ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్‌కన్నా తక్కువ ధరకు లభించే పవర్ ఎక్స్ఛేంజీల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా 2023 డిసెంబర్ నుంచి 2025 జనవరి మధ్య రూ. 982.66 కోట్లు ఆదా చేశామని ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పవర్ ఎక్స్ఛేంజీల్లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్న సమయాల్లో విద్యుత్ వేరియబుల్ కాస్ట్ అధికంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి ఈ మేరకు డబ్బు ఆదా చేశామని పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులపై ఆ మేరకు ఆర్థిక భారం తప్పిందన్నారు. దీన్ని కేంద్రం సైతం గుర్తించి తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్‌ను దేశంలోనే అత్యుత్తమైన ఎస్‌ఎల్డీసీగా ఎంపిక చేసి గతేడాది డిసెంబర్ 14న పురస్కారం అందించిందని గుర్తుచేశారు.గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తయారైన విద్యుత్ యూనిట్
ధర సగటున రూ. 3.97 నుంచి రూ. 4.18గా ఉండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ (ఉత్పత్తి తగ్గించి) చేసి పవర్ ఎక్స్ఛేంజీల నుంచి రూ. 2.69 నుంచి రూ. 2.82 సగటు ధరతో విద్యుత్ కొన్నామని కృష్ణ భాస్కర్ ఆ ప్రకటనలో వివరించారు. దీంతో డిసెంబర్‌లో రూ. 196.68 కోట్లు, జనవరిలో రూ. 185.27 కోట్లు ఆదా అయ్యాయన్నారు. దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాల ద్వారా 9,134 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభ్యతగా ఉండటంతో విద్యుత్ కొనుగోళ్లు తప్పవన్నారు.
విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డు
రాష్ట్రంలో గురువారం గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి ఏకంగా 15,752 మెగావాట్లకు ఎగబాకింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్. గతేడాది మార్చి 8న ఏర్పడిన 15,523 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటివరకు అత్యధికంకాగా దాన్ని తాజాగా రాష్ట్రం అధిగమించిందని ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. వేసవిలో గరిష్ట డిమాండ్ 17,000 మెగావాట్లకు పెరిగినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లతో నష్టమే: ఎం.వేణుగోపాల్‌రావు
ట్రాన్స్‌కో సీఎండీ వాదనను విద్యుత్‌రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు తోసిపుచ్చారు. ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్ల కోసం అధికంగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఎక్స్ఛేంజీల నుంచి యూనిట్‌కు రూ. 2.82 ధరతో విద్యుత్ కొనుగోలు చేయగా ఆ మేరకు బ్యాక్‌డౌన్ చేసిన విద్యుత్ స్థిర చార్జీ యూనిట్‌కు రూపాయిన్నరగా ఉన్నా మొత్తం యూనిట్ విద్యుత్ ధర రూ. 4.32కు పెరిగిపోతుందన్నారు. మరోవైపు బ్యాక్‌డౌన్ చేసిన విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 4.15 మాత్రమే ఉండటంతో వాస్తవానికి డిస్కంలు యూనిట్‌కు అదనంగా 0.17 పైసలు నష్టపోయాయని తేల్చిచెప్పారు. బ్యాక్‌డౌన్ చేసి ఉత్పత్తి తగ్గించిన విద్యుత్‌కు సంబంధించిన మొత్తం స్థిర ధరలు చెల్లించాల్సి ఉంటుందని.. సగటు స్థిర చార్జీలు కాదన్నారు. దీనికితోడు ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొంటే ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు, ట్రాన్స్‌మిషన్ నష్టాలు భరించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment