ఆటా.. పాట.. అండాదండ | BRS is advancing with the strength of voice | Sakshi
Sakshi News home page

ఆటా.. పాట.. అండాదండ

Published Sat, Oct 28 2023 2:25 AM | Last Updated on Sat, Oct 28 2023 2:25 AM

BRS is advancing with the strength of voice - Sakshi

‘‘నడువు నడువు నడువవే రామక్కో..  కలిసి నడుము కట్టవే రామక్కా.. గులాబీల జెండలే రామక్కా..’’ 
భారత్‌ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార రథాలు, బహిరంగ సభా వేదికలపై నుంచి మార్మోగుతున్న పాట ఇది. కల్వకుర్తి రైతుకూలీ కొమ్ము లక్ష్మమ్మ గళం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి లక్షలాది ‘వ్యూ’లతో దుమ్ము రేపుతోంది.

ఈ తరహా పాటలు, లక్ష్మమ్మ లాంటి వందలాది గొంతులను ఎన్నికల ప్రచార సభలో పదునైన ఆయుధంగా వాడుతున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌. వాస్తవానికి రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ ‘పాట’ను ముందు భాగంలో నిలిపి తన ఎజెండాను జన సామాన్యంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ‘గళబలం’తో బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది.  

ఉద్యమంలో అగ్రస్థానం..: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో స్థానిక చరిత్ర, సంస్కృతి, అమరుల త్యాగాలు, కరువు దుఃఖాన్ని ప్రతిబించిబే పాటలతో ప్రజల్లో భావ వ్యాప్తి ద్వారా చైతన్యం నింపేందుకు కేసీఆర్‌ అధిక ప్రాధాన్యతనిచ్చారు. కొన్నిసార్లు తానే స్వయంగా కలం చేతబూని కొత్త పాటలు సృష్టించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక ‘ధూం ధాం’ వంటి వేదికల ద్వారా వందలాది మంది తెలంగాణ కవి గాయకులు తమ ఆట పాటలతో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చారు.  

ఎన్నికల ప్రచారంలోనూ..: తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ పాటను ఆలంబనగా చేసుకుని జన సామాన్యానికి చేరువైంది. ఉద్యమ కాలం నాటి ‘ఎనుకముందు జూసుడేంది రాజన్న.. ఓ రాజన్న .. ఎత్తుర తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న’, ‘మన ఓటు మన తెలంగాణకే అన్నో రామన్నా.. మన ఓటు మన కారు గుర్తుకే అక్కో సీతక్కా..’ అంటూ తెలంగాణ తెగువను, చైతన్యాన్ని గుర్తు చేస్తూ 2014 ఎన్నికల ప్రచారంలో జనంలోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌ తొలిసారిగా అధికారాన్ని చేపట్టింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ‘మానవతకు మారు పేరు కేసీఆర్‌ సారూ.. మళ్లీ గెలిచి రావాలె.. మనసుగల్ల సర్కారు’ అంటూ బీఆర్‌ఎస్‌కు మద్దతుగా పాటలు కట్టిన కవులు, గాయకులు పార్టీ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లోనూ పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వ విజయాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనం భాషలో వివరిస్తూ కళా బృందాలు ఆడి పాడుతున్నాయి.  

అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించారు 
ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వందలాది కళాలు, గలాలు పుట్టుకొచ్చి తెలంగాణ కరువు, దుఃఖాన్ని కళ్లకు కట్టాయి. ఓ వైపు తెలంగాణ సంస్కృతిని చాటుతూనే మరోవైపు రాష్ట్ర సాధన వైపుగా జనసామాన్యాన్ని చైతన్యవంతులను చేశాయి. కవులు, కళాకారులను కరివేపాకులా తీసేయకుండా వారికి అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌దే. – దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ 

పాట బలం తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ 
పాట బలాన్ని తెలుసుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌. ఎన్నికల ప్రచారసభల్లో తెలంగాణ తెచ్చిన వారిని, అభివృద్ధి బాటను చూపిన వారిని గుర్తుంచుకోండి అని ఆట పాటలతో ప్రజలకు చెబుతున్నాం.     – పెద్దింటి మధుప్రియ 

పాటకు గొడుగు పట్టిందే కేసీఆర్‌ 
రాజకీయం పాటను ఎప్పుడూ స్వార్ధానికే వాడుకుంది. కానీ పాటను మరిచిపోకుండా అక్కున చేర్చుకుని గౌరవించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమే. ఉద్యమ కాలం నాటి కలాలు, గళాలను రాజకీయ అందలం ఎక్కించిన ఘనత కేసీఆర్‌దే. – మిట్టపల్లి సురేందర్, కవి, గాయకుడు

పాటకు పదవులు 
తమ కలాలు, గళాలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కవి గాయకులు పలువురిని.. రాష్ట్రం సాధించి అ«ధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ తగిన విధంగా అందలమెక్కించారు. 580 మంది కవులు, కళాకారులకు ‘సాంస్కృతిక సారధి’ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో మమేకం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక విభాగాన్ని ముందుండి నడిపిన రసమయి బాలకిషన్‌ ఇప్పటికే రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు.

తెలంగాణ వాగ్గేయకారుడిగా పేరొందిన గోరట వెంకన్న గవర్నర్‌ కోటాలో, ఉద్యమాన్ని తన పాట, మాటతో ఉర్రూతలూగించిన కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రచార వేదికలపై అంతా తానై వ్యవహరించిన గాయకుడు వేద సాయిచంద్‌కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించారు.

ఆయన ఆకస్మిక మరణానంతరం భార్య రజనికి కార్పొరేషన్‌ పదవి ఇవ్వడం, ఆర్థికంగా ఆదుకోవడం వంటివి కళాకారుల్లో సరికొత్త ఆత్మ విశ్వాసాన్ని, భరోసాను నింపాయి. సాయిచంద్‌ మరణం తర్వాత జరుగుతున్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మిట్టపల్లి సురేందర్, పెద్దింటి మధుప్రియ, ఏపూరి సోమన్న తదితరులు బీఆర్‌ఎస్‌ ఆటపాటల బాధ్యతను తలకెత్తుకున్నారు.  

- కల్వల మల్లికార్జున్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement