హరియాణా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఖర్గే
మహిళలకు ప్రతి నెల రూ.2,000 ఆర్థికసాయం
రూ. 500కే గ్యాస్ సిలిండర్
దివ్యాంగులు, వితంతువులు, వయో వృద్ధులకు రూ.6,000 పెన్షన్
పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ హామీల చిట్టీని బహిర్గతం చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, రైతులకు వరాలు కురిపించింది. మహిళలకు ప్రతి నెల రూ.2,000 ఆర్థికసాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సహా పలు వర్గాలపై వరాల జల్లు కురిపించింది. ఏడు కీలకమైన హామీలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్‌ల సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 53 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఏడు గ్యారంటీలు ఇవే
→ మహిళా సాధికారత: 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.2,00 చొప్పున ఆర్థికసాయం. రూ.500కే గ్యాస్ సిలిండర్
→ సామాజిక భద్రత: వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు రూ.6,000 పెన్షన్
→ యువతకు: రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
→ ఉచితాలు: రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
→ పేదలకు: ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంలో ఇల్లు. ఇందులో రూ.3.5 లక్షల ఖర్చుతో రెండు గదుల ఇళ్లు
→ రైతులకు: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
→ వెనుకబడిన వర్గాలకు: కులగణన చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవడం. క్రిమిలేయర్ పరిమితిని రూ.10లక్షలకు పెంపు
గెలిచాకే సీఎం అభ్యర్థి ఖరారు: ఖర్గే
హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇచి్చన ఏడు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ‘‘దాదాపు 35 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా నిలిపివేసింది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఒక ఇంజన్ ముందుకు తీసుకెళ్తుంటే మరో ఇంజన్ వెనక్కి లాగుతోంది. మేం మేనిఫెస్టోలో చెప్పిన ఏడు ప్రధాన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం.
తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిన నష్టాన్ని సరిదిద్దటంతోపాటు రాష్ట్రంలో వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ‘అభివృద్ధి ఎక్స్‌ప్రెస్ ఇంజన్’జత చేస్తాం’’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాకే ముఖ్యమంత్రి అభ్యరి్థని ప్రకటిస్తామని ఖర్గే స్పష్టంచేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా సైతం మాట్లాడారు. ‘‘నాటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో 1966లో మా రాష్ట్రం ఏర్పాటైంది. నాటి నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది. అయితే తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ హరియాణాను నంబర్ వన్ చేస్తాం’అని హూడా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment