ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్న దృశ్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు, దాని చుట్టుపక్కల పల్లెలను అధికారులు శనివారం జల్లెడ పట్టారు. చేగూరుకు చెందిన మహిళ కరోనా వైరస్‌తో మృతిచెందిన నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం నివారణ చర్యలు చేపట్టింది. కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశాలతో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌శాఖ అధికారులతో కూడిన 50 బృందాలు ప్రతి ఇంటినీ సర్వే చేశాయి. చేగూరు, కన్హా శాంతివనం, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ, రెడ్డి కాలనీల్లోని 2,680 మంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 767 ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు. ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీరందరికీ 14 రోజుల హోం క్వారంటైన్ విధించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. కన్హా శాంతివనంలో పనిచేస్తున్న 800మంది కూలీల చేతులపై హోం క్వారంటైన్ స్టాంప్‌లు వేశారు. చేగూరు గ్రామంలోకి రాకపోకలు నిరోధిస్తూ పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.
వారంతా క్వారంటైన్ కేంద్రాలకు..
కరోనా వైరస్‌తో మరణించిన మహిళతో 43 మంది సన్నిహితంగా మెలిగారని గుర్తించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న, ఆమె బతికున్న సమయంలో దగ్గరగా మెలిగిన, ఆమె కిరాణా దుకాణానికి వచ్చిన వినియోగదారులు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఆమెకు వైద్యం చేసిన ఇద్దరు ఆర్‌ఎంపీలు, ఒక వైద్యుడిని కూడా రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు తెలిసింది.
నిర్లక్ష్యం వహిస్తే కొరడా..
మహిళ మృతికి ముందు కరోనా వ్యాధి లక్షణాలున్నా.. అధికారుల దృష్టికి తేవడంలో నిర్లక్ష్యం వహించిన ఆర్‌ఎంపీల తీరును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మహిళకు ప్రాథమిక చికిత్స చేసిన చేగూరులోని ఆర్‌ఎంపీ ప్రతాప్‌రెడ్డి, షాద్‌నగర్‌లోని ఆర్‌ఎంపీ విఠలయ్య క్లినిక్‌లను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ అనిల్ వైద్యం చేశారు. ఈ ముగ్గురిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఫిర్యాదుతో షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
షాద్‌నగర్ పట్టణంలో మెడికల్ షాపులోనే వైద్యశాల నిర్వహిస్తున్న శ్రీనివాస దంత వైద్యశాల, సాయి వెంకటరమణ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ని సీజ్ చేశారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను రెవెన్యూ లేదా వైద్యాధికారులకు ఆర్‌ఎంపీలు, ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకులు తెలపాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ సర్క్యులర్ జారీచేశారు. కాగా, ఇటీవల రామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవాన్ని ఇటీవల కన్హా శాంతివనంలో నిర్వహించారు. దీనికి దేశవిదేశాల నుంచి 3 లక్షల మంది హాజరయ్యారు. దీంతో వైరస్ వ్యాప్తిపై స్థానికంగా ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment