సోనియా బర్త్‌డే... ‘అనంత’లో బ్లాక్‌డే | sonia gandhi birthday is black day in anathapur | Sakshi
Sakshi News home page

సోనియా బర్త్‌డే... ‘అనంత’లో బ్లాక్‌డే

Published Sun, Dec 8 2013 4:19 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

sonia gandhi birthday is black day in anathapur

 అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కారణమైన  సోనియాగాంధీ జన్మదినం(9వ తేదీ)ను బ్లాక్‌డేగా పరిగణించి, జిల్లా బంద్ చేపట్టాలని ‘అనంత’ సంయుక్త కార్యాచరణ వేదిక (సంయుక్త జేఏసీ) నిర్ణయించింది. సోమవారం విద్రోహదినంగా పాటిస్తూ అన్ని ఉద్యోగ సంఘాలు,  రాజకీయ పార్టీలు, ప్రజలతో కలిసి నల్లజెండాలు, బ్యాడ్జీలతో  నిరసన తెలపాలని పిలుపునిచ్చింది.  శనివారం సాయంత్రం నగరంలోని మేడా కన్వెన్షన్ హాలులో న్యాయవాదుల జేఏసీ నేతలు కొత్త విశ్వనాథ్‌రెడ్డి, రామ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీలు, యువ, కుల సంఘాలు, పొలిటికల్, నాన్‌పొలిటికల్ జేఏసీల నేతలు హాజరయ్యారు. బంద్ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు.

 రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి 130 రోజులుగా జిల్లాలో అన్ని వర్గాలు చేస్తున్న ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ... కీలకమైన ఈ పరిస్థితుల్లో మరింత ఉధృతం చేసి ఉద్యమ సెగను ఢిల్లీకి తాకించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సంకల్పించారు.   ఉద్యమం చివరిఘట్టంలో ఉన్నందున కలసివచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. జెండా, అజెండాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు కలసిరావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉద్యమాన్ని అణచివేసే దిశగా పోలీసు యంత్రాంగం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని పలువురు నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వసతి గృహం, ఎస్కేయూ విద్యార్థులను నిర్బంధించడం తగదన్నారు.   2009 డిసెంబర్ 9న ప్రకటన తరువాత సమైక్యవాదులందరూ ఏకతాటిపై ఉద్యమించడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యమం మరోసారి అవసరమన్నారు.

రాయల తెలంగాణ లేదా మరో ప్రతిపాదన లేకుండా సమైక్యాంధ్ర నినాదంతోనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.  సమావేశంలో వివిధ జేఏసీల నాయకులు బోరంపల్లి ఆంజనేయులు, మునిరత్నం శ్రీనివాసులు, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణవేణి, యు.రాజేశ్వరి, దేవళ్ల మురళీ, సగర శ్రీకాంత్, వశికేరి శివ, బీఎస్‌ఎన్‌ఎల్ రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, జగదీష్, మేడా రమణ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ మనోహరరెడ్డి, రేణుకాదేవి, శ్రీధర్, వాసుప్రకాశ్, మహబూబ్‌బాషా,  శివప్రకాశ్, ఎస్‌వీ సత్యనారాయణగుప్తా,  ప్రతాప్, కుసుమ పుల్లారెడ్డి,  సత్యనారాయణ,  రామకృష్ణ, జేబీ సురేష్, నాగరాజు, ముక్తియార్  పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement