సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరో ప్రస్థానం దిశగా అడుగు వేసింది. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలనే వినతికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేయడంతో.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా ప్రస్థానం మొదలుపెట్టిన టీఆర్‌ఎస్.. శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్‌గా రూపుమారుతోంది.
టీఆర్‌ఎస్‌తో స్వరాష్ట్ర సాధనకు పోరాడి రెండు పర్యాయాలు సీఎం పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌తో ఢిల్లీస్థాయిలో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ఎంట్రీకి సంబంధించి సంకేతాలు ఇస్తూ వచ్చారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని, అందుకోసం ప్రయత్నిస్తామని ప్రకటనలు చేశారు.
జలదృశ్యం వేదికగా..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సిద్దిపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు కేసీఆర్ ఏకకాలంలో రాజీనామా ప్రకటించారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారు. 2001 మే 17న కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులకు పునాదులు వేసింది.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికలో కేసీఆర్ తిరిగి విజయం సాధించడంతో టీఆర్‌ఎస్ ప్రస్థానానికి తొలి మైలు రాయి పడింది. అప్పటి నుంచి ఉద్యమ పార్టీగా వినూత్న వ్యూహాలతో ముందుకుసాగిన టీఆర్‌ఎస్.. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని, కరీంనగర్ సభలో నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తెలంగాణ ఏర్పాటు హామీ ఇప్పించింది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా జాతీయ స్థాయిలో 36 పార్టీలతో లేఖలు ఇప్పించారు.
కొత్త సవాళ్ల మధ్య..
ఉద్యమ నేతగా కేసీఆర్ అనుసరించిన ఎత్తుగడలు, తీసుకున్న నిర్ణయాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరిట అనుసరించిన విధానాలు, ముఖ్యమంత్రిగా చేపట్టిన కొన్ని సంస్కరణలు పలు సందర్భాల్లో విమర్శలు, ప్రతి విమర్శలకు గురయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు కొత్త సవాళ్లు విసిరాయి.
అయితే ఇవేవీ తమపై ప్రభావం చూపవనే రీతిలో కేసీఆర్ దూకుడుగా ముందుకెళుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్‌ఎస్ ప్రవేశానికి సంబంధించి గత రెండేళ్లలో వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు, జాతీయ స్థాయిలో పేరొందిన పార్టీలు, నేతలతో మంతనాలు జరిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతుందని కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5న నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్‌ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు. డిసెంబర్ 9న లాంఛనంగా పేరుమార్పును అమల్లోకి తెస్తున్నారు. దీనితో రెండు దశాబ్దాల టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్ పేరిట మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది.
రాజీనామాలు, ఉప ఎన్నికల వ్యూహంతో..
రాజీనామాలు, ఉప ఎన్నికలను ఉద్యమ వ్యూహంగా మార్చుకున్న కేసీఆర్.. పలు సందర్భాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి భిన్నమైన ఫలితాలు చవిచూశారు. 2004లో కాంగ్రెస్ పొత్తుతో టీఆర్‌ఎస్ 54 సీట్లలో పోటీచేసి 26 చోట్ల గెలిచింది. 2006లో కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవడం టీఆర్‌ఎస్‌కు కొత్త ఊపిరి పోసింది.
2008లో పార్టీలో మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించగా.. ఉప ఎన్నికల్లో తిరిగి ఏడుగురు మాత్రమే గట్టెక్కారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టులతో మహా కూటమి పేరిట జట్టుకట్టినా కేవలం పది మంది మాత్రమే టీఆర్‌ఎస్ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణంతో ఉమ్మడి ఏపీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని టీఆర్‌ఎస్ అనువుగా మలుచుకోగలిగింది. 2010 నుంచి 2012 వరకు పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా రాజీనామాలు, ఉప ఎన్నికలతో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆమరణ దీక్ష.. ఎడతెగని పోరాటాలతో..
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించింది. దీనితో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అదే ఏడాది డిసెంబర్ 23న ప్రకటించింది.
దీనితో తెలంగాణ జేఏసీ ఏర్పాటు ద్వారా టీఆర్‌ఎస్ ఆందోళనను ఉధృతం చేసింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి ఆందోళనలతో ఊపును కొనసాగించింది. ఎడతెగని పోరాటాలతో కేంద్రం దిగొచ్చింది. 2014 ఫిబ్రవరిలో ఉమ్మడి ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
అదే ఏడాది మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు గాను 63చోట్ల టీఆర్‌ఎస్ విజయం సాధించగా.. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే గడువుకన్నా ఆరు నెలలు ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి 2018 డిసెంబర్‌లోనే ముందస్తు ఎన్నికలు వెళ్లిన టీఆర్‌ఎస్‌కు 119 స్థానాలకు గాను 88 సీట్లు దక్కాయి. రెండోసారి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment