సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఎకరం భూమి అంటే వేలల్లో.. ఆనక లక్షకో, రెండు లక్షలకో వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో మారుమూల కూడా ఇరవై, ముప్పై లక్షలు లేకుంటే భూమివైపు చూసే పరిస్థితి లేదు. హైదరాబాద్‌లో, చుట్టుపక్కల అయితే కోట్లు పెట్టినా స్థలం దొరకడం కష్టమే. ఇప్పుడు కోకాపేటలో భూముల ధరలు అలాంటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాయి. నియోపోలిస్ లేఅవుట్‌లో ఎకరానికి ఏకంగా రూ.100.75 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది.
హెచ్‌ఎండీఏ ఇదే లేఅవుట్‌లో ఇంతకుముందు నిర్వహించిన వేలంలో ఎకరానికి గరిష్టంగా రూ.60 కోట్ల రేటు పలకగా.. గురువారం నాటి రెండోదశ దాన్ని మించిపోయింది. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థల నుంచి అనూహ్య పోటీ కనిపించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదే అత్యధికమని ఆ రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. ఎకరానికి రూ.వంద కోట్లకుపైగా ధర పలకడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ చర్చనీయాంశమైందని అంటున్నారు.
రెండు విడతలుగా బిడ్డింగ్..
నియోపోలిస్‌లో 7 ప్లాట్లలోని భూములకు గురువారం ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. హెచ్‌ఎండీఏ అన్ని ప్లాట్లలో భూములకు ఎకరానికి రూ.35 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో తొలి నుంచీ ఉత్కంఠభరిత పోటీ కనిపించింది. కనిష్టంగా ఎకరానికి రూ.67.25 కోట్ల నుంచి గరిష్టంగా రూ.100.75 కోట్ల వరకు ధర పలికింది.
సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున లభించినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రకటించారు. గురువారం మొత్తం 45.33 ఎకరాల భూములకు వేలం నిర్వహించగా రూ.3,319.60 కోట్ల ఆదాయం లభించినట్టు తెలిపారు. హెచ్‌ఎండీఏ ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన భూముల వేలంపై వచ్చిన ఆదాయం కంటే ఇదే ఎక్కువని వివరించారు.
ప్రత్యేక అనుమతులతో డిమాండ్
హైదరాబాద్ నగరానికి పడమటి వైపు ఉన్న కోకాపేట్ అంతర్జాతీయ హంగులతో దేశవిదేశాలకు చెందిన వ్యాపార సంస్థలను ఆకట్టుకుంటోంది. ఇక్కడ భవన నిర్మాణాలకు సంబంధించి అంతస్తులపై పరిమితి లేదు. అపరిమితంగా అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఉండటం.. గృహ, వాణిజ్యం, వ్యాపారం వంటి అన్నిరకాల వినియోగానికి అనుమతి ఉండటం.. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు కోకాపేట్‌పై దృష్టి సారించడానికి కారణమైంది.
ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిర్మించతలపెట్టిన మెట్రో రైల్‌కు నియోపోలిస్ లేఅవుట్ అందుబాటులో ఉండటం మరింత డిమాండ్ పెంచింది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సొసైటీతోపాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఫార్చూన్ 500 కంపెనీలు కూడా నియోపోలిస్ లేఅవుట్‌కు చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.
భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలతో..
హెచ్‌ఎండీఏ నియోపోలిస్ లేఅవుట్‌ను సుమారు రూ.300 కోట్లతో భారీ స్థాయిలో, ఉత్తమ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసింది. విశాలమైన రహదారులు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ తొలిదశలో ఒకటి నుంచి ఐదో ప్లాట్ వరకు మొత్తంగా 64 ఎకరాలను విక్రయించారు. ప్రస్తుతం 6, 7, 8, 9, 10, 11, 14వ నంబర్ ప్లాట్లలోని 45.33 ఎకరాలను వేలం వేశారు. ఈ ప్లాట్లు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల వరకు ఉన్నాయి.
నియోపోలిస్ లేఅవుట్ విశేషాలివీ..
► నియోపోలిస్ లేఅవుట్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 40 ఎకరాల భూమిని అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకోసమే వినియోగించడం గమనార్హం.
► సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, ఇతర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్ల వెడల్పున్న అంతర్గత రోడ్లను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, ఇతర సదుపాయాలను సమకూర్చారు. ఇక్కడ కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర అన్నిరకాల వినియోగానికి ముందస్తు అనుమతులు ఇచ్చారు.
► నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించేందుకు అనుమతి ఉంటుంది.
► ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనేలా రోడ్డు నెట్‌వర్క్ అందుబాటులో ఉంది.
ప్లాట్ నంబర్–10కు ఎందుకంత క్రేజ్
హెచ్‌ఎండీఏ గురువారం మొత్తం ఏడు ప్లాట్లను వేలం వేసినా.. అందులో 10వ నంబర్ ప్లాట్‌కు మాత్రం బాగా డిమాండ్ వచ్చింది. 3.60 ఎకరాల విస్తీర్ణమున్న ఈ ప్లాట్‌ను హ్యాపీ హైట్స్ నియోపొలిస్, రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థలు కలసి ఏకంగా ఎకరానికి రూ.100.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. ఈ ప్లాట్ మిగతా ప్లాట్ల కంటే ఎత్తులో ఉంటుంది. దీనికి వెనక వైపు నుంచి గండిపేట చెరువు, ముందు నుంచి హైదరాబాద్ నగరం వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది.
అందువల్లే ఈ ప్లాట్‌కు పోటాపోటీ వేలం జరిగిందని ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్లాట్‌ను ఆనుకొని ఉన్న 11వ నంబర్ ప్లాట్‌లో 7.53 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఎకరం రూ.67.25 కోట్ల ధరతో ఏపీఆర్ గ్రూప్ సొంతం చేసుకుంది. పక్కపక్కనే ఉన్న రెండు ప్లాట్ల మధ్య ఎకరానికి రూ.33.5 కోట్ల తేడా ఉండటం గమనార్హం.
ప్లాట్–10 స్థలంలో రెండు హైరైజ్ టవర్లను నిర్మించేందుకు రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇదేకాదు.. ప్రస్తుతం కోకాపేటలో నిర్మితమవుతున్న భవనాల్లో చాలా వరకు ఆకాశ హరŠామ్యలేనని.. ఈ ప్రాంతం మినీ షాంఘైగా మారనుందని రియల్‌ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.
Hyderabad: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు
Published Fri, Aug 4 2023 3:15 AM | Last Updated on Fri, Aug 4 2023 4:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment