సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులను రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కానీ, నవంబర్ 30న పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కానీ విడుదల చేసేలా జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. పింఛన్లు మినహా ఇతర నగదు ప్రయోజనాల పంపిణీని నోటిఫికేషన్ రోజు నుండి పోలింగ్ రోజు వరకు 27 రోజుల పాటు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతుబంధు పథకం రెండోవిడత నిధులను ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలిపారు. నోటి ఫికేషన్ విడుదలైన తర్వాత నిధులు విడుదల చేయడం ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున రైతుబంధు నిధులు విడు దల చేసి ఓటర్లను ప్రభావితం చేశారని ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సల్మాన్ ఖుర్షిద్, జైరామ్ రమేష్లు బుధవారం ఢిల్లీలో ఈసీని కలిశారు. ఈ భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.
కేసీఆర్ ప్రైవేట్ సైనికులుగా..: రేవంత్
రాష్ట్రంలోని కొంతమంది అధికారులను బీఆర్‌ఎస్ సొంత పార్టీ నాయకులు మాదిరి ఉపయోగించుకుంటోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో పాటు రిటైర్డ్ ఆఫీసర్లు వేణుగోపాలరావు, నర్సింగరావు, భుజంగరావు, జగన్మోహన్ రావులు ఈ జాబితాలో ఉన్నారన్నారు. సర్విసులో ఉన్న వాళ్లను సిట్, ఇంటెలిజెన్స్‌లో నియమించి ప్రతిపక్ష పార్టీలపై నిఘా పెట్టాల్సిందిగా ఆదేశించారని, టెలిఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ అధికారులందరూ కేసీఆర్ ప్రైవేట్ సైనికులుగా పనిచేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారులు అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్, స్మిత సబర్వాల్, రాజశేఖర్‌లు బీఆర్‌ఎస్ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. దీర్ఘకాలంగా ఒకే పదవిలో కొనసాగుతున్న వారిపై దృష్టి పెట్టాల్సిందిగా ఈసీని కోరామన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం, లిక్కర్ సరఫరా విపరీతంగా జరుగుతోందని, గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో 20 రోజుల్లో రూ.300 కోట్ల మద్యం అమ్మారని అన్నారు. ఓటర్లను మద్యంలో ముంచి ఓట్లు వేయించుకోవా లని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నామినేషన్లు మొదలు ఓటింగ్ ముగిసేవరకు మద్యాన్ని నిషేధించాల్సిందిగా ఈసీని కోరినట్లు తెలిపారు.
ఖర్గే కార్యక్రమాల సమన్వయకర్తగా...
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమాల సమన్వయకర్తగా ఏఐసీసీ కార్యదర్శి బీఎం సందీప్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్‌ఎస్‌పై ఫిర్యాదు: ఉత్తమ్
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలు అత్యంత అవినీతిమయంగా మారాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలమైన అధికారులను కీలక ఎన్నికల విధుల్లో పెట్టడంపై ఫి ర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వ భవనాలైన ముఖ్యమంత్రి అధికారిక నివాసం, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారని కూడా ఫిర్యాదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment