mmts line
-
యాదాద్రికి ఎంఎంటీఎస్ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సువర్ణ యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక నగరంగా, అందమైన, ఆహ్లాదభరితమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా పనులు కొనసాగిస్తోంది. కానీ ఇక్కడికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రతిష్టాత్మకమైన ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. యాదాద్రి పునర్మిర్మాణ పనులను ప్రారంభించడానికి ముందే ప్రభుత్వం ఈ మార్గంలో రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు కోసం ఎంఎంటీఎస్ రైల్వే నెట్‌వర్క్‌ను యాదాద్రి సమీపంలోని రాయగిరి వరకు విస్తరించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రణాళికలను సైతం రూపొందించింది. కానీ నాలుగేళ్లుగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కాగితాల్లో ఉండిపోయింది. టెండర్లకే పరిమితం.. యాదాద్రికి రోడ్డు రవాణా మార్గంతో పాటు రైల్వే సదుపాయం కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో రైల్వేబోర్డు అప్పటికప్పుడు సర్వేలు పూర్తి చేసి ప్రాజెక్టు అంచనాలను రూపొందించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశలో భాగంగా ఘట్కేసర్ వరకు పనులు పూర్తి చేశారు. ఇక్కడి నుంచి నుంచి రాయగిరి 33 కిలోమీటర్ల మార్గాన్ని డబ్లింగ్ చేసి విద్యుదీకరించేందుకు ఎంఎంటీఎస్ రెండో దశలోనే భాగంగా రూ.330 కోట్ల వరకు అంచనాలు వేశారు. 2016లో ఈ ప్రతిపాదనలు సిద్దం చేసినప్పటికీ 2018 వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటికే ప్రాజెక్టు వ్యయం రూ.414 కోట్లకు చేరుకుంది. ఇదే ఏడాది దక్షిణమధ్య టెండర్లను ఆహ్వానించింది. కొన్ని నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. భూమి, ఇతర వనరులతో పాటు, ప్రాజెక్టు వ్యయంలో 59 శాతం రాష్ట్రం ఇవ్వాల్సి ఉంది. మిగతా 41 శాతాన్ని రైల్వే శాఖ భరిస్తుంది. పెరిగిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి కోసం దక్షిణమధ్య రైల్వే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ 2019 వరకూ సమ్మతి లభించకపోవడంతో టెండర్లు రద్దయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి సమ్మతి లభించినప్పటికీ ద.మ రైల్వే ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోసారి ఏ ప్రాతిపదికపై టెండర్లను ఆహ్వానించాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.50 కోట్లు కేటాయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని అందజేస్తే ముందుకు వెళ్లవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులోకి వస్తే.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, మౌలాలీ, చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. ప్రయాణికులు ఇప్పుడు చెల్లిస్తున్న రవాణా చార్జీలు సైతం సగానికి పైగా తగ్గుతాయి. నగరంలో ప్రస్తుతం ఎంఎంటీఎస్ చార్జీలు కనిష్టంగా రూ.5 నుంచి రూ.15 వరకు ఉన్నాయి. భవిష్యత్తులో చార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావించినా రూ.25 నుంచి రూ.30 లోపే రాయగిరి వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 5 కి.మీ రోడ్డు మార్గంలో వెళ్లాల్సిఉంటుంది. ఈ రూట్లో రైల్వే సదుపాయాలు విస్తరించడం వల్ల రియల్ఎస్టేట్ రంగంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బొల్లారం – సికింద్రాబాద్
సాక్షి, సిటీబ్యూరో: రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటికే విద్యుదీకరణ, రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు పూర్తి చేసుకున్న 12.5 కిలోమీటర్ల మల్కాజిగిరి–బొల్లారం ఎంఎంటీఎస్ రెండో దశ మార్గంలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇటు సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్ వరకు, అటు కాచిగూడ నుంచి మల్కాజిగిరి, బొల్లారం మీదుగా మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకలకు అవకాశం కలగనుంది. 2013లో రూ.810 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశలో మొత్తం 6 లైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బొల్లారం–మల్కాజిగిరి పూర్తయింది. త్వరలో పటాన్చెరు–తెల్లాపూర్, సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గాలు కూడా పూర్తి కానున్నాయి. రెండో దశకు అయ్యే వ్యయంలో సుమారు రూ.544 కోట్లను రాష్ట్రమే భరించాల్సి ఉండగా... గతంలో రూ.160 కోట్లు, ప్రస్తుతం రూ.50 కోట్లు కేటాయించింది. ఇంకా రూ.334 కోట్ల వరకు రాష్ట్రం అందజేయాల్సి ఉంది. మిగతా మొత్తాన్ని రైల్వేశాఖ భరిస్తోంది. సింగిల్ లైన్లను డబ్లింగ్ చేయడం, విద్యుదీకరించడం, అవసరమైన చోట కొత్తలైన్లు వేయడం వంటి నిర్మాణ పనులను ఈ ప్రాజెక్టు కింద చేపట్టారు. కొత్తగా ఎంఎంటీఎస్ రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. అలాగే అల్వాల్, సుచిత్ర, భూదేవీనగర్ తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు కూడా నిర్మించాల్సి ఉంది. ఆరేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టినప్పటికీ నిధుల కొరత, భూ సేకరణలో సమస్యలతో తీవ్ర జాప్యం జరిగింది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేసి విద్యుదీకరించాల్సి ఉంది. ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల కొత్త లైన్లు నిర్మించి, అక్కడ రైల్వే స్టేషన్ కట్టాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ జీఎమ్మార్ నిరాకరించడంతో అది వాయిదా పడింది. మిగతా సెక్టార్లలో పనులు కొనసాగుతున్నాయి. 2019 చివరి నాటికి దశలవారీగా ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎంఎంటీఎస్ టూ...లేట్
ఘట్కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్కేసర్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మరింత ఆలస్యం.. సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్‌ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరాశలో ప్రయాణికులు... ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి. –పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు -
ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌పై సందిగ్ధం
దగ్గరలో స్టేషన్ వద్దంటున్న జీఎంఆర్ కనెక్టివిటీ రద్దుచేసుకుంటామంటూ రైల్వేశాఖ లేఖ సమస్య పరిష్కారానికి సిద్ధమైన ప్రభుత్వం జీఎంఆర్- రైల్వే సంయుక్త సమావేశానికి నిర్ణయం హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైన్‌ను పొడిగించే విషయంలో రైల్వే-జీఎంఆర్ మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైను నిర్మించేందుకు ససేమిరా అంటున్న జీఎంఆర్ తీరుతో విసిగిపోయిన రైల్వేశాఖ.. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు లేఖ రాసింది. ఎంఎంటీఎస్ ప్రాజెక్టును రైల్వేతో కలసి చేపడుతున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం రెండు సంస్థలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వినకుంటే కనెక్టివిటీ ప్రతిపాదనే రద్దు చేసుకుంటాం... నగరంలో ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణ పనులను రాష్ర్ట ప్రభుత్వం-రైల్వే శాఖలు సంయుక్తంగా చేపట్టబోతున్నాయి. ఇప్పటికే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడంతో అదనపు లైన్ల నిర్మాణానికి కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఫలక్‌నుమా వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను రెండోదశలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. రైలు దిగి అక్కడి నుంచి ట్రాలీలో ప్రయాణికులు లేగేజీతో నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేవిధంగా స్టేషన్ నిర్మించాలని ఖరారు చేశారు. అయితే అంత దగ్గరలో స్టేషన్ నిర్మాణానికి జీఎంఆర్ ససేమిరా అంటోంది. ఎయిర్‌పోర్టుకు 3.2 కిలోమీటర్ల దూరం వరకే ఎంఎంటీఎస్‌ను పరిమితం చేయాలంటూ తేల్చిచెప్పింది. కానీ, అంతదూరంలో రైలు దిగితే ప్రయాణికులు మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో లోకల్ రైలును అక్కడి వరకు విస్తరించి ప్రయోజనం ఉండదని రైల్వేశాఖ వాదిస్తోంది. ఎయిర్‌పోర్టు సమీపంలో స్టేషన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే అక్కడకు కనెక్టివిటీ ప్రతిపాదననే రద్దు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయ స్థలం చూపితేనే... భవిష్యత్తులో విమానాశ్రయాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతోనే ఎంఎంటీఎస్ స్టేషన్‌ను దూరంగా నిర్మించాలని జీఎంఆర్ చెబుతోంది. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న స్థలంలో స్టేషన్ నిర్మించి, లైన్లు ఏర్పాటు చేస్తే విస్తరణకు స్థలం లేకుండా పోతుందనేది జీఎంఆర్ వాదన. ఒకవేళ ప్రభుత్వం ముందుగానే ప్రత్యామ్నాయంగా విమానాశ్రయానికి అనుకుని స్థలం ఇస్తే రైల్వే ప్రతిపాదనకు అంగీకరిస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశంలో వీటిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.