌ఎస్, మునుగోడు ఉప ఎన్నిక గెలుపును కీలక మలుపుగా భావిస్తోంది. 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పినట్లుగానే మునుగోడు విజయం కూడా బీఆర్‌ఎస్‌కు కొత్త మలుపును ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్.. అభ్యంతరాలపై పత్రికా ప్రకటన రిలీజ్
కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
మునుగోడుకు పరిమితం చేయకుండా..
ఉపఎన్నికలో గెలుపును కేవలం మునుగోడుకే పరిమితం చేయకుండా రాష్ట్ర, జాతీయ రాజకీయాల కోణంలో ప్రొజెక్ట్ చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ప్రస్తుత ఉపఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత దూకుడును పెంచడమో లేదా వేగాన్ని తగ్గించడమో చేస్తుందని ఇటీవల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అనుసరించే వ్యూహం ఎలా ఉంటుందనే కోణంపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది.
ప్రస్తుత ఫలితం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే అంశంపైనా టీఆర్‌ఎస్‌లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ నాయకత్వంలోని ఓ బృందం జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ వేయాల్సిన అడుగులపై కసరత్తు కొనసాగిస్తుందని, అదే సమయంలో 2023 ఎన్నికలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించేలా తమ కార్యాచరణ ఉంటుందని టీఆర్‌ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు.
రాష్ట్రంలో వరుసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడమే తమకు అత్యంత ప్రధానమని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్నికల రాజకీయాలను ఎండగట్టడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించేందుకు మునుగోడు గెలుపును వ్యూహంగా మలుచుకోవడంపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment