చేతిలో మొబైల్ ఫోనుతో సిగ్నల్స్ సరిగ్గా వచ్చే గుట్టల మీద కూర్చున్న పిల్లలు... ఫుట్‌పాత్ మీద అమ్మ వ్యాపారం చూసుకుంటుంటే రోడ్డు వారగా చిన్న ఫోనుతో కుస్తీ పడుతున్న అమ్మాయిలు... కరోనా కష్టకాలంలో సాయంత్రాలు పనిచేసుకుంటూ, పగలు వీలున్నప్పుడు పాఠాలు వింటున్న అబ్బాయిలు... ఇవి దేశమంతటా కనిపిస్తున్న దృశ్యాలు. మారిన పరిస్థితుల్లో మారిపోయిన విద్యాభ్యాసపు విషాద ముఖచిత్రాలు. కరోనా అనంతర కొత్త కాలంలో బడి చదువులు పోయి, ఈ–చదువులు తప్పనిసరయ్యాక విద్యారంగం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్ళకు ఇవి ఆనవాళ్ళు.
గణాంకాలు అసలుకథను మరింత స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో సగటున 37 శాతం స్కూళ్ళలోనే పనిచేసే కంప్యూటర్లున్నాయి. 22 శాతం బడుల్లోనే ఇంటర్నెట్ వసతి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కలిపితేనే ఈ లెక్క. ప్రభుత్వ స్కూళ్ళ లెక్కతీస్తే 11 శాతం బడుల్లోనే ఇంటర్నెట్, 28.5 శాతం విద్యాలయాల్లోనే కంప్యూటర్లు ఉన్నాయనేది చేదు నిజం. దేశంలోని దాదాపు 15 లక్షలకు పైగా పాఠశాలలు, 8.5 కోట్ల మంది అధ్యాపకులు, 26 కోట్ల మందికి పైగా బడి పిల్లల నుంచి సేకరించిన డేటా ఇది. కరోనా రాక ముందు 2019–20 విద్యాసంవత్సరపు ఈ డేటా ఇప్పుడు కీలకమైంది. ఎందు కంటే, కరోనా వేళ పాఠశాల ముఖం చూసే పరిస్థితి లేని దేశంలోని 26 కోట్ల మందికి పైగా ఈ బడి పిల్లలకు ఈ–చదువులే శరణ్యం. ఇప్పటికీ ఎప్పుడు ఎన్నో కరోనా ఉద్ధృతి మీద పడుతుందో తెలియని భయాలు. అందుకే, ప్రత్యక్ష తరగతులకు తోడు డిజిటల్ తరగతుల మిశ్రమ అధ్యయన, అభ్యసన విధానం తప్పదు. కానీ, సాంకేతిక వసతులు, భారతీయ భాషల్లో నాణ్యమైన డిజిటల్ పాఠాలు కొరవడిన ఈ బడులలో పాఠాలు చెప్పేదెట్టా? కంప్యూటర్లు, ఇంటర్నెట్ కాదు కదా కనీసం మొబైల్ ఫోన్లు కూడా కరవైన బడుగు పిల్లల చదువులు సాగేదెట్టా?
తరాలు మారుతున్నా ఆర్థిక అంతరాలే ఇప్పటికీ సమసిపోని సమాజం మనది. ఇప్పుడు ఈ సాంకేతిక అంతరం సరికొత్త సవాలు. సామాన్య ప్రజానీకంలో సింహభాగం ఆర్థికంగానే కాదు, డిజిటల్ వసతులలోనూ వెనుకబడ్డారు. కులం, ప్రాంతం, ధనిక – పేద వర్గం, లింగ భేదం – ఇలాంటి వ్యవస్థాగతమైన సంక్లిష్ట కోణాలెన్నో ఈ డిజిటల్ అంతరంలో భాగం. కరోనా దెబ్బతో దేశంలోని డిజిటల్ అంతరం బట్టబయలైంది. కేవలం మూడో వంతు మంది పిల్లలే ఇప్పుడు ఆన్‌లైన్‌లో చదువు కొనసాగిస్తున్నారు. ఇదీ గత అక్టోబర్‌లో విడుదలైన వార్షిక స్థాయి విద్యా నివేదిక వెల్లడించిన పరిస్థితి. అంటే, ఎంతోమంది అర్ధంతరంగా బడి చదువుకు స్వస్తి చెబుతున్న దుఃస్థితి. ఫీజుల చెల్లింపులు లేక, ఖర్చులు భరించలేక దేశంలో 15 లక్షల పైగా ప్రైవేట్ స్కూళ్ళు నిరుడు మూతబడ్డాయి. విద్యారంగంలోని ఈ క్లిష్టపరిస్థితుల్లో డిజిటల్ అంతరాన్ని పోగొట్టడం పాలకుల తక్షణ బృహత్ కర్తవ్యమైంది. ఈ–చదువులకు సమకూర్చాల్సిన వసతులు, అందించాల్సిన నైపుణ్యాల మీద దృష్టి పెట్టడం అత్యవసరమైంది. కానీ, ఇక్కడే అసలు సమస్య ఉంది.
తినడానికి తిండిగింజలు దొరకని బతుకుల్లో... డిజిటల్ తరగతులతో ప్రాథమిక విద్యా హక్కును సాకారం చేయాలనుకోవడం ఎంత బలమైన పాలకులకైనా భగీరథ ప్రయత్నమే. కానీ, సంకల్పం ముఖ్యం. వివిధ భాషల్లో క్యూఆర్ కోడ్ ఉన్న పాఠ్యపుస్తకాల రూపకల్పన, డిజిటల్ విద్యావేదికల ఏర్పాటు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. కానీ, అవి చాలవు. గ్రామాలన్నిటికీ బ్రాడ్ బ్యాండ్ వసతి కల్పన కోసం సరిగ్గా ఏణ్ణర్ధం కితం 7 లక్షల కోట్లతో కేంద్రం ‘జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్’ను ఆర్భాటంగా ఆరంభించింది. వెయ్యి రోజుల్లో 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామన్నది క్రితం నిరుడు ఆగస్టులో సాక్షాత్తూ ప్రధాని ఇచ్చిన హామీ. ఇప్పుడు వాగ్దానాల అమలులో వేగం పెంచాలి. అలాగే చిరకాలంగా ఉన్న బి.ఎస్. ఎన్.ఎల్. లాంటి విస్తృత నెట్‌వర్క్‌ను సమర్థంగా వాడుకోవాలి. అప్పుడు పాఠశాలలకు నెట్ వసతి అందించడం కేంద్రానికి అసాధ్యం కాదు. మరోపక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత మొదలు పౌరసమాజ విరాళాలతో పాఠశాలకు కంప్యూటర్లు సమకూర్చవచ్చు. ఇలాంటి చర్యలు డిజిటల్ చదువుల అవసరాలను తీరుస్తాయి. ఈ ప్రాథమిక వసతుల కల్పన దీర్ఘకాలం పడుతుంది గనక, తక్షణమే చదువుల్లో అంతరాలు తొలగించడానికి ఉచిత యూనిఫామ్, ఉచిత భోజనం లానే చిన్నపాటి స్మార్ట్ పరికరాలను అందిస్తే బాగుంటుందని విశ్లేషకుల మాట.
ఏమైనా, ఒక రకంగా కరోనా మనకు ఓ మేలుకొలుపు. అనేక ప్రాథమిక రంగాల్లో మన వ్యవస్థాగత లోపాలను అది నగ్నంగా నిలబెట్టింది. ఇవాళ్టికీ విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి అనేక కీలక అంశాల్లో... మన అవసరాలకూ, అందుబాటులో ఉన్న వస తులకూ అగాధమంత లోటు ఉందని తేల్చిచెప్పింది. ఏలికల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఇప్పుడిక ఈ ఉదాసీనతను వదిలించుకోవడమే మిగిలింది. కరోనా అనంతర న్యూ నార్మల్‌లో ఈ–చదువులు ఇక జీవితంలో అనివార్యం. అవిభాజ్యం. పాలకులు అది గుర్తెరగాలి, పాఠశాలలన్నిటికీ అత్యవసర సేవల కింద ఇంటర్నెట్ వసతులు కల్పించాలి. వాటితో పిల్లలకు చేరువయ్యేలా అధ్యాపకులకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాలి. డిజిటల్ ఇండియా లాంటి బృహత్తర ఆశయాలకు ఇది తొలి అడుగు అయితేనే, భావి పౌరులకు విద్యోదయం! భారతావనికి అసలైన ఉషోదయం!!
Comments
Please login to add a commentAdd a comment