భూమి రేట్లు పెరగడం తాము చేసిన ‘అభివృద్ధి’కి మచ్చుతునకగా రాజకీయ నాయకులు ప్రచారం చేసుకోవడం శోచనీయం. రాజకీయ అధికారం బడుగులకు ఉండాలనే నినాదంతో వచ్చిన తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి నాయకులు దీన్ని వల్లె వేయడం ఇంకా ఘోరం. భూమి వ్యాపార వస్తువు అయితే, దాని ధరలు కోట్లకు చేరితే, సామాజిక అన్యాయం పెరుగుతుందనే స్పృహ ఈ నాయకులకు లేకపోవడం గర్హనీయం.
గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాల వల్ల భూమి క్రమంగా కొందరి పాలు అవుతున్నది. ఈ కొందరు దానిని తమ పెట్టుబడులు పెంచే ఆర్థిక సాధనంగా పరిగణిస్తున్నారు. చుట్టూ కంచె వేసి పడావు పెడుతున్నారు. ఇది ఆహార భద్రతకు ముప్పు!
భూమిని చాలా సాధారణంగా చూడడం అలవాటు అయింది. అసలు భూమి ఒక సహజ వనరు అని గుర్తించేవారు, గుర్తు పెట్టుకునేవారు అరుదు. భూమి, నేల, మట్టి, మన్ను వంటివి పర్యాయ పదాలుగా వాడతారు. కానీ, భూమి మనకు అందించే సేవలు ఆ పదాలలో ఇమిడి ఉన్నాయి. సమస్త పచ్చదనం, నీళ్ళు, అనేక రకాల జీవరాశులకు ఈ భూమి ఆలవాలం.
భూమి పైన, లోపట, అంతటా ఉండే సంపద అపారం. సహజ భూవినియోగాన్ని మానవులు టెక్నాలజీ దన్నుతో అసహజ రీతిలో మార్చుతున్నారు. దానికి ‘అభివృద్ధి’ అని పేరు పెడుతున్నారు. ప్రాణ వాయువు నిరంతరం అందాలంటే చెట్లు, చేమ ఉండాలి. నీళ్ళు ఉండాలి. అవన్నీ ఉండాలంటే నేల కావాలి. ఈ పరస్పర ఆధారిత ప్రకృతి రుతుచక్రాలను మరిచిపోతున్నాము.
తెలంగాణాలో భూమి ఆధారంగా అనేక వృత్తులు, జీవనో పాధులు ఉండేవి. గ్రామాలలో ఆహార ఉత్పత్తికి, స్వయంసమృద్ధికి భూమి అవసరం. పేదరికంలో, ఆకలితో ఉండడానికి భూమి లేకపోవ డమే కారణమని గుర్తించి పేదలకు భూమి పంచడం ఒక రాజకీయ, ఆర్థిక, పాలనాంశంగా మారింది. అయితే, గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాల నేపథ్యంలో భూమి క్రమంగా కొందరి పాలు అవుతున్నది. ఈ కొందరు దానిని తమ పెట్టుబడులు పెంచే ఆర్థిక సాధనంగా పరిగణిస్తున్నారు. చుట్టూ కంచె వేసి పడావు పెడు తున్నారు. ఇది ఆహార భద్రతకు ముప్పు. పైగా లక్షలాది కుటుంబాల జీవన సాధనం హరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఎకరా ధర కోట్లలో ఉంటే పెట్టుబడి కొంత ఇక్కడకు మరలవచ్చుగాక, కానీ ధరలు శిఖరానికి చేరిన తరువాత ఆ భూమిలో ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. రియల్ ఎస్టేట్ ధరలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అది దాటితే పెట్టుబడి మురిగిపోతుంది. ఆ ఆర్థిక పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. పేదలకు వ్యవసాయానికీ, ఆహారానికీ, ఇండ్లకూ భూమి దొరకదు.
