హ్యాట్రిక్‌పై బీఆర్‌ఎస్‌ ధీమా!  | BRS confident on hat trick win | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌పై బీఆర్‌ఎస్‌ ధీమా! 

Published Fri, Dec 1 2023 12:58 AM | Last Updated on Fri, Dec 1 2023 9:00 AM

BRS confident on hat trick win - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో పార్టీ సాధించబోయే ఫలితంపై బీఆర్‌ఎస్‌ పోస్టుమార్టం ప్రారంభించింది. 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పార్టీ సొంత బలంతోనే వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పోలింగ్‌ ముగిశాక తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు భిన్నంగా ఆదివారం వెలువడే ఫలితాలు ఉంటాయని బీఆర్‌ఎస్‌ గట్టిగా విశ్వసిస్తోంది. సీఎం కేసీఆర్‌ దంపతులు గురువారం ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లి సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తిరిగి ఫామ్‌హౌజ్‌కు చేరుకున్న కేసీఆర్‌.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తూ పార్టీ అభ్యర్థులు, నేతలకు ఫోన్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావు తాము ప్రాతినిధ్యం వహి స్తున్న సిరిసిల్ల, సిద్దిపేట సెగ్మెంట్లలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తూనే, తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. 

అధికారం ఖాయమంటూ వార్‌రూమ్‌ నివేదిక 
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వార్‌రూమ్‌లను ప్రారంభించింది. ఎన్నికల ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌ సహా అనేక అంశాలను అవి సమన్వయం చేస్తూ వచ్చాయి. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను అందజేశాయి. ఆ నివేదికల ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఫలితాలను బీఆర్‌ఎస్‌ అంచనా వేసుకుంది. ఈ క్రమంలో పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రతిపక్షాల కంటే ముందంజలో ఉన్నామని, అది కలసి వస్తుందని ధీమా గా ఉంది.

పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు, ప్ర భుత్వ పథకాల లబ్దిదారులు, విద్యావంతులైన యు వత, క్షేత్రస్థాయిలో పోల్‌ మేనేజ్‌మెంట్‌ అనుకూలించినట్టు భావిస్తోంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లబ్దిదారుల్లో 90శాతం మంది ఓటర్లు బీఆర్‌ఎస్‌కే ఓటేశారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడలేదని వార్‌రూమ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తంగా 40కిపైగా సీట్లలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించే పరిస్థితి ఉందని, ఇది కాంగ్రెస్‌కు పగ్గాలు వేసిందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని లెక్కలు వేసుకుంటోంది. కేవలం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ తమపై పైచేయి సాధించే అవకాశం ఉన్నట్టు పోలింగ్‌ సరళిని బట్టి అంచనాకు వస్తోంది. 

వర్గాల వారీగా లెక్కలు.. 
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో గ్రామీణ ప్రాంత యువత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్‌ కంటే బీజేపీకే ఎక్కువ పడ్డాయని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. తొలిసారి ఓటు హక్కు పొందిన వారిలో మెజారిటీ ఓటర్లు బీఆర్‌ఎస్‌కే వేశారని అంటోంది. క్షేత్రస్థాయిలో చాలాచోట్ల కాంగ్రెస్‌కు పటిష్ట యంత్రాంగం లేకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అనువుగా మల్చుకోవడంలో సఫలమయ్యారని క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏజెన్సీలు పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక క్షేత్రస్థాయిలో సామాజికవర్గాల వారీగా ఓటింగ్‌ తీరునూ బీఆర్‌ఎస్‌ మదింపు చేస్తోంది. దళితబంధు, బీసీ బంధు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువత అంశాలతోపాటు పార్టీ అభ్యర్థులపై, వారి అనుచరులపై వ్యతిరేకత వంటివి కొంత మేర ప్రతికూలత చూపినట్టు భావిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement