హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని రెండు నెలలు గడవక ముందే ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన పుట్టి శ్రీనివాస్, కర్కల్‌పహాడ్ గ్రామానికి చెందిన సంతోష(19) పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్ తన అక్కను తీసుకురావడానికి కుల్కచర్లకు వెళ్లాడు.
సంతోష మామ సత్తయ్య, అత్త యాదమ్మ కూలీ పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసుకుని సంతోష ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనులకు వెళ్లిన అత్తమామలు సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి లోపలి నుంచి తలుపులు వేసి ఉండటంతో ఇరుగు పొరుగు వారితో కలిసి తలుపులను పగులగొట్టి చూడగా సంతోష ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ ఉపేందర్, ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోష తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంతోష భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment