ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌పై సందిగ్ధం
దగ్గరలో స్టేషన్ వద్దంటున్న జీఎంఆర్
కనెక్టివిటీ రద్దుచేసుకుంటామంటూ రైల్వేశాఖ లేఖ
సమస్య పరిష్కారానికి సిద్ధమైన ప్రభుత్వం
జీఎంఆర్- రైల్వే సంయుక్త సమావేశానికి నిర్ణయం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైన్‌ను పొడిగించే విషయంలో రైల్వే-జీఎంఆర్ మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైను నిర్మించేందుకు ససేమిరా అంటున్న జీఎంఆర్ తీరుతో విసిగిపోయిన రైల్వేశాఖ.. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు లేఖ రాసింది. ఎంఎంటీఎస్ ప్రాజెక్టును రైల్వేతో కలసి చేపడుతున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం రెండు సంస్థలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
వినకుంటే కనెక్టివిటీ ప్రతిపాదనే రద్దు చేసుకుంటాం...
నగరంలో ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణ పనులను రాష్ర్ట ప్రభుత్వం-రైల్వే శాఖలు సంయుక్తంగా చేపట్టబోతున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించడంతో అదనపు లైన్ల నిర్మాణానికి కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఫలక్‌నుమా వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను రెండోదశలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. రైలు దిగి అక్కడి నుంచి ట్రాలీలో ప్రయాణికులు లేగేజీతో నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేవిధంగా స్టేషన్ నిర్మించాలని ఖరారు చేశారు. అయితే అంత దగ్గరలో స్టేషన్ నిర్మాణానికి జీఎంఆర్ ససేమిరా అంటోంది. ఎయిర్‌పోర్టుకు 3.2 కిలోమీటర్ల దూరం వరకే ఎంఎంటీఎస్‌ను పరిమితం చేయాలంటూ తేల్చిచెప్పింది. కానీ, అంతదూరంలో రైలు దిగితే ప్రయాణికులు మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో లోకల్ రైలును అక్కడి వరకు విస్తరించి ప్రయోజనం ఉండదని రైల్వేశాఖ వాదిస్తోంది. ఎయిర్‌పోర్టు సమీపంలో స్టేషన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే అక్కడకు కనెక్టివిటీ ప్రతిపాదననే రద్దు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
ప్రత్యామ్నాయ స్థలం చూపితేనే...
భవిష్యత్తులో విమానాశ్రయాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతోనే ఎంఎంటీఎస్ స్టేషన్‌ను దూరంగా నిర్మించాలని జీఎంఆర్ చెబుతోంది. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న స్థలంలో స్టేషన్ నిర్మించి, లైన్లు ఏర్పాటు చేస్తే విస్తరణకు స్థలం లేకుండా పోతుందనేది జీఎంఆర్ వాదన. ఒకవేళ ప్రభుత్వం ముందుగానే ప్రత్యామ్నాయంగా విమానాశ్రయానికి అనుకుని స్థలం ఇస్తే రైల్వే ప్రతిపాదనకు అంగీకరిస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశంలో వీటిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.