మెరుగులు దిద్దితేనే మేలు | Sakshi Editorial On Education System | Sakshi
Sakshi News home page

మెరుగులు దిద్దితేనే మేలు

Published Mon, Jun 14 2021 12:07 AM | Last Updated on Mon, Jun 14 2021 12:07 AM

Sakshi Editorial On Education System

మళ్లీ పాఠశాల చదువుల సమయం వచ్చేసింది. ఇప్పుడప్పుడే పిల్లల కోసం బడులు తెరిచే వాతావరణమయితే లేదు. ఈ సంవత్సరం కూడా దూరవిద్య, దృశ్యశ్రవణ పద్ధతిలో ఇంటర్నెట్, టెలివిజన్‌ మాధ్యమంగానే మొదలుపెట్టాలేమో? భౌతికంగా తరగతిగది పద్ధతి కనీసం వచ్చే సెప్టెంబరు, అక్టోబరు వరకు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. కోవిడ్‌–19 మూడో అల ముంచుకు వచ్చే ప్రమాదాన్ని వైద్యులతో సహా శాస్త్ర నిపుణులు అంచ నావేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలేం లేకపోయినా, రాబోయే అల పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపవచ్చనే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బడులు ఎలా మొదలవుతాయి? అన్నది చిక్కుప్రశ్నే! కానీ, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండటానికి వీలయిన పద్ధతిలో చదువులు ప్రారంభించాల్సిందే అన్నది విద్యారంగ నిపుణుల అభిప్రాయం! నిరుటి లాగే, ఈ నెల 16 నుంచి టీచర్లను రప్పించి డిజిటల్‌ పాఠాలను ప్రారంభించొచ్చని తెలంగాణ పాఠశాల విద్యా విభాగం ప్రభుత్వానికొక ప్రతిపాదన చేసింది. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలాఖరు వరకు వేసవి సెలవులు ముందే ప్రకటించారు. చివరి వారం సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నప్పటికీ దూరదర్శన్‌ ద్వారా, ఇతర డిజిటల్‌ పద్ధతుల్లో విద్యార్థులతో ఈనెల 12 నుంచే సంప్రదింపుల్లో ఉండండి అని రాష్ట్ర పాఠశాల విద్య పరిశోధన – శిక్షణ మండలి సూచించింది. గత విద్యా సంవత్సరం మొత్తం కరోనా ప్రభావంలోనే సాగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బడులు ప్రధానంగా టీవీ మాధ్యమంపై ఆధారపడి ఎలక్ట్రానిక్‌ బోధన (ఈ–లర్నింగ్‌) చేస్తే, ప్రయివేటు రంగంలో ఇంటర్నెట్‌ ఆధారిత ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. అదికూడా ఓ స్థాయి ఉన్న బడులే, ఎలక్ట్రానిక్‌ పద్ధతి గుడ్డిలో మెల్ల లాంటి స్థితే అయినా, కరోనా కష్టకాలంలో ఎదురైన సవాల్‌ను శాస్త్ర–సాంకేతికత వాడి సానుకూలం చేసుకునే సందర్భం వచ్చింది. కానీ, మనకున్న ఇంటర్నెట్‌ విస్తరణ లోపం, గ్రామీణ–పేద కుటుంబాల్లో సకల సౌకర్య (స్మార్ట్‌) ఫోన్‌ అందుబాటు పరిమితి, నిరంతర విద్యుత్‌ సౌకర్య లేమి.... వంటివి అవరోధంగా మారాయి. ఈ–బోధన... ఉన్నవారు, లేనివారి మధ్య అంతరాలని (డిజిటల్‌ డివైడ్‌) పెంచేదిగా ఉండకూడదనేది సమాజ హితైషుల మాట. ఆయా సదుపాయాలు, వాటిని సమకూర్చుకునే వనరులు లేని కుటుంబాల పిల్లలు నష్టపోయే విద్యా విధానాన్ని ఖరారు చేస్తే అది సామాజికంగా పెద్ద నష్టం.


ఎలక్ట్రానిక్‌ విద్యాబోధన పిల్లలకు ఏ మేర మేలు చేస్తోంది? ఎంత కీడు? అనే విషయమై దేశంలో పలు అధ్యయనాలు జరిగాయి. తరగతి గదికి ఇది సంపూర్ణ ప్రత్యామ్నాయం కాదనిధ్రువపడింది. శరీర పటుత్వం, సామాజిక స్పృహ, జీవన నైపుణ్యాలు వంటివి నేర్చుకోవడానికి ఇదొకటే అంత ఉపయుక్తం కాదు. మున్ముందు, కొంతమేర భౌతిక తరగతులు, మరికొంత ఆన్‌లైన్‌... హైబ్రిడ్‌ పద్ధతి మేలని స్పష్టమైంది. అభివృద్ధి సమాజాల్లో, మన దగ్గర కూడా సంపన్నవర్గ కుటుంబాల్లో వృత్తి విద్య, ఉన్నత–సాంకేతిక విద్యా విభాగాల్లో ఈ–బోధన ఐచ్ఛికంగా ఎప్పట్నుంచో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇది అందరికీ అవసరమనే వాదన బలపడుతోంది. ఇంత వేగంగా ఈ–లెర్నింగ్‌ పద్ధతి మనదేశంలో వచ్చేదో! కాదో? కానీ, కరోనా వల్ల అనివార్యమైంది. అంతటా ఉన్నట్టే ఇక్కడా... మంచి, చెడు రెండూ ఉన్నాయి. చెడును పరిహరించాలి. ధనిక–పేద వ్యత్యాసం విద్యార్థులు పొందిన లబ్ధిలోనూ కొట్టొచ్చినట్టు కనిపించింది. చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలు పొందినంత ప్రయోజనం నిరక్షరాస్యులైన వారి పిల్లలు పొందలేదు. ఉపాధ్యాయుల్లోనూ సామర్థ్యం ఉన్నవారు లేనివారు ఎవరో తేలిపోతు న్నారు. ఆన్‌లైన్‌ పద్ధతిలోనే కాకుండా కరోనా ప్రభావిత కాలంలో రేడియో, టీవీ, యూట్యూబ్‌ వంటి వేదికల మాధ్యమంగా పరోక్ష ఈ–విద్యాబోధన కొన్నిచోట్ల జరిగింది. చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ–బోధన మెరుగే! ప్రభుత్వ రంగంలో టీవీ మాధ్యమాన్ని గరిష్టంగా వాడుకున్నారు. తెలంగాణలో ‘టీ–సాట్‌’, ఏపీలో ‘మన టీవీ’ ఇందుకెంతో ఉపయోగపడ్డాయి. అన్నిస్థాయిల విద్యార్థుల కోసం రూపొందించిన పాఠాలను టీవీలో నిర్దిష్ట సమయంలో ప్రసారం చేయడమే కాక ప్రత్యేక వెబ్‌సైట్లలో, ‘యూట్యూబ్‌’ వంటి సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంచారు. ప్రయివేటు (32 లక్షలు), ప్రభుత్వం (28 లక్షలు)లో కలిపి తెలంగాణలో 60 లక్షల మంది స్కూలు విద్యార్థులుంటే ఏపీలో 70 (ప్రయివేటు 27, ప్రభుత్వ 43) లక్షల మంది ఉన్నారు. ఏ విధాన నిర్ణయమైనా ఇంత మంది భవిష్యత్తుతో ముడివడిందే!


విద్యుత్తు, మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాల అందుబాటే కీలకం కనుక నిర్దిష్ట వేళల్లోనే కాకుండా పిల్లలు వీలయినపుడు చూడగలిగేలా పాఠాలను అందించాలి. పేద, సామా జికంగా వెనుకబడిన, తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన కుటుంబాల పిల్లలు ఏ విధంగానూ నష్ట పోని పద్ధతుల్ని రూపొందించాలి. వీలయినంత వరకు అన్ని అంశాల్లో, అందరు ఉపాధ్యాయులు సామర్థ్యంతో పాఠాలు రూపొందించేలా చూడాలి. కొన్ని ప్రయివేటు బడులు మంచి పద్ధతులు పాటిస్తుంటే, కొన్నిచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులు చొరవతో విద్యార్థులకు మేలు జరిగే పద్ధతులు వినియోగిస్తున్నారు. మెరుగైన పద్ధతులు ఎక్కడున్నా ఇతర ప్రాంతాలకు విస్తరించాలి. రేపటి పౌరుల్ని నేడే తీర్చిదిద్దాలి! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement