రక్తదానం చేసిన కార్యకర్తలకు సర్టిఫికెట్ అందజేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కంటోన్మెంట్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం.. కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం బోయిన్‌పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అవినీతి వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 12వ తేదీన విచారణ ఉందని ఈ లోపే దాని పేరుని బీఆర్‌ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం సరి కాదన్నారు. ’’2017లో బంగారు కూలీల పేరుతో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాపారస్తుల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. దీనిపై నేను ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో. టీఆర్‌ఎస్ పార్టీ పై చర్యలు తీసుకోవాల్సిందిగా 2018లోనే హైకోర్టు ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలిచ్చింది.
ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో తాజాగా డిసెంబర్ 6న మరోసారి ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాను. డిసెంబర్ 7న నోటీసు వెళ్లగా సోమవారం రోజు విచారణకు వచ్చే అవకాశముంది. ఇంతలోనే ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్ పేరు మారుస్తూ లేఖ పంపడం దారుణం.’’అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్‌ఎస్‌కి సహకరించిందని ఆరోపించారు.
నిజంగా బీజేపీ కేసీఆర్‌పై చర్య లు తీసుకోవాలని భావిస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదో జవాబు చెప్పా లని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఏర్పాటుతో కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో, తెలంగాణ రాష్ట్రంతో పేరు బంధం కూడా తెగిపోయిందన్నారు. కేసీఆర్ ఎన్నికల సంఘానికి పెట్టుకున్న దరఖాస్తులో కూడా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అని పేర్కొనడాన్ని ఆయన ఎత్తిచూపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని ఆయన ఆరోపించారు.
ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు
ఇటీవల మృతి చెందిన వందమంది కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున రాజీవ్ గాంధీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మ య్య, షబ్బీర్‌అలీ, ఏఐసీసీకార్యదర్శి నదీమ్ జావిద్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కవితకు ఓ న్యాయం.. కనిమొళికో న్యాయమా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పట్ల ఓ రకంగా.. మిగతా వారి పట్ల మరో రకంగా అధికారులు ప్రవరిస్తున్నారని రేవంత్ నిందించారు. తమిళనాడు మాజీ సీఎం కుమార్తె కనిమొళికి ఓ న్యాయం, కవితకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారిని ఢిల్లీలో విచారణకు పిలిచి, కవిత వివరణ మాత్రం ఆమె కోరుకున్న సమయానికి తీసుకుంటామనడం టీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర సహకారానికి నిదర్శనమన్నారు.
ఆ పార్టీలు బీజేపీ ఏజెంట్లు
దేశంలో బీజేపీ అధికారాన్ని పదిలంగా ఉంచేందుకు ఎంఐఎం, ఆప్, బీఆర్‌ఎస్ పనిచేస్తున్నా యని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముంబై భాషలో చెప్పాలంటే అసదుద్దీన్ ఒవైసీ, కేజ్రీవాల్, కేసీఆర్‌లు సుపారీ కిల్లర్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌లో మీడియా తో మాట్లాడారు. అంబానీ, అదానీల కోసం నల్లచట్టాలు చేసిన మోదీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ అనుకూలంగా ఓటు వేసిందని నిందించారు.
కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని హామీనిచ్చారు. రైతులను పొట్టనబెట్టుకున్న రాక్షసుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్‌కు కాలం చెల్లడంతో బీఆర్‌ఎస్ అనే మారువేషంతో వస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment