కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌..  80 సీట్లకు తక్కువ వస్తే దేనికైనా సిద్ధం | Revanth reddy Comments On BRS KCR Narayanakhed Nizamabad | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌..  80 సీట్లకు తక్కువ వస్తే దేనికైనా సిద్ధం

Published Wed, Nov 22 2023 5:59 PM | Last Updated on Wed, Nov 22 2023 7:24 PM

Revanth reddy Comments On BRS KCR Narayanakhed Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌/ నారాయణ్‌ఖేడ్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.  నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడుతూ.. ఎంపీగా కవితను ఓడించారని కేసీఆర్‌ నిజామాబాద్‌పై పగ పట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి గెలిచిన ఎంపీ జాడ లేకుండా పోయాడని ధర్మపురి అర్వింద్‌ను ఉద్ధేశించి విమర్శించారు. 

కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రేవంత్‌ మండిపడ్డారు. పదవి పోతుందన్న భయంతో సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80కి పైగా సీట్లలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న రేవంత్‌.. 80 సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్‌ వేసే శిక్షకు నేను సిద్ధమని సవాల్‌ విసిరారు.

వంద రోజుల్లో షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పి పదేళ్లు గడిచిందని.. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకూ చక్కెర పరిశ్రమను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు.  బీఆర్‌ఎస్‌  పాలనలో మద్దతు ధర అడిగిన ఎర్రజొన్న రైతులపై పోలీసు కేసులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారని అన్నారు. రైతుల భూములు మింగేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌ బక్కపలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని, వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు, కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ పడతారని విమర్శించారు.
చదవండి: రేవంత్‌ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్‌

నారాయణ్‌ఖేడ్‌ గడ్డపై కాంగ్రెస్‌ గెలుపు ఖాయం: రేవంత్‌
‘మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నాడు అప్పారావు షెట్కార్, శివరాజ్ షెట్కార్. స్వాతంత్ర్యం  కోసం నినదించిన కుటుంబం షెట్కాట్ కుటుంబం. అలాంటి కుటుంబానికి చెందిన సురేష్ షెట్కార్‌ను పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత మాది. అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్‌తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరు. 

బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నావా? నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తాం. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement