సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా రాష్ట్ర మంత్రివర్గంలోని 17 మంది మంత్రులకుగాను 14 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ 14 మందిలో ఎనిమిది మంది విజయం సాధించగా, ఆరుగురు ఓటమి పాలయ్యారు. మిగతా ముగ్గురు మంత్రులు మహమూద్ అలీ (హోం), సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమం), పట్నం మహేందర్‌రెడ్డి (సమాచార, పౌర సంబంధాలు) శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), పువ్వాడ అజయ్ (ఖమ్మం), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) ఓటమి పాలయ్యారు. మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), గంగుల కమలాకర్ (కరీంనగర్), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట) విజయం సాధించారు.
కామారెడ్డిలో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ: సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీచేశారు. వీటిలో కామారెడ్డిలో పరాజయం పాలుకాగా.. గజ్వేల్‌లో మాత్రం వరుసగా మూడోసారి విజయం సాధించారు. కేసీఆర్ గత 40 ఏళ్లలో తొలిసారి ఒక ఎన్నికలో ఓడిపోవడం గమనార్హం. 1983లో తొలిసారిగా సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 1985, 1989, 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్‌ఎస్ స్థాపించాక 2001 ఉపఎన్నిక, 2004 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.
2004లో కరీంనగర్ ఎంపీగానూ పోటీ చేసి గెలవడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2006, 2008లలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కరీంనగర్‌లో గెలిచారు. 2009లో మహబూబ్‌నగర్, 2014లో మెదక్ ఎంపీగానూ విజయం సాధించారు. 2014, 2018తోపాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నాటి తొలి ఓటమి తర్వాత ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ పరాజయం పొందడం గమనార్హం.
చీఫ్ విప్ సహా విప్‌ల ఓటమి
శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లుగా పనిచేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా పరాజయం పాలయ్యారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బరిలో దిగలేదు. పోటీ చేసిన ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ (వరంగల్ పశ్చి మ), బాల్క సుమన్ (చెన్నూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), గొంగిడి సునీత (ఆలేరు) ఓటమి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment