విద్యార్థిని స్రవంతి మృతదేహం
షాద్‌నగర్‌రూరల్: కన్న కూతురుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు.. విద్యాబుద్దులు నేర్చి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలుస్తుందని కలలు కన్నారు.. కానీ ఆ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. భవిష్యత్తును తేల్చే పరీక్షలను రాసి తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబలించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఇంటర్మీడియట్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన శనివారం షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకంది. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొందుర్గు మండలం పర్వతాపూర్‌కు చెందిన మంగలి శ్రీనివాసులు, అనురాధ దంపతుల కూతురు మంగలి స్రవంతి(17) షాద్‌నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
రోజూ పర్వతాపూర్ నుంచి షాద్‌నగర్‌కు వచ్చి విద్యను అభ్యసిస్తుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా శనివారం విశ్వభారతీ జూనియర్ కళాశాలలో కేటాయించిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాలనీ మీదుగా బస్టాండ్‌కు బయలుదేరింది. మోర్ సూపర్ మార్కెట్ ఎదుట నుంచి ఆర్టీసీ కాలనీకి వెళ్లే మార్గంలో ఇనుప రాడ్డులతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యార్థిని స్రవంతిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇనుప లోడుతో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ స్రవంతి తలపై నుంచి వెళ్లడంతో తల పూర్తిగా చిట్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్రవంతి మృతదేహన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment