‘చదువు మనిషిని పూర్తి మానవుడిగా తీర్చిదిద్దుతుంది; చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది; రాత కచ్చితమైన మానవునిగా తీర్చిదిద్దుతుంది’ అని పదహారో శతాబ్దినాటి బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ అన్నాడు. సమాజంలో మనిషి తలరాతను మార్చేది చదువు మాత్రమే! చదువుకు బాల్యంలోనే బలమైన పునాదులు పడాలి. అలా జరిగినప్పుడే భావిపౌరులు దేశానికి భాగ్యవిధాతలు కాగలుగుతారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గడచిన ఏడున్నర దశాబ్దాలలో ఊరూరా వీధిబడులు మొదలుకొని ప్రధాన పట్టణాల్లో విశ్వవిద్యాలయాల వరకు సంఖ్యాపరంగా చదువుల నెలవులు పెరిగాయి. చదువుల ధోరణిలో పెనుమార్పులే వచ్చాయి. గడచిన మూడు దశాబ్దాల కాలంలో ప్రైవేటు విద్యాసంస్థల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. వీటి ప్రభావంతో విద్యార్థుల మీద ర్యాంకుల కోసం ఒత్తిడి విపరీతంగా పెరిగింది. సిలబస్‌ను పూర్తిచేయడం, పరీక్షలకు సిద్ధం కావడం వరకే విద్యార్థుల జీవితాలు పరిమితమైనాయి. సిలబస్‌కు వెలుపల ఏమున్నదో పిల్లలను కన్నెత్తి చూడనివ్వని కట్టుదిట్టమైన కాపలాతో వర్ధిల్లే ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్ల ఘనత చెప్పాలంటే, ఒక గ్రంథమే అవుతుంది. సిలబస్ ఒత్తిడిలో నలిగిపోయిన పిల్లలు విజ్ఞాన వినోదాలను పంచిపెట్టే పుస్తకాలకు క్రమంగా దూరమయ్యే ధోరణి మొదలైంది. దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి! తెలుగునాట ఈ పరిస్థితికి పర్యవసానమే పిల్లల పత్రికలు మూతబడటం. కొన్నితరాల పాటు ఆబాల గోపాలాన్నీ ఉర్రూతలూగించిన ‘చందమామ’ వంటి పత్రికలు చరిత్రలో కలిసిపోయాయి. కొన ఊపిరితో మనుగడ సాగించిన ఒకటీ అరా పిల్లల పత్రికలు సైతం ‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు మూతబడ్డాయి.
టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు పిల్లలను చదువులకు దూరం చేస్తున్నాయనే వాదనలో నిజం లేకపోలేదు. ‘కరోనా’ లాక్‌డౌన్ కాలంలోనైతే, దాదాపు 65 శాతం పిల్లలు పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌లకు, ట్యాబ్‌లకు బానిసలుగా మారినట్లు జైపూర్ వైద్యనిపుణులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు వంటి పరికరాల్లో తెరపై ఆడే ఆటలకు బానిసలుగా మారిన పిల్లలు కనీసం అరగంటసేపైనా ఈ పరికరాలను విడిచిపెట్టి ఉండలేకపోతున్నారనీ, ఈ అలవాటును మాన్పించేందుకు తల్లిదండ్రులు వీటిని దూరంగా ఉంచినా, పిల్లలు హఠం చేసి సాధించుకునే పరిస్థితికి చేరుకున్నారనీ ఈ అధ్యయనంలో వెలుగులోకి రావడం ఆందోళనకరమైన పరిణామం. ఇలాంటి పరిణామాలకు పెద్దల పొరపాట్లే కారణం. పిల్లలను ఓపికగా దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చదివి వినిపించడం, వాళ్ల చేత చిన్ని చిన్ని పాటలు పాడించడం వంటి పనులు చేస్తున్న తల్లిదండ్రులు ఎందరు ఉంటున్నారు? దేశంలో ఎన్ని పాఠశాలలు లైబ్రరీ పీరియడ్‌ను నిర్వహిస్తున్నాయి? అసలు ఎన్ని పాఠశాలల్లో పిల్లలకు తగిన పుస్తకాలతో కూడిన లైబ్రరీలు ఉంటున్నాయి? ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు నామమాత్రంగానైనా ఉన్నాయేమో గాని, ప్రైవేటు పాఠశాలల్లో అవి మచ్చుకైనా కనిపించవు. చదువుకోదగ్గ వాతావరణమే అందుబాటులో లేని స్థితిలో పిల్లలు మాత్రమేం చేస్తారు? కంటికి ఎదురుగా కనిపించే టీవీలకే అతుక్కుపోతారు. చేతికి చిక్కిన స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే తమ జిజ్ఞాసను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిన పిల్లలకు స్కూళ్లలో బోధించే సిలబస్ మాత్రం ఏమంత బాగా తలకెక్కుతుంది? పిల్లల చదువుల తీరుతెన్నులపై జరిపిన సర్వేల్లో బయటపడిన వాస్తవాలను తెలుసుకుంటే, పిల్లల భవితవ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన కలగక మానదు. ఇందుకు ఉదాహరణగా ఒక సర్వే గురించి చెప్పుకుందాం. ఐదేళ్ల కిందట ‘స్కాలస్టిక్’, ‘యూ గావ్’ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో దేశంలో 6–17 ఏళ్ల వయసు వరకు గల పిల్లల్లో కేవలం 32 శాతం మందికి మాత్రమే సిలబస్‌కు వెలుపలి పుస్తకాలను చదివే అలవాటు ఉంది. పిల్లల్లో చదివే అలవాటు తగ్గుముఖం పడుతుండటానికి ముఖ్యంగా పాఠశాలల నిర్వాహకులనే తప్పుపట్టాలని ముంబైకి చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ ఫ్రాన్సిస్ స్వామి అభిప్రాయపడుతున్నారు.
పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది ‘వియ్ లవ్ రీడింగ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల లైబ్రరీలను పటిష్ఠపరచడం, పఠనోత్సవాలను నిర్వహించడం వంటి చర్య ద్వారా పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహించడానికి చేపట్టిన ఈ మంచి కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించిన వెనువెంటనే సత్వర ఫలితాల కోసం ఆత్రపడకుండా, మొక్కవోని దీక్షతో కొనసాగిస్తే, తప్పకుండా సత్ఫలితాలే లభిస్తాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా పిల్లల్లో పఠనాభిలాషను, చదివే అలవాటును పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేపడితే, కొన్నేళ్ల తర్వాతనైనా సంపూర్ణ విద్యావంతులైన తరం తయారవుతుంది. పిల్లల్లో పఠనాభిలాష పెంచేందుకు రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాలకు చేయూతనివ్వడానికి కేంద్రప్రభుత్వం కూడా ముందుకు రావాలి. బాలసాహిత్య సృజనను, ప్రచురణను ప్రోత్సహించాలి. ఈ–తరం పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనివార్యంగా మారిన విషయం వాస్తవమే అయినా, పుస్తకాలను మింగేసేంతగా వీటి వినియోగం పెరిగిపోయే పరిస్థితులను నిరోధించవలసిన బాధ్యత పూర్తిగా పెద్దల మీదే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే గురుతర పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే, భావిపౌరుల భవితవ్యాన్ని తీర్చిదిద్దాల్సింది వాళ్లే!
చదువుతోనే సంపూర్ణత్వం
Published Mon, Nov 15 2021 1:02 AM | Last Updated on Mon, Nov 15 2021 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment