సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిని దేశవ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా.. మొదట పాత హైదరాబాద్ సంస్థానంలోని కర్ణాటక, మహారాష్ట్రలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో ఎలాగూ పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో తక్షణం ఆ రెండు రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించి.. తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
తమిళనాడులో తిరుమావళవన్‌కు చెందిన వీకేసీ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకోవడం ద్వారా అక్కడ అడుగుపెట్టనున్నారు. మరోవైపు ఏపీలోనూ విస్తరించడానికి తనతో కలిసి వచ్చే నేతల కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన నేతలను కేసీఆర్ ఆహ్వానించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
రైతులు, దళితుల అంశాలతో..
బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రధానంగా రైతు సమస్యలతోపాటు దళితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సంఘం నుంచి బీఆర్‌ఎస్‌కు గ్రీన్‌సిగ్నల్ రాగానే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున దళిత సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మహారాష్ట్రలో రైతు సమస్యలపై సదస్సులు, బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈసీ నిర్ణయం ఆధారంగా ‘మునుగోడు’లో
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి టీఆర్‌ఎస్ పేరుతోనా? బీఆర్‌ఎస్ పేరుతోనా అన్నది ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల సంఘం ఈనెల 14లోగా బీఆర్‌ఎస్‌కు అనుమతిస్తే.. ఆ పేరుతోనే అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉందని, లేకుంటే టీఆర్‌ఎస్ అభ్యర్థిగానే పోటీలో నిలుపుతుందని పేర్కొన్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులను మునుగోడులో మోహరించిన టీఆర్‌ఎస్.. విజయం కోసం తీవ్రంగా శ్రమించాలని స్పష్టం చేసింది.
నామినేషన్ల గడువు నాటికి..
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ శుక్ర వారం నుంచి ప్రారంభం అవుతుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనా అధికారిక ప్రకటనకు కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 14న నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో 12వ తేదీ నాటికి అభ్యర్థి ప్రకటన, నామినేషన్ దాఖ లుపై స్పష్టత రానుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో జరిగిన భేటీలో పార్టీ పేరు మార్పిడికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందన్న దానిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టత కోరినట్టు సమాచారం.
నేటి నుంచి మునుగోడుకు ప్రచార బృందాలు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి పార్టీ ముఖ్య నేతలకు ప్రచార బాధ్యత అప్పగించింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా యూనిట్ ఇన్‌చార్జులుగా నియమితులైన నేపథ్యంలో.. క్షేత్రస్థాయి ప్రచారంపై టీఆర్‌ఎస్ పూర్తి దృష్టి సారించింది. నియోజకవర్గానికి వచ్చే ప్రచార బృందాలకు బస, ఇతర వసతులు కల్పించే బాధ్యతలను ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు అప్ప గించారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. గురువారం నల్లగొండలో టీఆర్‌ఎస్ కీలక భేటీ నిర్వహించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేతలతో కూడిన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment