సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో నియోజకవర్గంలో బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బూత్ కమిటీలను నియమించిన పార్టీ.. కుల సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను రంగంలోకి దింపింది.
ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు చేరికలపైనా ఫోకస్ చేసింది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రకటన వెలువడకముందే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది. దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు వంటి సంక్షేమ పథకాల్లో ఎక్కువ యూనిట్లు కేటాయించారు. మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. ఆలయాలు, కుల సంఘాల భవనాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. కేసీఆర్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక మంత్రి కేటీఆర్ కామారెడ్డిపై ఫోకస్ మరింత పెంచారు.
బూత్ కమిటీలతో ప్రచారం..: 266 పోలింగ్ బూత్‌లుండగా, ప్రతి బూత్‌కు పది మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి చెందిన గ్రామ/మండల/ నియోజకవర్గ/ జిల్లా స్థాయి లీడర్‌ను బూత్ కమిటీకి ఇన్‌చార్జ్‌గా నియమించారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్ ఉండేలా బూత్ కమిటీలు ఏర్పాటయ్యాయి. రోజూ బూత్ కమిటీ సభ్యులు తమకు కేటాయించిన యాభై మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, మేనిఫెస్టోను వివరించడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి జరిగిన ప్రయోజనాలను చెప్పి ఓట్లు అభ్యర్థించాలన్నది ఈ కమిటీల ఏర్పాటు ఉద్దేశం.
కుల సంఘాలతో ములాఖత్‌లు..: వివిధ కుల సంఘాలతో ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు సమావేశమవుతున్నారు. ఆదివారం మైనారిటీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. బీఆర్‌ఎస్ మైనారిటీల సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను వివరించారు. సీఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గౌడ కులస్తులతో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. రెడ్డి సంఘం సమావేశానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. ఆ సమావేశం వాయిదా పడింది.
పద్మశాలి కులస్తులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు. ఎస్సీ కుల సంఘాలతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రసమయి హాజరుకావాల్సి ఉండగా.. ఆయన కార్యక్రమం రద్దయింది. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎమ్మెల్సీ సుభా‹Ùరెడ్డి ఆ సమావేశంలో పాల్గొని ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. యూత్‌తో నిర్వహించే సమావేశానికి బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌లను రప్పిస్తున్నారు. ఇలా కామారెడ్డిలో విజయం కోసం బీఆర్‌ఎస్ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment