ఎస్సై సాయికుమార్‌తో పాటు మరో ఇద్దరిదీ అదే పరిస్థితి
మూడు మరణాల కేసులో కొనసాగుతున్న విచారణ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరో యువకుడు మునిగి చనిపోయిన సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. వారి మరణానికి గల కారణాలతో పాటు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెరువు నీటిలో ముగ్గురు పడిపోవడంతో జాలర్ల సాయంతో గాలించి వారి మృతదేహాలను బయటకు తీసిన విషయం తెలిసిందే.
కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలించిన అధికారులు.. శ్రుతి, నిఖిల్‌లు పెళ్లి చేసుకోవాలనుకున్నారని గుర్తించారు. తర్వాత వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయోనన్న దాని గురించి ఆరా తీస్తున్నారు. వారు చెరువు వద్దకు వెళ్లి అక్కడ చర్చించుకున్న సమయంలో, చెరువులో దూకినపుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన చెరువు కావడంతో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఎక్కడా లేవు. ఆ రోజు చేపల వేటకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో ఈ ఘటన ఎవరి కంటా పడలేదని భావిస్తున్నారు.
ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..
వివిధ కోణాల్లో దర్యాప్తు
ముగ్గురి మరణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాల్‌డేటాను పరిశీలించిన అధికారులు వాట్సాప్ చాటింగ్‌లపై దృష్టి సారించారు. అయితే ఫోన్లు లాక్ అయి ఉండడంతో వాటిలో నుంచి సమాచారం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ సింధుశర్మ కేసు పరిశోధన గురించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా కేసు దర్యాప్తు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు కొలిక్కి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నీరు మింగి..
భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, అలాగే నిఖిల్ నీట మునిగింది లోతైన ప్రదేశంలో కావడంతో అందులో పడగానే లోపలికి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలు దొరికిన ప్రదేశం దాదాపు పదిమీటర్ల లోతు ఉంటుందని అంటున్నారు. ముందు ఎవరో ఒకరు దూకి ఉంటారని, వారిని కాపాడే క్రమంలో మి గతా ఇద్దరూ ఒకరి వెంట ఒకరు దూకి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ముగ్గురికీ ఈత రాదని తెలుస్తోంది. లోతైన ప్రాంతంలో దూక డంతో ముగ్గురూ నీట మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టుల్లో నీళ్లు మింగే చనిపోయారని వెల్లడైంది.
ఆత్మహత్యలా.. హత్యలా?
Comments
Please login to add a commentAdd a comment