sonia gandhi birthday
-
బీఆర్ఎస్ ప్రకటన కోర్టు ధిక్కరణే : రేవంత్ రెడ్డి
కంటోన్మెంట్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం.. కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం బోయిన్‌పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అవినీతి వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 12వ తేదీన విచారణ ఉందని ఈ లోపే దాని పేరుని బీఆర్ఎస్గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం సరి కాదన్నారు. ’’2017లో బంగారు కూలీల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాపారస్తుల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. దీనిపై నేను ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో. టీఆర్ఎస్ పార్టీ పై చర్యలు తీసుకోవాల్సిందిగా 2018లోనే హైకోర్టు ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలిచ్చింది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో తాజాగా డిసెంబర్ 6న మరోసారి ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాను. డిసెంబర్ 7న నోటీసు వెళ్లగా సోమవారం రోజు విచారణకు వచ్చే అవకాశముంది. ఇంతలోనే ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు మారుస్తూ లేఖ పంపడం దారుణం.’’అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్ఎస్కి సహకరించిందని ఆరోపించారు. నిజంగా బీజేపీ కేసీఆర్‌పై చర్య లు తీసుకోవాలని భావిస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదో జవాబు చెప్పా లని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో, తెలంగాణ రాష్ట్రంతో పేరు బంధం కూడా తెగిపోయిందన్నారు. కేసీఆర్ ఎన్నికల సంఘానికి పెట్టుకున్న దరఖాస్తులో కూడా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అని పేర్కొనడాన్ని ఆయన ఎత్తిచూపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని ఆయన ఆరోపించారు. ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు ఇటీవల మృతి చెందిన వందమంది కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున రాజీవ్ గాంధీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మ య్య, షబ్బీర్‌అలీ, ఏఐసీసీకార్యదర్శి నదీమ్ జావిద్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కవితకు ఓ న్యాయం.. కనిమొళికో న్యాయమా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పట్ల ఓ రకంగా.. మిగతా వారి పట్ల మరో రకంగా అధికారులు ప్రవరిస్తున్నారని రేవంత్ నిందించారు. తమిళనాడు మాజీ సీఎం కుమార్తె కనిమొళికి ఓ న్యాయం, కవితకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారిని ఢిల్లీలో విచారణకు పిలిచి, కవిత వివరణ మాత్రం ఆమె కోరుకున్న సమయానికి తీసుకుంటామనడం టీఆర్ఎస్, బీజేపీ పరస్పర సహకారానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీలు బీజేపీ ఏజెంట్లు దేశంలో బీజేపీ అధికారాన్ని పదిలంగా ఉంచేందుకు ఎంఐఎం, ఆప్, బీఆర్ఎస్ పనిచేస్తున్నా యని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముంబై భాషలో చెప్పాలంటే అసదుద్దీన్ ఒవైసీ, కేజ్రీవాల్, కేసీఆర్‌లు సుపారీ కిల్లర్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌లో మీడియా తో మాట్లాడారు. అంబానీ, అదానీల కోసం నల్లచట్టాలు చేసిన మోదీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ అనుకూలంగా ఓటు వేసిందని నిందించారు. కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని హామీనిచ్చారు. రైతులను పొట్టనబెట్టుకున్న రాక్షసుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్‌కు కాలం చెల్లడంతో బీఆర్ఎస్ అనే మారువేషంతో వస్తున్నారని ధ్వజమెత్తారు. -
కడవరకూ కాంగ్రెస్‌లోనే..: ఎమ్మెల్యే వీరయ్య
మణుగూరు టౌన్: బతికున్నంత కాలం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టంచేశారు. మణుగూరులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం ప్రజలే తనకు దేవుళ్లని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం, దేశంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్లో బీజేపీ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం అంతటా ఉండదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్(యూపీఏ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం 76వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తో పాటు పలువురు నేతలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు సందర్భంగా యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ ట్వీట్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ సైతం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌కు సోనియా.. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతున్న క్రమంలో గురువారం జైపూర్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. గురువారం జైపూర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సవాయ్ మాధాపుర్కు చేరుకున్నారు. షేర్ బాఘ్ హోటల్లో శుక్రవారం సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కూతురు ప్రియాంక గాంధీ సైతం సవాయ్ మాధాపూర్‌కు చేరుకున్నారని చెప్పారు. ‘వారు రంథాంభోర్లో ఉంటారు. డిసెంబర్ 9న అక్కడే సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఉంటాయి. ’ అని తెలిపారు. ఇదీ చదవండి: ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం -
సోనియా బర్త్‌డే... ‘అనంత’లో బ్లాక్‌డే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కారణమైన సోనియాగాంధీ జన్మదినం(9వ తేదీ)ను బ్లాక్‌డేగా పరిగణించి, జిల్లా బంద్ చేపట్టాలని ‘అనంత’ సంయుక్త కార్యాచరణ వేదిక (సంయుక్త జేఏసీ) నిర్ణయించింది. సోమవారం విద్రోహదినంగా పాటిస్తూ అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలతో కలిసి నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం నగరంలోని మేడా కన్వెన్షన్ హాలులో న్యాయవాదుల జేఏసీ నేతలు కొత్త విశ్వనాథ్‌రెడ్డి, రామ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీలు, యువ, కుల సంఘాలు, పొలిటికల్, నాన్‌పొలిటికల్ జేఏసీల నేతలు హాజరయ్యారు. బంద్ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి 130 రోజులుగా జిల్లాలో అన్ని వర్గాలు చేస్తున్న ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ... కీలకమైన ఈ పరిస్థితుల్లో మరింత ఉధృతం చేసి ఉద్యమ సెగను ఢిల్లీకి తాకించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సంకల్పించారు. ఉద్యమం చివరిఘట్టంలో ఉన్నందున కలసివచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. జెండా, అజెండాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు కలసిరావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉద్యమాన్ని అణచివేసే దిశగా పోలీసు యంత్రాంగం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని పలువురు నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వసతి గృహం, ఎస్కేయూ విద్యార్థులను నిర్బంధించడం తగదన్నారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన తరువాత సమైక్యవాదులందరూ ఏకతాటిపై ఉద్యమించడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యమం మరోసారి అవసరమన్నారు. రాయల తెలంగాణ లేదా మరో ప్రతిపాదన లేకుండా సమైక్యాంధ్ర నినాదంతోనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో వివిధ జేఏసీల నాయకులు బోరంపల్లి ఆంజనేయులు, మునిరత్నం శ్రీనివాసులు, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణవేణి, యు.రాజేశ్వరి, దేవళ్ల మురళీ, సగర శ్రీకాంత్, వశికేరి శివ, బీఎస్ఎన్ఎల్ రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, జగదీష్, మేడా రమణ, హెచ్ఎన్ఎస్ఎస్ మనోహరరెడ్డి, రేణుకాదేవి, శ్రీధర్, వాసుప్రకాశ్, మహబూబ్‌బాషా, శివప్రకాశ్, ఎస్వీ సత్యనారాయణగుప్తా, ప్రతాప్, కుసుమ పుల్లారెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణ, జేబీ సురేష్, నాగరాజు, ముక్తియార్ పాల్గొన్నారు.