ఎండల వల్ల అత్యధికంగా నమోదవుతున్న విద్యుత్ డిమాండ్
సబ్ స్టేషన్లలో ట్రాన్స్ ఫార్మర్లపై భారీగా పడుతున్న భారం
విద్యుత్ స్థంభాలపై ట్రాన్స్‌ఫార్మర్లు తొలగించే ప్రయత్నం
రాష్ట్రంలో విద్యుత్ కోతలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: వేసవి ఉష్ణోగ్రత విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా మండిపోతున్న ఎండలు, వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు వంటి విపత్తుల కారణంగా కరెంటును పంపిణీ చేసే ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సబ్ స్టేషన్లు అగ్ని గుండంలా మారుతున్నాయి. సాధారణంగానే వాటి వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఆ పరిధిని మించి వేడి తరంగాలు చుట్టుముడుతున్నాయి.
పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేసేలా చర్యలు
ఎండలకు భయపడి జనం బయటకు రావడం తగ్గించారు. పాఠశాలలకు సెలవులు. అవుట్‌డోర్ వర్క్స్ లేవు. ఇంట్లో ఉండి అన్ని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎసీల వినియోగం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై ఊహించని భారం పడుతున్నది. ఒక ఇంటిలో ఒక ఏసీ వాడితే వచ్చే లోడ్ అకస్మాత్తుగా 500 వాట్స్ నుంచి 2 వేల వాట్స్‌గా మారుతోంది. ఇది రాత్రి సమయంలో సాధారణ హౌస్ డ్రాల్ కంటే 3 రెట్లు ఎక్కువ. దీనివల్ల ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువకు విద్యుత్ డిమాండ్‌కు చేరుకుంది.
ఇంతలా కరెంట్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండడం విశేషం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే దీనికి కారణం. అయితే సాధారణ లోడ్ ఉన్పప్పుడు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ చమురు ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు ఉంటుంది. కానీ అసాధారణ లోడ్, వేడి వల్ల ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ 70 నుంచి 80 డిగ్రీల వేడి ఉంటోంది.
విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తూ, ట్రాన్స్‌ఫార్మర్లæ నిర్వహణను చూస్తున్న అధికారులు, సిబ్బంది ఇంత వేడిలో అక్కడ పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాలో ఆటంకం కలుగకూడదని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తూ, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేసేలా చేస్తున్నారు.
అన్నిటా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లు
రాష్ట్రంలో అన్ని చోట్లా పిల్లర్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రమే పెట్టాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. అంటే అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల వద్ద పెట్టినట్లు గృహ, వ్యవసాయ అవసరాలకు కూడా సిమెంటు దిమ్మలపై ట్రాన్స్‌ఫార్మర్లను పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల విద్యుత్ స్థంభాల మీద ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అవి గాలి, వానకు పడిపోతున్నాయి.
స్థంభం కూలిపోతే, దానిపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చడానికి సమయం పడుతోంది. ఈ లోగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అలాంటి ట్రాన్స్‌ఫార్మర్లు తీసేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల 30 నుంచి 40 ఏళ్ల పాత కండక్టర్లు ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. దీంతో కొద్దిపాటి గాలివాన, ఎండకే అవి తెగిపోతున్నాయి. వాటిని పూర్తిగా మార్చేసి, కొత్త లైన్లు వేసే పనిలో విద్యుత్ శాఖ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment