న్యూఢిల్లీ: ఉత్తరాదిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి పొగమంచు ప్రధాన కారణంగా నిలిచింది. తాజాగా భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 11 గంటలు ఆలస్యమైంది. ఇలా రైలు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి సాంకేతిక లోపం కారణంగా సుమారు 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది.
ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుండి ఉదయం 5.40 గంటలకు బయలుదేరుతుంది. అయితే సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ సెమీ-హై స్పీడ్ రైలు ఉదయం నిర్ణీత సమయానికి బదులుగా సాయంత్రం గమ్యస్థానానికి చేరేందుకు బయలుదేరిందని పశ్చిమ మధ్య రైల్వే తాత్కాలిక ప్రజా సంబంధాల అధికారి (భోపాల్ డివిజన్) నావల్ అగర్వాల్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందన్నారు. అయితే రైలు సంబంధిత యాప్‌లతో సహా పలు మార్గాల ద్వారా ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.40 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌కు బయలుదేరాల్సిన రైలు రాకపోవడంతో రాణి కమలపాటి స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు నిరసన తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో కొంతమంది ప్రయాణికులు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (న్యూఢిల్లీకి వెళ్లేది)లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు బ్యాగులు పట్టుకుని పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. ఆదివారం రాత్రి 10.20 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి రాణి కమలాపతి స్టేషన్‌కు రావాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20172)లో సాంకేతిక లోపం తలెత్తిందని, సీ11 కోచ్ స్ప్రింగ్ పాడైందని అధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం రైలును యార్డుకు తరలించామని, అయితే లోపాన్ని సకాలంలో సరిదిద్దలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున రైలు బయలుదేరలేదన్నారు.
ఇది కూడా చదవండి: దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా
Comments
Please login to add a commentAdd a comment