భూమి ఉన్నవాడు దాని నుంచి పెట్టుబడికి తగ్గ ‘లాభం’ వచ్చే వ్యాపారం లేక ఇబ్బంది పడతాడు. కోట్ల రూపాయల భూమిలో ఏ వ్యాపారం చేస్తే అన్ని కోట్లు తిరిగి వస్తాయి? అ వ్యాపారాలకు మార్కెట్లు ఉన్నాయా? అటువంటి భూమిలో అపార్ట్‌మెంట్లు, ఇండ్లు కడితే కొనగలిగే స్థోమత ఉన్నవాళ్ళు ఎంత మంది ఉంటారు? ఇండ్లు, వ్యాపార సముదాయాల మార్కెట్లు స్థానిక డిమాండ్ మేరకు ఉంటేనే ఉపయుక్తం.
తెలంగాణా ప్రభుత్వం ఇటువంటి సమీక్ష చేయడం లేదు. చేసిన అప్పులు తీరాలంటే ప్రభుత్వ ఆదాయం పెరగాలి. అది రియల్ ఎస్టేట్ ద్వారా పెరుగుతుంది అని బలంగా నమ్మి భూ బదలాయింపు విధానాలు అమలు చేస్తున్నారు. తెలంగాణా అస్తిత్వ ఉద్యమాలకు అందరికీ భూమి అనేది బలమైన పునాది. కానీ అది తెలంగాణా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు బలి అవుతున్నది.
ధరణి, పారిశ్రామిక విధానాలు, భూసేకరణ చట్టం 2017, మునిసిపల్ చట్టం, పంచాయతీ రాజ్ చట్టం, పట్టణాల అభివృద్ధికి అడుగులు, భవనాల నిర్మాణానికి అప్పులు, రైతు బంధు వగైరా తెలంగాణా ప్రభుత్వ చర్యలు భూమి యాజమాన్యం కొందరి దగ్గరే ఉండే విధంగా ఉంటున్నాయి. బడుగులకు ఉన్న భూమిని అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నది. ఏ ధరకు అమ్ముకున్నా ఆ కుటుంబం భూమి లేని కుటుంబంగా మిగులుతుంది. స్వతంత్ర జీవనోపాధి కోల్పోతుంది.
భూమి అమ్మిన ధనం విద్యకు, సంతతి వికాసానికి ఉపయోగపడినా, ఉద్యోగం లేనిదే సుస్థిరం కాదు. అయితే మంచిదే. కాకుంటే, సమస్య ఇంకొక రూపం తీసుకుంటుంది. అటు ఉద్యోగం రాక, ఉపాధి లేక, భూమి కోల్పోయి రోడ్డు మీదకు వచ్చిన కుటుంబాల సంఖ్య తెలంగాణా ఏర్పడక ముందు కంటే తెలంగాణా వచ్చినాక ఇంకా పెరిగింది.
పట్టణాలు, నివాసిత ప్రాంతాల విషయంలో ప్రణాళికబద్ధ అభి వృద్ధి పోయి దళారుల రాజ్యం వచ్చింది. స్థానిక పంచాయతీ ప్రతి నిధుల చేతి నుంచి నిర్ణయాధికారం అధికారుల వ్యవస్థకు మళ్ళింది. ఇది ఒక రకంగా పల్లెల మీద పట్టణం కొనసాగిస్తున్న సామ్రాజ్యవాదం. ఇదే మోడల్ తెలంగాణలో అన్ని పట్టణాల చుట్టూ అమలు చేస్తున్నారు.
మాస్టర్ ప్లాన్లు తయారు చేయటం, పల్లెలను విలీనం చేయటం, భూమి వినియోగం మార్చటం, ఫీజులు వసూలు చేయటం, తద్వారా అవినీతి సామ్రాజ్యానికి ఇంధనం అందించటం! ఈ క్రమంలో వ్యవసాయ భూమి తగ్గిపోయినా, చెరువులు మాయ మయినా, గుట్టలు విధ్వంసం అయినా, చెట్లు నరికివేసినా ఏ చట్టానికీ పట్టదు.
ఈ మోడల్ చేస్తున్న పర్యావరణ హననంలో అనేక జీవ రాశులు, జీవనోపాధులు సమిధలు అయినాయి. గ్రామీణ ఉపాధి తగ్గిపోవడానికి కారణం వ్యవసాయ భూమి వ్యవసాయేతర పనులకు మరలడమే. ఒకవేళ గొర్రెల పథకానికి అవినీతి లేకుండా నిధులు ఇచ్చినా వాటిని మేపే భూములు లేకుంటే ఫలితం రాదు.
తెలంగాణా ప్రభుత్వం ‘అభివృద్ధి’ పనులకు... అంటే, కొత్త రోడ్లు, ఉన్న రోడ్ల విస్తరణ, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాల విస్తరణ, చెత్త కుప్పలు, శ్మశానాలకు భూమిని సేకరిస్తున్నది. ఇది ఎక్కువ శాతం వ్యవసాయ భూమి అని గమనించాలి. ఆ భూమి మీదనే ఆధారపడి బతికే కుటుంబాలకు భూమికి బదులుగా భూమిని ఇవ్వవచ్చు, లేదా మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చు.
ఇవేమీ చేయ కుండా చట్టాలను, సహజ న్యాయ సూత్రాలను కాదని భూమిని బదలాయిస్తున్నది. ఆహారం పండించే భూమి వినియోగం మార్చితే భవిష్యత్తులో ఆహార కొరతకు కారణం అవుతుంది. పెద్ద రోడ్లు ఎత్తుగా కట్టడానికి టన్నుల కొద్దీ మట్టి, రాళ్ళను వాడుతున్నారు. ఈ ‘అవసరం’ కొరకు గుట్టలను పిండి చేశారు. లక్షలాది చెట్లను నరికివేశారు. పెద్ద రోడ్లు కడుతున్నది కార్లు వేగంగా పోవటానికి.
వీటి వల్ల వ్యవసాయ భూమి పోతున్నది, వర్షం నీటిని ఒడిసిపట్టే చెట్లు, గుట్టలు పోతున్నాయి. భూమి వినియోగం మార్చితే నీటి కొరత వస్తుంది అనే స్పృహ అధికారులకు, నాయకులకు, ప్రజలకు కొరవడింది.
నీళ్ళు వచ్చినా, విద్యుత్ ఉన్నా, చిన్న, సన్నకారు రైతులు భూములను ఎందుకు అమ్ముకోవాల్సి వస్తున్నది? వ్యవసాయం వారికి ఎందుకు లాభసాటిగా మారడం లేదు? ఈ ప్రశ్నలకు సమా ధానంగా సుపరిపాలన పథకాల రచన చేయాల్సి ఉండగా, కేవలం భూమి ధరలు పెంచి ఇదే ఆర్థిక అభివృద్ధి అని తెలంగాణా నాయ కులు గొప్పలకు పోతున్నారు. మట్టిలో తేమ కొన్ని వందల టీఎంసీల నీటికి సమానం.
ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభించేది. మట్టిని, నేలను, పచ్చదనాన్ని సంరక్షించే కార్య క్రమాల మీద పెట్టుబడి పెడితే రైతుల కమతాలలో నీరు దక్కేది. ఆహార పంటలకు అనువైన పర్యావరణంతో పాటు అప్పులు, వడ్డీల భారం ఉండేది కాదు. సుస్థిర ఫలితాలు వచ్చేవి. దీనికి వ్యతిరేక దిశలో అడుగులు వేసి తెలంగాణ ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగించడంతో పాటు ఆర్థిక, సామాజిక వ్యవస్థలను కుదిపింది.
‘ఎంత ఖర్చు అయినా వెనుకాడం’ వంటి ప్రకటనల పర్యవసానంగా భూమితో కూడిన ఉత్పత్తి సంబంధాలు మారుతున్నాయి. భూమికి నీళ్ళు లక్ష్యంతో మొదలయ్యి, నీళ్ళ కొరకు భూమి అమ్మడం వ్యూహా త్మక తప్పిదం! పర్యావరణ హిత జీవనం మీద, సుస్థిర అభివృద్ధి మీద రాజకీయ, ఆర్థిక, సామాజిక వేత్తలు అత్యవసరంగా దృష్టి పెట్టకపోతే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వచ్చే ఉత్పాతాల నుంచి వెనుదిరిగే సమయం కూడా ఉండదు.
దొంతి నరసింహా రెడ్డి
వ్యాసకర్త విధాన విశ్లేషకులు ‘ 90102 05742
Comments
Please login to add a commentAdd a comment