సాక్షి, హైదరాబాద్: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అధికార పీఠానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. ఎన్నికల ఫలితాలను వివిధ కోణాల్లో విశ్లేషిస్తూనే మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. పార్టీ తరఫున గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో పాటు ఓడిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌కు బారులు తీరుతున్నారు.
ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమని తనను కలిసిన నేతలకు సర్ది చెబుతూనే నిరంతరం ప్రజల్లో ఉండేందుకు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కేడర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడంతో పాటు వారిలో ధైర్యం నింపాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తాజాగా నేతలకు విజ్ఞప్తి చేశారు.
దీంతో ఎమ్మెల్యేలతో పాటు ఓటమి పాలైన నేతలు మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని, తాము అండగా ఉంటామంటూ కేడర్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం ప్రారంభించారు.
క్షేత్ర స్థాయి కార్యకలాపాలపై దృష్టి
పార్టీకి 60 లక్షల మంది పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కకపోవడంపై బీఆర్‌ఎస్ లోతుగా విశ్లేషణ జరుపుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాలు, బూత్ ల వారీగా పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్లు, ప్రభావితం చేసిన అంశాలను పోస్ట్‌మార్టం చేస్తోంది. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగం విఫలమైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల వల్ల కూడా నష్టం జరిగినట్లు అంచనా వేసింది. ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపా లు నిర్వహించడం, ద్వితీయ శ్రేణి యంత్రాంగంపై పార్టీ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓటమికి కారణమైందనే నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణలో భాగంగా క్షేత్రస్థాయి కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
పార్టీ జిల్లా కార్యాలయాల్లో కార్యకర్తలకు శిక్షణ
తెలంగాణ భవన్ పేరిట అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించినా నేటికీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా కార్యకర్తలకు నిరంతరం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయా లని పార్టీ నిర్ణయించింది. కొత్త తరానికి తెలంగాణ ఉద్యమం, బీఆర్‌ఎస్ పాత్ర, పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి తదితరాలను వివరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో కేడర్‌కు సోషల్ మీడియా ద్వారా చేయాల్సిన ప్రచా రంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలిస్తూ లోపాలపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందించేందుకు వీలుగా ‘వార్‌రూమ్’ను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇకపై కేటీఆర్ ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో తెలంగాణ భవన్‌లో నాయకులు, కేడర్‌కు అందుబాటులో ఉండేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. కాగా ఈ నెల 9న పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రజల హక్కుల కోసం కొట్లాడుతాం: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన పార్టీగా బీఆర్‌ఎస్ ప్రజల గొంతుకై పనిచేస్తుందని, ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుందని కేటీఆర్ చెప్పారు. బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు.
అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ పడొద్దని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని చెప్పారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసిన వాళ్లు సైతం ఫోన్లు చేసి, వీడియో మెసేజ్‌లు పెట్టి.. కేసీఆర్ సీఎం కాలేదా? అని బాధపడుతున్నారని తెలిపారు.
ఇప్పుడు కూడా ప్రజలు మనకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తదితర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, కర్నె ప్రభాకర్‌లు కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment