సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని అన్నివిధాలా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేలా వ్యూహానికి పదును పెట్టాలని భారత్ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ, సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపణలు, జర్నలిస్టు రాజ్‌దీప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది.
మరికొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం కనుసన్నల్లో రాష్ట్ర బీజేపీ రాజకీయంగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశముందని బీఆర్‌ఎస్ అంచనాకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ‘పశ్చి మ బెంగాల్ ఎన్నికల తరహా పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ పద్ధతిలో కేవలం ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలతో, సాధారణ కార్యక్రమాలతో అడ్డుకట్ట వేయలేమని పార్టీ భావిస్తోంది.
బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టే అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతిదాడి చేసేందుకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. ఆతీ్మయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో బీఆర్‌ఎస్ తలమునకలై ఉంది. తాజాగా ఈ సమావేశాలనే వేదికగా చేసుకుని.. రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలకు పాల్పడే అవకాశముందనే అంశంపై శ్రేణులకు విడమరిచి చెప్పాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలను ఆదేశించింది.
‘స్లీపర్ సెల్స్’పై నిఘా
బీజేపీతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడం, కేంద్ర నాయకత్వం వ్యూహాలను అమలు చేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వైనంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలిసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం లాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని నిఘా వర్గాలు నివేదించినట్లు సమాచారం.
మరోవైపు సుమారు ఏడాది కాలంగా బీజేపీ అనుబంధ సంఘాలకు చెందిన ఇతర రాష్ట్రాల నేతలు, కేడర్.. తెలంగాణలో ‘స్లీపర్ సెల్స్’లా పనిచేస్తున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. 2020 చివరలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్ని ఎంపిక చేసిన డివిజన్లలో ఈ స్లీపర్ సెల్స్ పనిచేశాయని బీఆర్‌ఎస్‌లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
బీఆర్‌ఎస్ బలాలు, బలహీనతలను సూక్ష్మస్థాయిలో పోస్ట్‌మార్టం చేస్తున్న ఈ స్లీపర్ సెల్స్ వాటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్లీపర్ సెల్స్ నుంచి అందుతున్న ఆదేశాల మేరకే పేపర్ లీకేజీ వంటి కుట్రల్లో ఆ పార్టీ కేడర్ పాలుపంచుకుంటోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టాలని, బీజేపీ కుట్రలు, వ్యూహాలు సమర్ధంగా తిప్పికొట్టా లని అధికార పార్టీ నిర్ణయించింది.
మంత్రులకే నాయకత్వం
బీజేపీ నేతల వ్యూహాలు, కుట్రలను తిప్పికొట్టేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై ఎదురుదాడి బాధ్యతను మంత్రులకు అప్పగించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. బీజేపీపై విమర్శలు, ఎదురుదాడి విషయంలో కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష కార్యాచరణలో భాగం కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలందరినీ పార్టీ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రధాన నిందితుడుగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని మంత్రులందరూ ఏకకాలంలో మీడియా ద్వారా ఎదురుదాడి చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ చేపట్టిన బండి దిష్టిబొమ్మ దహనం, నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment